Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్లు పేలితే బీమా సౌకర్యం.. దేశంలో ఎన్ని ఘటనలు జరిగాయి..? సిలిండర్ ఎక్స్‌పయిరీ తేదీ తెలుసుకోవడం ఎలా? ఎన్నో కీలక విషయాలు
Gas Cylinders Explode: ఈ మధ్య కాలంలో వంట గ్యాస్ సిలిండర్‌లు పేలిపోతున్నాయి. ఈ పేలుడు ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అజాగ్రత్త, వినియోగించడంలో నిర్లక్ష్యం..
Gas Cylinders Explode: ఈ మధ్య కాలంలో వంట గ్యాస్ సిలిండర్‌లు పేలిపోతున్నాయి. ఈ పేలుడు ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అజాగ్రత్త, వినియోగించడంలో నిర్లక్ష్యం కారణమా? ఒకవైపు ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకు దారి తీస్తున్నాయంటున్నారు. తాజాగా శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా, శెట్టూరు మండలం, ములకలేడులో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. పేలుడు ధాటికి పక్క ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి చెందారు. పేలుడు సంభవించిన ఇంట్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, గ్యాస్ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోందంటున్నారు పరిశీలకులు.
కారణాలు..
ప్రధాన ఆయిల్ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల నిమిత్తం టెక్నికల్ సిబ్బందిని నియమించుకోకపోవడంలో నిర్లక్ష్యంగా కనిపిస్తోందనే ఆరోపణలున్నాయి. గ్యాస్ సిలిండర్ల నాణ్యత పరిశీలన తప్పనిసరి. వంట గ్యాస్ సిలిండర్ పరీక్షల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. అయితే సిలిండర్ జీవిత కాలపరిమితి పదేళ్లు. ఆ తర్వాత తిరిగి పరిశీలించి సిలిండర్ ప్రమాణాలను బట్టి మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయడమా? లేదా తుక్కుగా మార్చడమా నిర్ణయిస్తారు. ఇంకో విషయమేమంటే రీఫిల్లింగ్ జరిగే ప్రతిసారి సిలిండర్ రీఫిల్ బాడీని పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, ఆయిల్ కంపెనీలు టెర్మినల్‌కు వచ్చిన సిలిండర్‌ను మొక్కుబడి పరిశీలనతో రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి.
సిలిండర్‌పై ఎక్స్‌పయిరీ తేదీని గుర్తించాలి:
వంట గ్యాస్ సిలిండర్ భద్రత ప్రమాణాలను కాలపరిమితి (డ్యూ డేట్) బట్టి గుర్తించవచ్చు. సిలిండర్ కాలపరిమితి గడువుకు సంబంధించి మూడు నెలల కాలానికి ఒక అక్షరం, అంకెతో రాసి ఉంటుంది. ఉదాహరణకు సిలిండర్ పై A-21 B-21, C-21, D-21 అనే అక్షరాలు ఉంటాయి. A అంటే జనవరి నుంచి మార్చి వరకు, B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, C అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, D అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్‌ను సూచిస్తుంది. పక్కన ఉన్న అంకె సంవత్సరాన్న సూచిస్తుంది.
జాగ్రత్తలు..
☛ సిలిండర్ డోర్ డెలివరీ కాగానే సీల్ కరెక్టుగా ఉందా, లేదా చూసుకోవాలి.
☛ సిలిండర్ కాలపరిమితి పరిశీలించాలి.
☛ సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా.. గ్యాస్ వాసన వచ్చినా తిరిగి సిలిండర్ వెనక్కి పంపాలి.
☛ రెగ్యులేటర్, బర్నర్‌ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి.
☛ రెండేళ్లకు ఒకసారి స్టవ్‌ను మార్చు కోవాలి.
☛ వంట గ్యాస్ స్టౌ వినియోగించని సమయంలో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి.
☛ రాత్రి పూట తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్‌లో ఉంచాలి.
☛ వంట గది తలుపుల కింద కనీసం ఒక అంగుళం ఖాళీగా ఉండే విధంగా చూడాలి.
