‘నాకు HIV అంత ప్రమాదం అని తెలీదు..’ కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్..
లవ్.. HIV క్రైమ్ కథా చిత్రమ్.. నెల కిందట సంచలనం రేపింది. కట్ చేస్తే.. ఇప్పుడు విషాదాంతమైంది. రాజు వెడ్స్ రాంబాయి మూవీ తరహాలో యువతికి HIV ఇంజెక్ట్ చేసిన ప్రియుడు జైలుపాలయ్యాడు. ప్రియురాలు మాత్రం మనోవేదనకు గురయింది. గుండెల్లో దాగిన బాధను ఎవరికీ చెప్పుకోలేక.. ఈ లోకం నుంచే దూరంగా వెళ్లిపోయింది. ఇంతకీ ప్రియురాలి సడెన్ డెసిషన్ వెనుక కారణమేంటి? ప్రేమించినవాడు ఇంత దారుణానికి ఒడిగట్టడమా? ఇంకేదైనా రీజన్ ఉందా?

రాజు వెడ్స్ రాంబాయి చిత్రం యదార్ధ గాథతో తెరకెక్కిన సినిమా. అచ్చంగా ఇలాగే హైదరాబాద్‌లో శివారులో ఓ ఘటన జరిగింది. కాకపోతే కాస్త కథ వేరు. తనకు HIV ఉందని పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతికి హెచ్‌ఐవీ ఇంజక్ట్ చేశాడో యువకుడు. ఫలితంగా అతను జైలుకెళ్లాడు.. ఒక్కసారిగా తన జీవితంలో వచ్చిన మార్పులతో ఆ యువతి డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని అన్నోజిగూడలో ఉండే మనోహర్‌కు మరదలు వరసయ్యే యువతితో పెళ్లి కుదిరింది. ఆల్‌రెడీ వాళ్లిద్దరూ ప్రేమించుకోవడంతో.. ఇరు కుటుంబాలు కూడా వారికి ఓకే చెప్పారు. పెళ్లి సందడి మొదలవుతుండగా కథ టర్న్ తీసుకుంది. మనోహర్ తండ్రి గతంలో HIVతో చనిపోయాడు. అతని తల్లికి కూడా ఆ మహమ్మారి ఉందని అందరికీ తెలుసు. ఎందుకైనా మంచిదని మనోహర్‌కు ఉప్పల్‌లోని ఓ ల్యాబ్‌లో టెస్టులు చేయించగా.. అతనికి HIV పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో యువతి పేరెంట్స్ మనోహర్‌కు తమ బిడ్డనిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించారు. తెలిసి.. తెలిసి తమ బిడ్డ జీవితం నాశనం చేయలేమని తేల్చేశారు.
పెళ్లి నిరాకరణతో మనోహర్.. కోపం కట్టలు తెంచుకుంది. ఆ అమ్మాయిని ఎలాగైనా తన భార్యను చేసుకోవాలని భావించాడు. తనకు కూడా హెచ్ఐవీ రక్తం ఎక్కిస్తే వల్ల ఇకపై వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయరని భావించాడు ఓ సిరంజీతో తన బ్లడ్ తీసి.. యువతికి ఇంజెక్ట్ చేశాడు. ఆ సంగతి ఎవరూ గమనించలేదు. ఆ యువతి ఎవరికీ చెప్పలేదు. రెండ్రోజుల తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో కూతుర్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు పేరెంట్స్. వైద్య పరీక్షలు చేయించే క్రమంలో.. ఆ యువతి మనోహర్ నిర్వాకాన్ని వివరించింది. అది విన్న పేరెంట్స్ షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనోహర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రక్త పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవీ నెగిటివ్ వచ్చిందని, రెండు నెలల తర్వాత మరోసారి టెస్టులు చేస్తే స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.
మనోహర్ జైలుకెళ్లాడు. HIV రక్తం విషయం తెలిసినప్పటీ నుంచి బంధువులు దూరం అయ్యారు. స్నేహితులు కూడా ఆమెను కలవడానికి ఇష్టపడలేదు. పలకరించడానికి వచ్చినవాళ్లు సైతం అదో మాదిరి చూపులు. దూరంగా ఉండి మాటలు. బయటకు వస్తే చాలు జనం తన గురించే చెవులు కొరుక్కోవడం.. తన జీవితంలో ఈ ఊహించని మార్పులతో యువతి తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయింది. క్షణం క్షణం నరకం అనుభవించింది. డిప్రెషన్, యాంగ్జైటీతో సతమతమైంది. ఈ పదాలు ఇప్పుడు చాలా కామన్ అయ్యాయి కానీ.. అవి ఎంత నరకమో వాటిని అనుభవించేవారికే తెలుస్తుంది. ఈ పరిస్థితులను ఆమె ఫేస్ చేయలేక పోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని.. తనువు చాలించింది. ప్రేమించకుండా ఉండాల్సింది.. కానీ అలా జరిగిపోయింది. కన్నవాళ్లు బాగా చూసుకున్నారు. కానీ గౌరవం, విలువ పోయాక బతకడం కష్టంగా ఉందని సూసైడ్‌నోట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. హెచ్‌ఐవీ అంత ప్రమాదమని నాకు తెలియదు. ఇంట్లోవాళ్లంతా చెప్పాక హెచ్‌ఐవీ ఎంత సీరియసో తెలిసిందనా ఆమె లేఖలో ప్రస్తావించింది. అమ్మా క్షమించు.. నువ్వు కష్టపడి చదివించినా నా జీవితం నాశనం చేసుకున్నా. మరో జన్మ ఉంటే నీ కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నా.. అని బాధాతప్త హృదయంలో రాసింది.
నిజంగా ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఎంత నరకం అనుభవిస్తారో మాటల్లో చెప్పడం కష్టం.. ఇంట్లోని పెద్దవాళ్లకు అసలు డిప్రెషన్ అంటే ఏంటో కూడా తెలీదు. నిజంగా ఈ తరహా ట్రామాకు లోనైన వాళ్లకు అధికారులు లేదా స్వచ్ఛంద సంస్థలు.. చేయూతగా నిలిచి వారికి భవిష్యత్‌పై భరోసా కల్పిస్తే ఈ పరిస్థితులు రావు. మంచి భవిష్యత్ ఉన్న ఓ చెల్లి భవిష్యత్ మనందరం కాపాడలేకపోయాం…
మనోహర్ కారణంగానే తన బిడ్డ చనిపోయిందని.. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు ఆమె తండ్రి. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించిన యువతి బాగుండాలని కోరుకుంటారు ఎవ్వరైనా. కానీ మనోహర్ మాత్రం HIV ఇంజెక్ట్ చేస్తే.. తననే పెళ్లి చేసుకుంటుందని దుర్మార్గంగా ఆలోచించాడు. అతని వికృత నిర్ణయం రమణి ప్రాణం తీసుకునేలా చేసింది. ఇక పెళ్లి చేసి బిడ్డను అత్తారింటికి పంపాలనుకున్న తల్లిదండ్రులు.. ఆమెను శ్మశానానికి సాగనంపడం అంతులేని విషాదం నింపింది.
Also Read: ప్రామిసరీ నోట్‌లో ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు వదిలేసుకోవడమే..
