Jackie Shroff: రూ.లక్షతో రూ.100 కోట్లు.. జాకీ ష్రాఫ్ దంపతులను కోటీశ్వరులను చేసిన సూపర్ డీల్
ఒక్క నిర్ణయంతో జాకీ ష్రాఫ్ దంపతులు ఏకంగా రూ.100కోట్లకు పైగా లాభాలు అర్జించారు. అయితే ఆ ఒప్పందం ఒక్క రోజులో కాలేదు. సంవత్సం పట్టింది. ఆ తర్వాత కూడా అయేషా ష్రాఫ్ నిర్వహించిన ఓ పార్టీ వల్ల కుదిరింది. అసలు రూ.లక్ష పెట్టుబడితో రూ.100కోట్లు ఎలా సంపాదించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఒక చిన్న నిర్ణయం జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒక్కోసారి చిన్న పెట్టుబడి కోట్ల లాభాలు తెచ్చిపెడుతుంది. ఇలా జరగాలంటే సరైన టైమింగ్, స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఓ బాలీవుడ్ జంట అతి తక్కువ పెట్టుబడితో ఏకంగా రూ.100 కోట్ల లాభాలు గడించారు. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ నటులు సినిమాలే కాకుండా ఇతర బిజినెస్‌లతో బాగానే సంపాదిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ – ఆయేషా ష్రాఫ్ దంపతులు కూడా తెలివైన వ్యాపార నిర్ణయాలతో భారీ లాభాలను ఆర్జించారు. కేవలం లక్ష పెట్టుబడితో రూ.100 కోట్లు సంపాదించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయేషా ష్రాఫ్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
కథ మొదలైంది ఇలా..
దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో పలు అంతర్జాతీయ సంస్థలు దేశంలోకి అడుగుపెట్టాయి. ఇదే క్రమంలో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది దేశంలో ప్రారంభమైన సమయంలో జాకీ, ఆయేషా ఆ కంపెనీలో వాటాలు కొనుగోలు చేశారు. ఈ పెట్టుబడి నిర్ణయం వారి కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఆయేషాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది. ఆ సమయంలో ఆమెకు కార్పొరేట్ ప్రపంచంలో ఇది మొదటి అనుభవం కావడంతో ప్రతి అడుగు జాగ్రత్తగా వేశారు. కొత్త కంపెనీ ఎలా ఉంటుందోననే అనుమానాలకు తావులేకుండా ముందడుగు వేశారు.
15ఏళ్లలో రూ.100 కోట్లు..
‘బూమ్’ సినిమా విడుదలకు ముందు ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఆయేషా ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. జాకీని సంప్రదించి, ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఉన్న ఆర్.జి. క్లబ్‌లో ఒక గ్రాండ్ బాలీవుడ్ పార్టీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ పార్టీలో సినీ పరిశ్రమలోని ప్రముఖ తారలు చాలా మంది పాల్గొన్నారు. ఈ పార్టీ ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. ఈ పార్టీకి లభించిన స్పందన ఎంతగా ఉందంటే మరుసటి రోజు ఉదయం లాస్ ఏంజిల్స్ నుండి సోనీ అధికారి నుండి నేరుగా ఆయేషాకు ఫోన్ వచ్చింది. మరుసటి రోజే ఒప్పందంపై సంతకం కూడా జరిగింది. ఈ తెలివైన వ్యూహం ఫలించింది. ఈ పెట్టుబడి కేవలం 15 సంవత్సరాలలో రూ.1 లక్ష నుంచి ఏకంగా రూ.100 కోట్లుగా పెరిగింది.
ఈ సంఘటన జాకీ ష్రాఫ్, ఆయేషా ష్రాఫ్ కేవలం నటులుగానే కాకుండా, వ్యాపారవేత్తలుగా కూడా ఎంత తెలివైనవారో నిరూపిస్తుంది. ఇది కేవలం సినిమాలు, పార్టీలతో మాత్రమే కాకుండా, వ్యూహాత్మకమైన పెట్టుబడుల ద్వారా కూడా భారీ సంపదను సృష్టించవచ్చని చూపిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




