బిగ్ షాక్.. మే 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు దాటడంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMCలు) నెలకు రూ.30,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి. దీంతో పెంపు అనివార్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. వివరాల ప్రకారం పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల స్థాయి నుంచి 120 డాలర్లకు పైగా చేరాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులపై భారం పడకుండా రిటైల్ ఇంధన ధరలను పెద్దగా పెంచకుండా కొనసాగిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం కారణంగా ఇండియన్, భారత్, హిందూస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు నెలకు దాదాపు రూ.30,000 కోట్ల వరకు నష్టాలను భరిస్తున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.20-24 వరకు, డీజిల్‌పై ఇంకా ఎక్కువ నష్టాన్ని OMCలు భరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఇంధన ధరల సవరణ జరిగే అవకాశాన్ని అధికారులు పూర్తిగా తోసిపుచ్చడం లేదు. అయితే మే 15 నాటికి ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మాత్రమే వర్గాలు చెబుతున్నాయి.
అనుమతి లభిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.4-5 వరకు, గృహ వినియోగ LPG సిలిండర్ ధరలు రూ.40-50 వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దేశీయ LPG ఉత్పత్తిని పెంచడం, ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, అలాగే రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను విస్తరించడం ద్వారా సరఫరా అంతరాయాలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇంకా ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగితే, దేశీయంగా ఇంధన ధరల పెంపు దాదాపు తప్పదని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
