Ola Roadster: ఢిల్లీ ఆటో షోలో మెరవనున్న రోడ్ స్టర్.. ప్రదర్శనకు సన్నాహాలు చేసిన ఓలా
ప్రపంచంలోని అన్ని దేశాల చూపూ ప్రస్తుతం ఇండియాపై పడింది. ఢిల్లీలో జరగనున్న ఓ వేడుక కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ రాజధానిలో జనవరి 17 నుంచి 22 వరకూ జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ షోకు ప్రపంచ వ్యాప్తంగా ఆటో దిగ్గజ కంపెనీలు రానున్నడమే దీనికి ప్రధాన కారణం. ఈ షోలో అనేక మోడళ్ల కార్లు, మోటారు సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించనున్నారు. ఈ షోలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అయిన ఓలా తన కొత్త మోటారు సైకిళ్లతో పాటు కొన్ని అవుట్ గోయింగ్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచనుంది.
ఓలా కంపెనీ నుంచి వివిధ రకాల మోడళ్ల స్కూటర్లు విడుదల అయ్యాయి. వాటి విక్రయాలు జోరుగా సాగాయి. ఎలక్ట్రిక్ మార్కెట్ లో ఓలాకు ప్రత్యేక స్థానం సంపాదించిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఓలా తన తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ను రోడ్ స్టర్ పేరిట విడుదల చేసింది. ఈ మోడల్ ఢిల్లీలో జరిగే ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. ఓలా రోడ్ స్టర్ సిరీస్ లో మూడు రకాల మోడళ్లు ఉన్నాయి. వాటికి రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్, రోడ్ స్టర్ ప్రో అనే పేర్లు పెట్టారు. రోడ్ స్టర్ ఎక్స్ అనేది అందుబాటు ధరలో లభించే మోడల్. దీనిలో మూడు బ్యాటరీ ప్యాక్ లు ఏర్పాటు చేశారు. వాటిలో 2.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ రూ,74,999, అలాగే 3.5 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ రూ.85,999, మూడోరకం 4.5 కేడబ్ల్యూహెచ్ రూ.99,999 ధరలో అందుబాటులో ఉన్నాయి. సింగిల్ చార్జితో సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు 124 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, 4.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
రోడ్ స్టర్ బైక్ కూడా మూడు రకాల బ్యాటరీ ప్యాక్ లో అందుబాటులోకి వచ్చింది. 3.5 కేడబ్ల్యూహెచ్ రూ.1.04 లక్షలు, 4.5 కేడబ్ల్యూహెచ్ రూ.1,19,999, అలాగే 6 కేడబ్ల్యూహెచ్ రూ.1,39,999కు అందుబాటులో ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ గంటలకు 126 కిలోమీటర్లు. సింగిల్ చార్జింగ్ పై 151, 190, 248 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 6.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్ఈడీ టచ్ డిస్ ప్లే ఆకట్టుకుంటోంది. రోడ్ స్టర్ సిరీస్ లో హై ఎండ్ వేరియంట్ గా ప్రోను తీసుకువచ్చారు. దీని గరిష్ట వేగం గంటకు 194 కిలోమీటర్లు. 9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ బైక్ రూ.1.99 లక్షలు, 16 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ బండి రూ.2.49 లక్షలకు అందుబాటులో ఉంది. సింగిల్ చార్జింగ్ పై 579 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీనిలో పది అంగుళాల టీఎఫ్టీ ఎల్ఈడీ డిస్ ప్లే ఉంది.
ఓలా నుంచి మరో రెండు కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి. ఎస్1జెడ్, జీఐపీ పేరుతో తక్కువ బడ్జెట్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్టు సమాచారం. స్వాప్ చేయగల బ్యాటరీ టెక్నాలజీతో వీటిని తీసుకురానున్నారు. ఖర్చు తగ్గింపులో భాగంగా కొన్ని ఫీచర్లు లేనప్పటికీ, మన పెట్టే డబ్బుకు మంచి పనితీరును అందిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి