Income Tax Notice: మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వస్తాయ్‌..

కొత్త ఆర్థిక సంవత్సరం కొనసాగుతోంది. దీంతో పాటు ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు సీజన్‌ కూడా ఊపందుకుంది. మరోవైపు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గత సంవత్సరాల రిటర్న్‌లను ఇంకా పరిశీలించడంలో నిమగ్నమై ఉంది. అలాగే..

Income Tax Notice: మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వస్తాయ్‌..
Income Tax Notice
Follow us
Subhash Goud

|

Updated on: May 09, 2023 | 5:36 PM

కొత్త ఆర్థిక సంవత్సరం కొనసాగుతోంది. దీంతో పాటు ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు సీజన్‌ కూడా ఊపందుకుంది. మరోవైపు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గత సంవత్సరాల రిటర్న్‌లను ఇంకా పరిశీలించడంలో నిమగ్నమై ఉంది. అలాగే కొందరికి పన్ను చెల్లింపుదారులకు నోటీసులు కూడా ఇస్తోంది. అయితే ఆదాయపు పన్ను నుంచి నోటీసు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఆదాయపు పన్ను శాఖ పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘా పెట్టింది ఆదాయపు పన్ను శాఖ. వ్యక్తిగత ఆదాయాలను దాచినా.. తన ఖర్చులు లేదా పెట్టుబడులను దాచ లేరని, అలాంటి వారికి నోటీసులు అందడం ఖాయమంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపు పన్ను శాఖ అటువంటి వ్యవస్థను రూపొందించింది. దీని ద్వారా పన్ను చెల్లింపుదారుల ఖర్చు, పెట్టుబడిని పర్యవేక్షిస్తుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్ (SFT) సిస్టమ్‌ను రూపొందించింది. దీని కింద వివిధ రకాల లావాదేవీలకు వేర్వేరు పరిమితులు నిర్ణయించబడ్డాయి. ఈ పరిమితిని మించిన లావాదేవీల విషయంలో సంబంధిత యూనిట్ ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తుంది. మీ లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలు ఆదాయపు పన్ను శాఖకు ఇవ్వకపోయినా.. నోటీసులు వస్తాయి. ఎందుకంటే మీరు వివరాలు అందించకపోతే వెంటనే మీ లావాదేవీల వివరాలు ఆ శాఖకు చేరిపోతాయి. అందుకు జాగ్రత్తగా ఉండటం మంచిది.

పాన్, మొబైల్ నంబర్, ఆధార్:

పాన్‌, మొబైల్ నంబర్, ఆధార్ నుంచి ఆర్థిక లావాదేవీల సమాచారం కూడా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. ఉదాహరణకు ద్విచక్ర వాహనం కాకుండా ఇతర వాహనాన్ని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం పాన్‌ తప్పనిసరి. అదేవిధంగా, బ్యాంక్ ఖాతా లేదా డీమ్యాట్ ఖాతా తెరవడానికి, క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి పాన్ అవసరం. మీ బ్యాంక్ డిపాజిట్, బీమా ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ లేదా బాండ్ కొనుగోలు, రెస్టారెంట్, హోటల్ లేదా విదేశీ ట్రిప్ బిల్లు రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తి నుంచి అద్దె రసీదుపై, అద్దెదారు పాన్ ఇవ్వాలి.

పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని పర్యవేక్షించడానికి టీడీఎస్‌ కూడా ఒక మార్గం. బ్యాంకు లేదా పోస్టాఫీసు డిపాజిట్లపై సంవత్సరానికి వడ్డీ రూ. 40,000 దాటితే కట్ అవుతుంటుంది. అదేవిధంగా, ఆస్తి కొనుగోలుతో సహా ఇతర సందర్భాల్లో టీడీఎస్‌ తీసివేయబడుతుంది. దీని నుంచి కూడా ఆదాయపు పన్ను శాఖ మీ ఆదాయాల గురించి తెలుసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మీరు ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు పొదుపు ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసినా, దాని గురించి బ్యాంకు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తుంది. ఈ లావాదేవీ ఒక ఖాతా నుంచి లేదా ఒకటి కంటే ఎక్కువ ఖాతాల నుంచి కావచ్చు. ఇది కాకుండా నగదు ఇవ్వడం ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డిడి), పే ఆర్డర్ లేదా రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకర్ చెక్కు తయారు చేయడానికి కూడా సమాచారం అందుకుంటుంది ఆదాయపు పన్ను శాఖ.

  • కరెంట్ ఖాతాలో రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేయడం లేదా ఉపసంహరించుకోవడంపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందుతుంది.
  • ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గురించిన సమాచారం కూడా పన్ను శాఖకు అందించబడుతుంది. ఇది నగదు, డిజిటల్ విధానాలు రెండింటికీ వర్తిస్తుంది.
  • రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లించినా లేదా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బిల్లును ఏ విధంగానైనా చెల్లించినట్లయితే, దాని సమాచారం ఆదాయపు పన్ను శాఖకు అందుతుంది.
  • మీరు రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినా లేదా విక్రయించినా, దాని గురించి తెలియజేయడం ఆస్తి రిజిస్ట్రార్ పని. రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆస్తి కొనుగోలుపై 1% టీడీఎస్‌ తీసివేయబడుతుంది.
  • టీడీఎస్‌ తగ్గింపు కారణంగా లావాదేవీకి సంబంధించిన సమాచారం కూడా విభాగానికి చేరుతుంది.
  • ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన షేర్లు, డిబెంచర్లు, బాండ్లు లేదా మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేసినట్లయితే ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయడం ఆ కంపెనీ లేదా సంస్థ బాధ్యత.
  • ఏదైనా వస్తువులు లేదా సేవల కొనుగోలు కోసం రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లింపు చేస్తే, సంబంధిత విక్రేత ఈ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు అందించాలి. ఉదాహరణకు మీరు ఆభరణాలు కొనుగోలు చేసి, రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లించినట్లయితే ఆ శాఖకు తెలియజేయడం దుకాణదారుడి బాధ్యత. ఇది కాకుండా, మీరు రూ. 2 లక్షలకు పైబడిన అన్ని లావాదేవీలకు కూడా పాన్ కార్డును అందించాలి.

రిటర్న్ దాఖలు చేసే ముందు ఈ పని చేయాలి:

ఆదాయపు పన్ను శాఖకు మీ ప్రతి పెద్ద లావాదేవీ గురించి తెలుసు. కానీ మీరు మీ ఖర్చులు, పెట్టుబడులను ఆదాయాలతో సమర్థించుకోగలిగినంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసం ఉంటే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఇవ్వవచ్చు. మీరు మీ వార్షిక సమాచార ప్రకటన (AIS)లో ఆర్థిక సంవత్సరంలో చేసిన అన్ని ఖర్చులు, పెట్టుబడుల వివరాలను కనుగొంటారు. దీనిని ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ముందు ఏఐఎస్‌ తప్పనిసరిగా తనిఖీ చేయాలి. తద్వారా ఆదాయం, వ్యయం లేదా పెట్టుబడి మధ్య తేడా ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి