Kisan Credit Card: మీకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉందా? రూ.3 లక్షల రుణం పొందొచ్చు.. దరఖాస్తు విధానం ఏమిటి?

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ రైతులకు అండగా నిలుస్తోంది..

Kisan Credit Card: మీకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉందా? రూ.3 లక్షల రుణం పొందొచ్చు.. దరఖాస్తు విధానం ఏమిటి?
Kisan Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Nov 22, 2022 | 9:54 AM

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ రైతులకు అండగా నిలుస్తోంది. రైతులకు ఆర్థిక సాయంగా ఉండేందుకు పలు పథకాలను రూపొందించింది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో కిసాన్‌ క్రెడిట్‌ పథకం ఒకటి. ఈ కార్డు ద్వారా రైతులు రుణాన్ని పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక అధికారిక రుణాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించింది. ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాలలో రైతులు అవసరమైన వ్యవసాయ పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చుల కోసం రుణాన్ని పొందే సదుపాయం ఉంటుంది. దీనిని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలెప్‌మెంట్‌ రూపొందించింది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగాలు ఏమిటి?

ఈ కార్డు ద్వారా రైతులు పలు ప్రయోజనాలు పొందవచ్చు. వ్యవసాయం కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలు, పొలం దున్నడం, కూలీల ఖర్చు, పంటకోత ఖర్చులు తదితర అవసరాల కోసం ఈ కార్డు ద్వారా రుణం తీసుకోవచ్చు. పాడి పశువులు, పంపుసెట్లు మొదలైన వ్యవసాయానికి సంబంధించిన అవసరాల పెట్టుబడి కోసం రుణం పొందవచ్చు. రైతులు ఈ కార్డు ద్వరా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఇవే కాకుండా కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో బీమా సదుపాయం కూడా ఉంటుంది. ఏదైనా ప్రమాదవశాత్తు కార్డుదారుడు మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, మరణించినా రూ.50 వేల వరకు బీమా అందుకోవచ్చు. అలాగే ప్రమాదంలో గాయాలైనా, ఇతర రిస్క్‌లకు రూ.25 వేల వరకు బీమా కవరేజీ ఉంటుంది.

అర్హులైన రైతులకు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో సేవింగ్స్‌ అకౌంట్‌ను, స్మార్ట్‌ కార్డు, డెబిట్‌ కార్డులను కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో పాటు అదనంగా జారీ చేస్తారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ కార్డుపై రుణం తీసుకుని సులభమైన వాయిదాలతో చెల్లించుకునే వెసులుబాటును కల్పిస్తారు అధికారులు. అలాగే ఈ కార్డు ద్వారా వ్యవసాయం కోసం ఎరువులు, విత్తనాలు కొనుగోలు విషయంలో వ్యాపారులు, డీలర్ల నుంచి నగదు రాయితీలను కూడా పొందవచ్చు. ఈ పథకంలో కార్డుపై రూ.1.60 లక్షల వరకు రుణాలకు ఎలాంటి పూచీకత్తూ ఉండదు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు వడ్డీ రేట్లు అన్ని బ్యాంకులకు ఒకే విధంగా ఉండవు. 2 నుంచి 4 శాతం వరకు వడ్డీ వర్తిస్తుంది. ఈ వడ్డీ రేట్లు కార్డుదారుని చెల్లింపు చరిత్ర, క్రెడిట్‌ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోవాలి. దీనిపై రుణం పొందాలంటే ప్రాసెసింగ్‌ ఫీజు, భూమి తనఖా దస్తావేజు ఛార్జీలు తదితరాలు ఉంటాయి. మీకు రుణం జారీ చేసి బ్యాంకులను బట్టి ఛార్జీలు ఉంటాయి.

ఎవరెవరు అర్హులు?

వ్యవసాయం చేసే రైతులతో పాటు మత్స్య సంపద, పౌల్ట్రీ, పశువర్థకంతో సంబంధం ఉన్న రైతులు కూడా కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పొందాలంటే రైతులు 18 నుంచి 75 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు కోసం ఎలాంటి పత్రాలు అవసరం:

ఈ పథకం కింద కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కేవైసీ పత్రాలు తప్పనిసరి. ☛ దరఖాస్తు ఫారం

☛ రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫోలు

☛ ఆధార్‌, పాన్‌కార్డు, ఓటర్‌ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, చిరునామా గుర్తింపు వంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాలి.

☛ రెవెన్యూ అధికారులు జారీ చేసిన భూమి పత్రాలు.

☛ రుణ మొత్తం రూ.1.60 లక్షల నుంచి రూ. 3 లక్షలు వరకు ఉన్నప్పుడు, బ్యాంకు కోరితే పీడీసీ సెక్యూరిటీ వంటి ఇతర పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..