Gold: 2050 నాటికి బంగారం ధర ఎంత పెరుగుతుంది.. కోటి పెట్టినా కొన్ని గ్రాములేనా..
గత 25 ఏళ్లుగా బంగారం ధరలు ఎంత వేగంగా పెరిగాయో తెలుసా..? 2000 సంవత్సరంలో కేవలం రూ.4,400 ఉన్న 10 గ్రాముల ధర, ఇప్పుడు రూ.1.32 లక్షలు దాటింది. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు అందరూ బంగారాన్నే సురక్షిత పెట్టుబడిగా భావించడం దీనికి కారణం. ఇదే వృద్ధి కొనసాగితే, 2050 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటుందంటే..?

బంగారం భారతీయ పెట్టుబడిదారుల నమ్మకానికి, సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. కష్టకాలంలో ఆదుకునేందుకు, సంపద పెంచేందుకు ఇది ఎప్పుడూ ముందుంటుంది. గత రెండు దశాబ్దాలకు పైగా పసిడి ధరలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే బంగారాన్ని సురక్షిత పెట్టుబడి అని అంటారు.
బంగారం ధరలు గత 25 ఏళ్లలో ఎంత వేగంగా పెరిగాయనేందుకు ఈ లెక్కే సాక్ష్యం
- 2000 సంవత్సరం: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కేవలం రూ. 4,400.
- 2025 (అక్టోబర్): అదే 10 గ్రాముల బంగారం ధర రూ. 1.32 లక్షలు దాటింది.
ఈ 25 ఏళ్ల కాలంలో బంగారం సగటున 14.6శాతం వార్షిక వృద్ధి రేటును అందించింది. ఇది సాంప్రదాయ పొదుపు పథకాలు లేదా బ్యాంక్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ.
బంగారం ఎందుకు పెరుగుతోంది..?
ప్రపంచంలో ధరల పెరుగుదల, ఆర్థిక ఇబ్బందులు, యుద్ధ భయాలు లేదా రాజకీయ గొడవలు ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు అందరూ తమ డబ్బును సురక్షితంగా ఉంచడానికి బంగారాన్ని కొంటారు. అందుకే దీనిని సురక్షిత పెట్టుబడి అంటారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే బంగారం ధర 67శాతం పెరగడానికి ఇదే కారణం.
కేవలం ఒక్క సంవత్సరంలో 67శాతం వృద్ధి
బంగారం ధరలు కేవలం చరిత్రలోనే కాకుండా గత ఏడాది కాలంలోనూ సంచలన వృద్ధిని నమోదు చేశాయి. అక్టోబర్ 2024 నుండి అక్టోబర్ 2025 నాటికి, 24-క్యారెట్ల బంగారం ధర 67శాతానికి పైగా పెరిగింది.
బంగారం ఆకర్షణ ఎందుకు పెరుగుతోంది..?
స్టాక్ మార్కెట్లు, బాండ్ల వంటి ఇతర ఆస్తులు అస్థిరంగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు ఎప్పుడూ బంగారాన్నే సురక్షితమైన స్వర్గధామంగా భావిస్తారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ అస్థిరత వంటి అంశాలు బంగారం డిమాండ్‌ను నిరంతరం పెంచుతున్నాయి. అలాగే కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేయడం కూడా ధరలకు మద్దతు ఇస్తోంది.
2050 నాటికి రూ. 40 లక్షలు
చారిత్రక వృద్ధి రేటును అంచనాగా తీసుకుంటే రాబోయే 25 ఏళ్లలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.1.32లక్షలు ఉన్న బంగారం.. 2050 నాటికి రూ.40లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.
కోటి రూపాయలతో ఎంత బంగారం కొనవచ్చు..
- ప్రస్తుతం: రూ. 1 కోటితో దాదాపు 758 గ్రాముల (0.76 కిలోలు) బంగారం కొనవచ్చు.
- 2050 అంచనా: బంగారం ధర 10 గ్రాములకు రూ. 40 లక్షలకు చేరుకుంటే.. ఆ సమయంలో కేవలం 25 గ్రాముల బంగారం కొనడానికి రూ. కోటి సరిపోతుంది.
అంచనాలు మాత్రమే
ఈ లెక్కలు కేవలం చారిత్రక వృద్ధి రేటు ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. బంగారం ధరలు భవిష్యత్తులో వడ్డీ రేట్లు, డాలర్ విలువ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితి, కేంద్ర బ్యాంకుల విధానాల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి 2050లో ధరలు ఈ అంచనా కంటే ఎక్కువ లేదా తక్కువగా కూడా ఉండవచ్చు.
గత 25 ఏళ్ల వృద్ధి వేగం ఇలాగే కొనసాగితే బంగారం మరోసారి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే అత్యుత్తమ పెట్టుబడిగా నిలుస్తుంది. ఏదేమైనా రాబోయే దశాబ్దాలలో పెట్టుబడి రంగంలో బంగారం “సురక్షిత స్వర్గధామం” స్థానం మాత్రం చెక్కుచెదరకుండా ఉండే అవకాశం ఉంది.








