AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంపముంచిన వాట్సాప్ మెస్సేజ్.. రూ.22కోట్ల ఐటీ నోటీసు.. చివరకు ట్విస్ట్ అదుర్స్..

ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి వాట్సాప్ చాట్ ఆధారంగా నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి మొబైల్‌లో లభించిన చాట్ ఆధారంగా అధికారులు రూ.22కోట్లు పెట్టుబడులకు సంబంధించిన ఈ నోటీసులు పంపించారు. దీంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. తాను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని తెలిపారు. చివరకు ట్రిబ్యునల్ ఏం తీర్పు ఇచ్చిందంటే..?

కొంపముంచిన వాట్సాప్ మెస్సేజ్.. రూ.22కోట్ల ఐటీ నోటీసు.. చివరకు ట్విస్ట్ అదుర్స్..
It Notice Based On Whatsapp Chat
Krishna S
|

Updated on: Nov 01, 2025 | 3:53 PM

Share

ఒక సాధారణ వాట్సాప్ చాట్‌ను ఆధారం చేసుకొని.. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి ఐటీ నోటీసులు వచ్చాయి. ఏకంగా రూ.22 కోట్ల విలువైన వెల్లడించని పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ ఐటీ శాఖ నోటీసు పంపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే సరైన ఆధారాలు లేనందున ఈ మొత్తాన్ని కొట్టివేస్తూ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్ ఆధారంగా..

ఐటీ అధికారులు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీపై దాడులు నిర్వహించినప్పుడు.. డాక్యుమెంట్స్‌తో పాటు అక్కడున్న వ్యక్తి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ నుంచి కొన్ని కీలకమైన వాట్సాప్ మెస్సేజులు, ఎన్వలప్‌లు అధికారులకు లభ్యమయ్యాయి. ఈ చాట్‌లలో పెట్టుబడి, వడ్డీ వివరాలు ఉన్నాయని, ఒక ఎన్వలప్‌పై ఢిల్లీకి చెందిన ఆ వ్యక్తి పేరు కూడా ఉందని ఐటీ శాఖ తెలిపింది. దీని ఆధారంగా ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీతో హామీ ఇచ్చిన రిటర్న్ స్కీమ్‌లో రూ.22 కోట్లు నగదు పెట్టుబడి పెట్టారని అధికారులు నిర్ధారించారు.

ఈ క్రమంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 153C, 69 కింద చర్యలు చేపట్టారు. పన్ను, వడ్డీని డిమాండ్ చేస్తూ అతనికి నోటీసులు ఇచ్చారు. నోటీసు అందుకున్న వ్యక్తి ఐటీ శాఖ ఆరోపణలను ఖండించారు. తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వాట్సాప్ తన ఫోన్ నుండి కాకుండా ఇతరుల నుంచి వచ్చిన డేటా కాబట్టి ఖచ్చితమైన రుజువు లేకుండా వాటిని సాక్ష్యంగా పరిగణించలేమని ఆయన వాదించారు. తన పేరును తప్పుగా ఆపాదించారని తెలిపారు.

కేసు కొట్టేసిన ట్రిబ్యునల్

ఈ కేసుపై ఢిల్లీ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ సమగ్ర దర్యాప్తు నిర్వహించింది. ఐటీ శాఖ సమర్పించిన డిజిటల్ డేటాలో ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేదా సంతకాలు లేవు. పేర్కొన్న ఎన్వలప్‌లలో వ్యక్తి పేరు స్పష్టంగా లేదు. లావాదేవీలు నిజంగా జరిగాయని నిరూపించడానికి ఎటువంటి పత్రాలు లేదా ఒప్పందాలు లేవు. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్.. కేసును కొట్టేసింది. వాట్సాప్ చాట్‌ల వంటి ఎలక్ట్రానిక్ డేటాను వ్యక్తి ధృవీకరించడం లేదా ఇతర డాక్యుమెంట్లు ఉంటేనే సాక్ష్యంగా పరిగణించడానికి అవకాశం ఉంటుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పు డిజిటల్ డేటా వినియోగం, పన్ను చట్టాల అమలు, పౌరుల ప్రైవసీ విషయంలో ఒక మైలురాయిగా నిలిచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి