అక్టోబర్‌లో గణనీయంగా పెరిగిన GST వసూళ్లు.. రెండో అత్యధికంగా రికార్డు..!
GST Collection: అక్టోబర్లో వస్తు, సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు వార్షికంగా 8.9 శాతం పెరిగి, స్థూల పరంగా రూ.1.87 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2023 అక్టోబర్ లో, మొత్తం వసూళ్లు రూ. 1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ మాసంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు వార్షికంగా 8.9 శాతం పెరిగి.. రూ.1.87 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే మాసం (2023 అక్టోబర్) లో జీఎస్టీ మొత్తం వసూళ్లు రూ. 1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత మాసం (సెప్టెంబర్ 2024)లో జీఎస్టీ వసూళ్లు 1.73 లక్షల కోట్లుగా నమోదయ్యింది.
జీఎస్టీ వసూళ్లలో ఇది రెండో అత్యధిక రికార్డు కావడం విశేషం. ఇప్పటి వరకు అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ 2024లో నమోదయ్యాయి. ఆ నెలలో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యింది.
గతేడాది( ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) వసూలు చేసిన రూ. 11.64 లక్షల కోట్లతో పోలిస్తే ఇప్పటివరకు 2024లో, మొత్తం GST వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ. 12.74 లక్షల కోట్లకు చేరాయి. ఈ సంవత్సరం ఏప్రిల్లో గరిష్టంగా రూ.2.10 లక్షల కోట్లతో రికార్డు నమోదయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం స్థూల GST వసూళ్లు గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 11.7 శాతం పెరుగుదలతో రూ. 20.18 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక గత నెల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.33,821 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.41,864 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.99,111 కోట్లు, సెస్ రూ.12,550 కోట్లు వసూళ్లయ్యాయి.
దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ వసూళ్లు 10.6 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి ద్వారా రూ.45,096 కోట్లు వసూలయ్యాయి. 2023-24తో పోలిస్తే గత నెలలో రీఫండ్స్ 18.2 శాతం పెరిగి రూ.19,306 కోట్లకు చేరాయి. రీఫండ్స్ సర్దుబాట్లతో నికర జీఎస్టీ వసూళ్లు 8 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లకు చేరాయి. అక్టోబర్ 2024లో దిగుమతులపై పన్ను దాదాపు 4 శాతం పెరిగి రూ.45,096 కోట్లకు చేరుకుంది.
పెరిగిన జీఎస్టీ వసూళ్లు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని ప్రతిబింబిస్తుంది. దేశీయ వినియోగ పెరుగుదలను మరియు సానుకూల దిగుమతి కార్యకలాపాలను ఇది సూచిస్తుంది. ఈ గణాంకాలు దేశ ఆర్థిక పురోగతికి ఆర్థిక పునర్నిర్మాణానికి సూచన. మన దేశంలో జూలై 1, 2017 నుండి మోడీ ప్రభుత్వంలో వస్తు మరియు సేవల పన్ను(GST) అమలులోకి వచ్చింది.
GST చట్టం 2017 లోని నిబంధనల ప్రకారం, GST అమలు కారణంగా 5 సంవత్సరాలలో ఉత్పన్నమయ్యే ఏదైనా ఆదాయ నష్టాలను చవిచూసినట్లయితే ఆయా రాష్ట్రాలకు పరిహారం అందజేస్తుంది కేంద్రం. హెయిర్ ఆయిల్, టూత్ పేస్టు, సబ్బు, డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్, గోధుమ, బియ్యం, పెరుగు, లస్సీ, మజ్జిగ, చేతి గడియారాలు, 32 అంగుళాల వరకు టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు వంటి కీలకమైన వస్తువుల విషయంలో GST రేట్లు గణనీయంగా తగ్గించబడిన లేదా కొన్నింటికి జీరో జీఎస్టీ వేసిన అది వినియోదారులకు ప్రయోజనం చేకురుతుంది.