ఎంత జీతం ఉంటే బ్యాంకులు ఈజీగా పర్సనల్ లోన్స్ ఇస్తాయి..? ఈ రూల్స్ గురించి తెలుసుకోండి..
పర్సనల్ లోన్ కోసం బ్యాంక్‌కు వెళ్తున్నారా? అయితే మీకు మంచి జీతం ఉంటే సరిపోదు.. బ్యాంకులు చూసే డీటీఐ రూల్ గురించి కూడా తప్పక తెలుసుకోవాలి. ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఇచ్చే రుణం కావడంతో బ్యాంకులు దరఖాస్తుదారుల ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అసలు ప్రముఖ బ్యాంకుల్లో లోన్ రావాలంటే కనీసం ఎంత జీతం ఉండాలి? అనే విషయాలు తెలుసుకుందాం..

అత్యవసర ఆర్థిక అవసరాలు ఏర్పడినప్పుడు అందరికీ టక్కున గుర్తొచ్చేది పర్సనల్ లోన్. ఎలాంటి ఆస్తులు లేదా పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేకపోవడంతో లోన్ తీసుకునేవారి సంఖ్య ఎక్కవైంది. అయితే దరఖాస్తు చేసిన వెంటనే బ్యాంకులు అంత ఈజీగా రుణాలు మంజూరు చేయవు. ముఖ్యంగా రికవరీకి ఎలాంటి హామీ ఉండదు కాబట్టి దరఖాస్తుదారుడి తిరిగి చెల్లించే సామర్థ్యంపై బ్యాంకులు కఠినమైన తనిఖీలు నిర్వహిస్తాయి. క్రెడిట్ స్కోర్, వయస్సు, ఉద్యోగ స్థిరత్వంతో పాటు ప్రధానంగా కనీస నెలవారీ ఆదాయం, డెట్ టు ఇన్‌కమ్ రేషియోను బ్యాంకులు ప్రామాణికంగా తీసుకుంటాయి.
అసలు DTI నిష్పత్తి అంటే ఏమిటి? ఇది ఎందుకు కీలకం?
వ్యక్తిగత రుణం మంజూరు ప్రక్రియలో రుణ-ఆదాయ నిష్పత్తి అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి సంపాదిస్తున్న నెలవారీ ఆదాయంలో ఇప్పటికే ఉన్న పాత రుణాల EMIలు చెల్లించడానికి ఎంత శాతం వెళ్తోందో లెక్కించే విధానమే ఈ DTI. ఉదాహరణకు.. ఒక వ్యక్తి నెలవారీ జీతం రూ.50,000 ఉండి, అతను ఇప్పటికే ఉన్న రుణాల కోసం నెలకు రూ.12,500 ఈఎంఐ చెల్లిస్తుంటే, అతని DTI నిష్పత్తి 25శాతంగా లెక్కించబడుతుంది. సాధారణంగా DTI నిష్పత్తి 35శాతం లేదా అంతకంటే తక్కువ ఉంటే బ్యాంకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే లోన్ మంజూరు చేస్తాయి. 40 నుంచి 45శాతం DTI ఉంటే* కొన్ని బ్యాంకులు రుణం ఇచ్చేందుకు అంగీకరించినా.. కో-అప్లికెంట్ లేదా గ్యారెంటర్‌ను పెట్టాలని కోరడం, లోన్ మొత్తం తగ్గించడం లేదా కాలపరిమితిని పెంచడం వంటి కఠిన షరతులు విధిస్తాయి.
ప్రముఖ బ్యాంకుల్లో కనీస ఆదాయ పరిమితులు
పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వివిధ బ్యాంకులు నిర్దేశించిన కనీస నెలవారీ జీత ప్రమాణాలు ఇలా ఉన్నాయి.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ పొందడానికి కనీసం రూ. 25 వేల నెలవారీ ఆదాయం ఉండాలి. దరఖాస్తుదారుడు పనిచేసే కంపెనీ కేటగిరీని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
- యాక్సిస్ బ్యాంకులో ఇప్పటికే ఖాతా ఉన్నవారికి కనీస పరిమితి రూ.15,000. కొత్త కస్టమర్లకు అయితే కనీసం రూ.25,000 ఉండాలి.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత కస్టమర్లకు రూ.25,000, ఇతర బ్యాంక్ ఖాతాదారులకు రూ.30,000. అదే కోటక్ ఉద్యోగులైతే రూ.20,000 కనీస జీతం ఉండాలి.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ, రక్షణ రంగ ఉద్యోగులకు కనీస వేతనం రూ.20,000. కార్పొరేట్ ఉద్యోగులకు కనీస జీత పరిమితి రూ.25,000 గా నిర్ణయించారు.
కేవలం అధిక జీతం ఉండటమే కాకుండా, గతంలో తీసుకున్న ఈఎంఐల భారం తక్కువగా ఉన్నప్పుడే ఎక్కువ మొత్తం పర్సనల్ లోన్ తక్కువ వడ్డీకే లభించే అవకాశం ఉంటుంది. అందుకే లోన్ కోసం అప్లై చేసేముందే మీ సిబిల్ స్కోర్, నెలవారీ ఈఎంఐల శాతాన్ని ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
