Gold: కళ్లు చెదిరే రిపోర్ట్.. ప్రపంచంలోనే భారతీయుల ఇళ్లల్లో ఎక్కువ బంగారం.. ఈ లెక్కలు చూస్తే..
ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయుల ఇళ్లల్లో ఎక్కువ బంగారం ఉంది. ఈ మేరకు అసోచామ్ ఓ అంచనా వేసింది. ప్రపంచంలో గోల్డ్ నిల్వలు ఎక్కువగా ఉన్న టాప్ 10 కేంద్ర బ్యాంకుల కంటే మన దేశ ప్రజల ఇళ్లల్లో ఎక్కువ బంగారం ఉందట.

భారతీయులకు బంగారం అంటే ఎంత ఎక్కువ మక్కువనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంగారు ఆభరణాలను ఒక సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని నమ్ముతారు. దీంతో ప్రపంచంలోనే ఇండియాలో బంగారంకు ఉన్నంత డిమాండ్ ఇంకెక్కడా లేదు. విదేశాల నుంచి భారత్ బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ప్రతీ ఒక్కరి ఇళ్లల్లో తప్పనిసరిగా ఎంతో కొంత బంగారం అనేది ఉంటుంది. పండుగలు, పంక్షన్ల సమయంలో వీటిని ధరించి మిగతా సమయంలో ఇంట్లో భద్రపర్చుకుంటారు. పెళ్లి అనగానే అందరికీ ముందుగా బంగారం గురించి ఆలోచిస్తారు. ఇక కేవలం ఒక ఆభరణంగానే కాకుండా ఇక ఆస్తిగా భారతీయులు బంగారాన్ని భావిస్తారు. అయితే భారతీయుల ఇళ్లల్లో బంగారు నిల్వలకు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.
కళ్లు చెదిరే రిపోర్ట్
ప్రపంచంలోనే అత్యధికంగా భారతీయుల ఇళ్లల్లో ఎక్కువ బంగారం ఉన్నట్లు పరిశ్రమల సంఘం అసోచామ్ అంచనా వేసింది. ప్రపంచంలో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న టాప్ 10 కేంద్ర బ్యాంకుల కంటే భారతీయుల ఇళ్లల్లో ఎక్కువ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. ఈ గోల్డ్‌ను ఆర్ధిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తే 2047 నాటికి దేశ జీడీపీకి లక్షల కోట్ల డాలర్ల మేర అదనంగా చేరుతుందని స్పష్టం చేసింది. ప్రపంచంలో అమెరికా కేంద్ర బ్యాంకు వద్ద 8133.46 టన్నుల గోల్డ్ నిల్వలు ఉండగా.. జర్మనీ 3350.25, ఇటలీ 2451.84, ఫ్రాన్స్ 2437, రష్యా 2311, చైనా 2308, స్వి్ట్జర్లాండ్ 1039, భారత్ 880, జపాన్ 845, నెదర్లాండ్స్ కేంద్ర బ్యాంక్ వద్ద 641 టన్నుల నిల్వలు ఉన్నాయి. మొత్తం టాప్ 10 కేంద్ర బ్యాంకుల వద్ద 24,399 టన్నుల గోల్డ్ ఉంది.
భారతీయుల ఇళ్లల్లోనే ఎక్కువ
అయితే భారత్‌లోని దేశ ప్రజల ఇళ్లల్లో 25 వేల నుంచి 34 వేల టన్నుల బంగారం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతుండటంతో వీటి ధర కూడా భారీగా పెరిగింది. వీటి విలువ రూ.465 లక్షల కోట్లకు మించి ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచంలోనే అన్ని దేశాల జీడీపీ కంటే దేశ ప్రజల ఇళ్లల్లో ఉన్న బంగారం విలువ అధికమని చెబుతున్నారు. ఈ బంగారం లో ప్రతీ ఏటా 2 శాతాన్ని ఆర్ధిక అవసరాల కోసం ఉపయోగించినా రాబోయే 20 ఏళ్లల్లో దేశ జీడీపీకి అదనంగా నిధులు చేకూరుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పటికీ దేశ జీడీపీ 34 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది నుంచి గోల్డ్ రేట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీంతో దేశ ప్రజల ఇళ్లల్లో ఉన్న గోల్డ్ విలువ కూడా ఆమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ గణాంకాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.
