Weather Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోనూ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర అండమాన్‌కు సమీపంలో, తూర్పు మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఇవ్వాల్టికి తుఫానుగా, మంగళవారం తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం ఉదయానికల్లా ఇది దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర తీరాల సమీపంలోని పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాత ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల మంగళవారం విస్తారంగా భారీ వర్షాలు, బుధ, గురువారాల్లో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం (21-09-2026) ఏపీ వెదర్ రిపోర్ట్:
అల్లూరి, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతోపాటు గంటకు 50-60 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఇదిలాఉంటే.. వాయుగుండం ఎఫెక్ట్‌తో తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