☛ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తప్పనిసరిగా వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఏమరుపాటు పనికి రాదు.
☛ విద్యుత్ స్విచ్‌లు ముట్టుకోవడం, అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు.
☛ విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయవద్దు. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చే చిన్నపాటి స్పార్క్(మెరుపు) ప్రమాదానికి దారితీస్తుంది.
☛ గ్యాస్ వాసన పసిగట్టగానే తక్షణం వంటింటి తలుపులు, కిటికీలు బార్లా తెరిచి గ్యాస్‌ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి.
☛ ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే సిలిండర్‌ను బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశంలో సేఫ్టీ పిన్ బిగించి ఉంచాలి.
☛ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండాలి. సిలిండర్‌ను నిలువుగానే పెట్టాలి.
☛ వంట గదిలో ఫ్రిజ్ పెట్టవద్దు. అందులో ఉండే థర్మోస్టాట్ వల్ల ఆటో కటాఫ్ అవుతున్న సమయంలో స్పార్క్ ప్రమాదానికి దారితీస్తుంది
☛ దేశంలో గృహ అవసరాలకుపయోగించే(డొమెస్టిక్) సిలిండర్లు పేలిన ఘటనలు
2017లో 309 ఘనలు:
మృతులు 315(మహిళలు225, పురుషులు:90) గాయపడ్డవారు 84 (మహిళలు:52, పురుషులు:32)
2018లో 307 ఘనలు:
మృతులు 318(మహిళలు:202, పురుషులు:116) గాయపడ్డవారు 41(మహిళలు:8, పురుషులు:31)
2019లో 314 ఘటనలు:
మృతులు 330(మహిళలు: 117, పురుషులు: 59) గాయపడ్డవారు 59(మహిళలు:34, పురుషులు:25)
2020లో 245 ఘటనలు:
2020లో మృతులు 254 (మహిళలు: 171, పురుషులు:83) గాయపడ్డవారు 66 (మహిళలు 31, పురుషులు:35)
డొమెస్టిక్ సిలిండర్లు పేలిన ఘటనల్లో బీమా సౌకర్యం:
‘పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీస్’ విధానం కింద బీమా పథకాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పైపులద్వారా ఎల్పీజీని పొందుతున్న వినియోగదారులకు సైతం ఈ బీమా వర్తింపజేస్తున్నాయి. ఓఎంసీ కంపెనీలవద్ద రిజిస్టరయిన ఎల్పీజీ వినియోగదారులందరు ఈ బీమా పొందడానికి అర్హులే. రూ. 30 లక్షల వరకు బీమా కింద పరిహారం పొందవచ్చు. సిలిండర్ ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు అండగా ఉండేలా ఈ బీమా పథకాన్ని తమ ఎల్పీజీ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) అందిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగదారులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. సిలిండర్ పేలుడులో ప్రాణాలు పోయినా, గాయపడ్డా ఈ బీమా వర్తిస్తుంది. ప్రమాదంలో ప్రాణం పోతే రూ. 6 లక్షల పరిహారం ఆ కుటుంబానికి లభిస్తుంది. తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలతో పాటు వైద్య ఖర్చుల కోసం అదనంగా రూ. 30 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. ఆస్తి నష్టానికి గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. సిలిండర్ ప్రమాదం జరిగినపుడు వెంటనే ఆ విషయాన్ని సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్‌కి రాత పూర్వకంగా తెలపాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఆ విషయాన్ని ఆయిల్ కంపెనీకి బీమా కంపెనీకి తెలియజేస్తాడు. సంబంధిత ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత బీమా క్లెయిమ్ మొత్తం కంపెనీ బాధిత కుటుంబానికి అందజేస్తుంది.
2019 నవంబర్ లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రాజ్యసభలో ప్రకటన ప్రకారం.. 2017-18 సంవత్సరంలో రూ. 23.44 కోట్లు బీమా కింద ఆయిల్ కంపెనీలు బాధితులకు నష్టపరిహారం చెల్లించగా, 2018-19 సంవత్సరంలో రూ.10.27 కోట్లు బీమా కింద బాధితులకు చెల్లించాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి