రేపట్నుంచే అమల్లోకి జీఎస్టీ 2.0.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు.. దేనిపై ఎంత తగ్గనుందో తెలుసుకోండి!
దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త జీఎస్టీ 2.0 సవరణలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గిస్తున్నాయి. GST తగ్గింపు ప్రయోజనాన్ని కార్ల కంపెనీలు పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. మారుతి సుజుకి నుండి ల్యాండ్ రోవర్ వరకు, వివిధ కంపెనీల కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కాబట్టి ఏ కార్లపై ఎంత మేర ధరలు తగ్గనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

సెప్టెంబర్ 22 సోమవారం నుండి దేశ్యాప్తంగా జీఎస్టీ 2.0 సవరణలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు, వాటి విడిభాగాలపై GST 28 శాతం నుండి 18 శాతానికి తగ్గుతుంది. ప్రభుత్వ కోరిక మేరకు GST తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించాయి. కంపెనీలు విడుదల చేసిన వివరాల ప్రకారం.. మారుతి సుజూకీ కార్ల ధర రూ.1.29 లక్షల వరకు తగ్గుతుంది. ప్రీమియం కార్లైన ఆడి కార్ల ధర రూ.10 లక్షల వరకు తగ్గుతుంది. మెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ బ్రాండ్ల కొన్ని కార్ల ధరలు రూ.30 లక్షల వరకు తగ్గనున్నాయి.
హ్యుందాయ్ కార్లపై తగ్గనున్న ధరలు
- కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన కార్ల ధరలను రూ.2.4 లక్షల వరకు తగ్గించింది.
- ఐ10, ఆరా, క్రెటా, అల్కాజార్ కార్ల ధరలు రూ.70,000 కంటే ఎక్కువ తగ్గాయి.
మారుతి సుజూకీ కార్లపై తగ్గనున్న ధరలు
- రూ.4 లక్షల ఖరీదు చేసే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధర రూ.1.29 లక్షల వరకు తగ్గనుంది.
- అలాగే మారుతీ సుజూకీ ఆల్టో కె10 ధర కూడా లక్ష రూపాయలకు పైగా తగ్గనుంది.
- మారుతి సుజూకీ స్విఫ్ట్ కారు ధర రూ.84,600 తగ్గనుంద
టాటా మోటార్స్ కార్లపై తగ్గనున్న ధరలు
- టాటా మోటార్స్ కు చెందిన నెక్సాన్, హారియర్, సఫారీ వంటి 1,200 సిసి కంటే పెద్ద కార్ల ధరలు రూ. లక్ష వరకు తగ్గనున్నాయి.
- ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్, పంచ్ వంటి చిన్న కార్ల ధరలు రూ. 85,000 వరకు తగ్గనున్నాయి.
- మహీంద్రా థార్, స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యువి కార్ల ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి.
ప్రీమియం సెగ్మెంట్ కార్లపై భారీగా తగ్గనున్న ధరలు
- ఇక ప్రీమియం కార్ల సెగ్మెంట్‌లోని ల్యాండ్ రోవర్ కార్ల ధర రూ.30 లక్షల వరకు తగ్గనుంది
- ఆడి, బెంజ్ కార్ల ధరలు కూడా రూ.30 లక్షల వరకు తగ్గనున్నాయి.
- కియా, రెనాల్ట్, నిస్సాన్, టయోటా, హోండా, ఎంజి, వోక్స్‌వ్యాగన్, స్కోడా, జీప్, సిట్రోయెన్, మెర్సిడెస్-బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. దీనిని ఊహించి, ఆగస్టు నుండి భారతదేశంలో కార్ల అమ్మకాలు బాగా తగ్గాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లలో వాహన అమ్మకాలు ఎప్పుడూ లేనంతగా తగ్గుతాయని భావిస్తున్నారు. అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




