AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTS: వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేసుకుంటే ఆ తర్వాత ఏడ్చి మొత్తుకున్నా బ్యాంకులు లోన్లు ఇవ్వవా

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్ (OTS) అనేది అప్పుల ఊబిలో ఉన్నవారికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను బాగా తగ్గిస్తుంది, భవిష్యత్తులో లోన్స్ పొందడాన్ని కష్టతరం చేస్తుంది. OTS వల్ల ఆర్థిక క్రమశిక్షణపై తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి, దీనికి వెళ్లే ముందు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడం చాలా ముఖ్యం.

OTS: వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేసుకుంటే ఆ తర్వాత ఏడ్చి మొత్తుకున్నా బ్యాంకులు లోన్లు ఇవ్వవా
Loan One Time Settlement
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2026 | 8:07 AM

Share

క్రెడిట్ కార్డులు, ఇతర లోన్స్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చాలామంది వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్ అనే పదం బాగా వినే ఉంటారు. అధిక వడ్డీలు, ఫైన్లతో అప్పుల భారం మోయలేని పరిస్థితుల్లో కొంతమంది దీనిని చిట్టిచివరి ఆప్షన్‌గా భావిస్తారు. అయితే, OTS అంటే ఏమిటి, దీనిని ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, భవిష్యత్ రుణాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం…

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్ అంటే ఏమిటి?

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్ అనేది లోన్ తీసుకున్న వ్యక్తి.. తన మొత్తం అప్పులో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లించి, రుణాన్ని పూర్తిగా పరిష్కరించుకునే పద్ధతి. సాధారణంగా, అప్పు తీర్చలేనివారు, అసలు కంటే వడ్డీ భారం ఎక్కువగా ఉన్నవారు, లేదా ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నవారు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. బ్యాంకులు కూడా అప్పును పూర్తిగా రద్దు (రైట్-ఆఫ్) చేయకుండా, కనీసం కొంత భాగాన్ని అయినా తిరిగి పొందడానికి OTS కు అంగీకరిస్తాయి.

ఆర్థిక మూలాలపై తీవ్ర ప్రభావం

OTS తాత్కాలికంగా రుణ భారం నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. OTS వల్ల మీ క్రెడిట్ స్కోర్ 50 నుంచి 100 పాయింట్ల వరకు పడిపోతుంది. మీ సిబిల్ (CIBIL) నివేదికలో క్లోజ్డ్ అని కాకుండా సెటిల్డ్ లేదా పార్షియల్లీ సెటిల్డ్ అని కొన్నేళ్లపాటు ఉంటుంది.

భవిష్యత్ రుణాలపై ప్రభావం

సెటిల్డ్ హోదా ఉన్నవారికి భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు ఆర్థిక క్రమశిక్షణ లేదని భావిస్తాయి. హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ వంటివి పొందే చాన్స్ దాదాపు కోల్పోతారు. అలాగే, కొత్త క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడతాయి. మీరు యంగ్ ఏజ్‌లోనే OTS చేసుకుంటే భవిష్యత్ కీలక దశల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

ప్రత్యామ్నాయాలు, పరిగణించాల్సిన అంశాలు

OTS కు వెళ్లే ముందు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం చాలా ముఖ్యం…

పొదుపులు, ఎఫ్‌డీలు:  మీకు పొదుపులు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఉంటే, వాటిని బ్రేక్ చేసి అప్పు తీర్చడానికి ప్రయత్నించండి.

బ్యాంకర్లతో చర్చలు: బ్యాంకులు వడ్డీని తగ్గించగలవేమో లేదా చెల్లింపు వ్యవధిని పొడిగించగలవేమో చర్చించండి.

క్రెడిట్ కౌన్సిలింగ్: ఆర్థిక నిపుణులను సంప్రదించి ఇతర మార్గాలను అన్వేషించండి.

OTS తప్పనిసరి అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

OTS అనివార్యం అని నిర్ణయించుకున్నాక, గరిష్ట ప్రయోజనం పొందేలా చూసుకోండి. బ్యాంకర్ల నుండి వీలైనంత ఎక్కువ సమయం తీసుకోండి. చెల్లింపుల వివరాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), డిక్లరేషన్ వంటివి తప్పకుండా లేఖ రూపంలో పొందండి. భవిష్యత్తులో ఏదైనా చట్టపరమైన సమస్యలు లేదా క్రెడిట్ బ్యూరోల దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ ఆధారాలు మీకు సహాయపడతాయి.

ఆర్థిక క్రమశిక్షణ

OTS అనేది ఆర్థిక క్రమశిక్షణపై ఒక మచ్చ లాంటిది. సెటిల్‌మెంట్ తర్వాత మీరు క్రెడిట్ కార్డు బిల్లులు, EMIలు సకాలంలో చెల్లిస్తూ, క్రెడిట్ యూటిలైజేషన్ 30% లోపే ఉంచుకుంటూ ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. అసురక్షిత రుణాలకు దూరంగా ఉండటం మంచిది. క్రమంగా మెరుగైన క్రెడిట్ హిస్టరీని నిర్మించుకోవడం ద్వారా సిబిల్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. గోల్డ్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ వంటి సురక్షిత రుణాల విషయంలో OTS పరిస్థితి భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే బ్యాంకులు ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. చివరగా, OTS ఒక కీలకమైన నిర్ణయం. దీనిని తీసుకునే ముందు నిశితంగా ఆలోచించి, అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించి, ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది.

Also Read:   ప్రామిసరీ నోట్‌లో ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు వదిలేసుకోవడమే..

Follow Us