Digital Payment: బంగారం కొనుగోళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతి.. టాప్‌-5లో ఏపీ, తెలంగాణ

Digital Payment: కరోనా వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ ట్రాన్సాక‌్షన్స్‌ భారీగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు వివిధ రకాల బిల్లులను ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లిస్తున్నారు..

Digital Payment: బంగారం కొనుగోళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతి.. టాప్‌-5లో ఏపీ, తెలంగాణ

Digital Payment: కరోనా వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ ట్రాన్సాక‌్షన్స్‌ భారీగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు వివిధ రకాల బిల్లులను ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లిస్తున్నారు. చాలా మంది యూపీఐ పేమెంట్స్‌లోనే చేయడానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి విలువైన బంగారాన్ని సైతం ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు దూసుకుపోతున్నారు.

పెళ్లిలు, పేరంటాలకే కాదు పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేయడం అలవాటుగా మారిపోతుంది. దేశంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే రాష్ట్రంగా కేరళ మొదటి స్థానంలో నిలుస్తుంది. కానీ ఇప్పటికీ కేరళలో బంగారం కొనుగోలు విషయంలో పాత పద్దతినే అనుసరిస్తున్నారు. వ్యాపారుల వద్దకే వెళ్లి స్వయంగా పరిశీలించి బంగారం కొనుగోలు చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చే సరికి ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలుకు ఓకే చెప్పేస్తున్నారు. ఇటీవల ఫోన్‌ పే సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. దేశ్యాప్తంగా ఫోన్‌పే యాప్‌ ద్వారా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలువగా, వీటికంటే ముందు మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఫోన్‌పే యాప్‌ ద్వారా 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తెలంగాణ నంబర్‌ వన్‌:

ఫోన్‌పేకు తెలంగాణ ప్రజలు సై అంటున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఇతర యాప్‌ల కంటే ఫోన్‌పేను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఫోన్‌పే తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌క‌్షన్స్‌కి సంబంధించి యూనైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఏ) ఆధారంగా అనేక యాప్స్‌ సేవలు అందిస్తున్నాయి. అయితే తెలంగాణలో జరుగుతున్న ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక‌్షన్స్‌లో 42 శాతం తమ యాప్‌ ద్వారానే జరుగుతున్నాయని ఫోన్‌ పే వెల్లడించింది. తెలంగాణ తర్వాత గోవా 36 శాతం, హర్యానాలో 35 శాతం ఫోన్‌పే ద్వారానే ట్రన్సాక‌్షన్స్‌ జరుగుతున్నట్టు వెల్లడించింది.

ఫోన్‌పే అత్యధికంగా వినియోగిస్తున్నది ఈ రాష్ట్రమే..

కాగా, వినియోగదారుల సంఖ్యకు సంబంధించి ఫోన్‌పేను అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఫోన్‌పే యాప్‌ వినియోగం ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత ఫోన్‌ పే కస్టమర్ల సంఖ్య వంద శాతం పెరగగా, లావాదేవీల సంఖ్య 150 శాతం పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది.

ఇక ఆన్‌లైన్‌ ట్రాన్సాక‌్షన్స్‌కు సంబంధించి టైర్‌ 1 సిటీల్లో ఎక్కువగా వ్యాపార సంబంధమైన లావాదేలు జరుగుతున్నాయని తేలింది. అదే టైర్‌ 3 సిటీస్‌కు వచ్చే సరికి వ్యాపార లావాదేవీల కంటే ఇంటి అద్దె, హోటల్‌ బిల్లు ఇలా వ్యక్తి నుంచి వ్యక్తికి సంబంధించి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. టైర్‌ 3 సిటీస్‌లో వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే ఆర్థిక లావాదేవీల వాటా 49 శాతానికి చేరుకోగా, వ్యాపార సంబంధమైన లావాదేవీలు 32 శాతంగా ఉంది. అదే టైర్‌ 1 విషయంలో ఇక్కడ వ్యాపార లావాదేవీల వాటా 52 శాతంగా నమోదు కాగా, ఇక్కడ వ్యక్తుల నుంచి వ్యక్తులకు 36 శాతం, రీఛార్జీలు, కరెంటు బిల్లులు చెల్లింపులు 11 శాతంగా నమోదయ్యాయి.

Phonepe

Click on your DTH Provider to Add TV9 Telugu