చాలా మంది ఉద్యోగులు తాము ఉద్యోగ విరమణ తీసుకున్న తర్వాత ఇబ్బంది ఉండకూడదనే ముందు ఆలోచనతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. మరి కొంత మంది వారి పిల్లల పేరు మీద బ్యాంక్‌లలో తమ నగదు జమా చేస్తుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తున్నవడ్డీ రేట్లు కూడా అందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఇక వడ్డీ ఎక్కువ వస్తోందంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు..? అందుకే కొత్త ఏడాది(2023) ప్రారంభం నాటి నుంచే శ్రీరామ్ గ్రూప్ భారతీయ ఇన్వెస్టర్లకు ఎక్కువ రాబడి వచ్చేలా ఎఫ్‌డీ రేట్లను ప్రకటించింది. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త సంవత్సరంలో పెట్టుబడులు పెట్టే వారికి పెద్ద శుభవార్త అందించింది దేశంలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ అయిన శ్రీరామ్ గ్రూప్. ఎఫ్‌డిపై మంచి సంపాదన అవకాశాన్ని ప్రజల ముందుకు తెచ్చింది ఈ ఫైనాన్స్ కంపెనీ. కంపెనీ తన FD వడ్డీ రేట్లను భారీగా పెంచింది. శ్రీరామ్ ఫైనాన్స్ FD వడ్డీ రేట్లను 5 నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ నిర్ణయం తర్వాత.. కంపెనీ FDలపై చెల్లిస్తున్న వడ్డీ రేటు గరిష్ఠంగా 9.36 శాతానికి చేరుకుంది.
శ్రీరామ్ ఫైనాన్స్‌లో FD చేసిన వారికి బంపర్ వడ్డీ రాబడి అందుబాటులో ఉంది. 2023 ప్రారంభంతో కొత్త వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి FDపై 9.36 శాతం వరకు వడ్డీ రాబడిని పొందటానికి సదవకాశం లభించింది. అధిక వడ్డీ కావాలనుకునేవారికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిల్లో ఇది కూడా ఒక ఉత్తమమైన ఆప్షన్ అని చెప్పుకోవాలి. FDపై వడ్డీ పెరుగుదలతో పాటు అన్ని పునరుద్ధరణలపై 0.25 శాతం అదనపు వడ్డీ కూడా అందుబాటులో ఉంటుంది
శ్రీరామ్ ఫైనాన్స్ మారిన FD వడ్డీ రేట్ల వివరాలను వెల్లడించింది. ఆ క్రమంలోనే 12 నుంచి 60 నెలల వివిధ కాలపరిమితులకు అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లను కంపెనీ ప్రకటించింది. వీటిలో సాధారణ కస్టమర్లకు అందిస్తున్న రేట్ల కంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.50 శాతాన్ని శ్రీరామ్ గ్రూప్స్ ఫైనాన్స్ సంస్థ చెల్లిస్తోంది. అలాగే మహిళలకు FDపై 0.10 శాతం అదనపు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 12 నెలల పెట్టుబడి కాలానికి 7.30 శాతం వడ్డీని చెల్లిస్తుండగా.. 60 నెలల పెట్టుబడులపై గరిష్ఠంగా 8.45 శాతం చెల్లించేందుకు సిద్ధమైంది.
శ్రీరామ్ ఫైనాన్స్ కొత్త వడ్డీ రేట్ల ప్రకారం.. మహిళా సీనియర్ సిటిజన్ తన సొమ్మును 60 నెలల కాలానికి FDగా పెట్టుబడి పెట్టినట్లయితే ఆమెకు అత్యధికంగా 9.36 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. అదెలా అంటే.. 60 నెలల FDకి సాధారణ కస్టమర్లకు 8.45 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు 50 బేసిస్ పాయింట్ల చొప్పున అంటే 8.99 శాతం వడ్డీ చెల్లించబడుతుంది. అలా మహిళా సీనియర్ సిటిజన్లు 9.36%.. (8.45% + 0.10% + 0.50% + 0.25%) ప్రయోజనం పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి