Mukesh Ambani: బిజినెస్ లోనే కాదు సామాజిక సేవలో రిలయన్స్.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో..
Mukesh Ambani: కేవలం వ్యాపారంలోనే కాక సమాజ సేవకు కూడా రిలయన్స్ భారీగానే వెచ్చించింది. కరోనా సమయంలో సంస్థ ఎంత ఖర్చు చేసిందంటే..
Mukesh Ambani: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యకలాపాలపై రికార్డు స్థాయిలో రూ.1,184.93 కోట్లు ఖర్చు చేసింది. అంటే ప్రతిరోజు సగటున రూ.3.24 కోట్లు సీఎస్‌ఆర్ కోసం వెచ్చించింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సరఫరా, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కంపెనీ ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
“2021-22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక బాధ్యత కార్యక్రమాలు, ఆరోగ్యం, కమ్యూనిటీల మెరుగుదల అనే అంశాలు కంపెనీ ఎజెండాలో ప్రధమ ప్రాధాన్యంగా ఉన్నాయి” అని కంపెనీ సీఎస్ఆర్ నివేదిక చెబుతోంది. అత్యవసర సమయంలో దేశవ్యాప్తంగా ప్రజల అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని కంపెనీ వెచ్చించింది. ఈ కాలంలో రిలయన్స్ మొత్తం రూ. 1,184.93 కోట్లను సీఎస్‌ఆర్ కార్యకలాపాలపై పేద ప్రజలకు సహాయం చేసిందని తెలుస్తోంది. సంస్థ తన CSR కార్యకలాపాలను ఛారిటబుల్ కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తోంది. ప్రస్తుతం నీతూ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
2021 చాలా అంచనాలతో ప్రారంభమైంది. అయితే.. ఈ సమయంలో అతిపెద్ద సంక్షోభం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో ఉద్భవించింది. ఇది దేశంతో పాటు ప్రపంచాన్ని సైతం తీవ్రంగా ప్రభావితం చేసింది. మహమ్మారి సమయంలో దేశం ఎదుర్కొంటున్న అవసరాలను తీర్చడానికి రిలయన్స్ ప్రయత్నించిందని నివేదిక వెల్లడించింది. ప్రజలు మహమ్మారి నుంచి కోలుకోవడానికి, వాటిని శక్తివంతం చేయడానికి రిలయన్స్ చేసిన ప్రయత్నాలు కొంత మేర సహాయపడ్డాయి. ఇది కేవలం CSR కోసమే కాదు. ఇది ప్రజల జీవితాలను, కలలను, భవిష్యత్తును రక్షించడం కోసమని రిలయన్స్ అభిప్రాయపడింది.