159 ఏళ్ల చరిత్ర.. నేతాజీతో అనుబంధం.. ఈ రైలు గురించి తెలుసా..?
ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఈ విశాలమైన రైల్వే నెట్‌వర్క్ దేశాన్ని ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పు నుండి పడమరకు కలుపుతుంది. కానీ భారతీయ రైల్వేలలో అత్యంత పురాతనమైన రైలు ఏది అనేది మీకు తెలుసా..? అది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. దేశంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఉండడం, తక్కువ ఛార్జీలే విపరీతమైన రద్దీకి కారణంగా చెప్పొచ్చు. ఈ విస్తృత నెట్‌వర్క్‌లో అత్యంత చారిత్రక ప్రాధాన్యత కలిగిన పురాతనమైన రైలు ఒకటి ఉంది. అదే నేటి నేతాజీ ఎక్స్‌ప్రెస్. చాలా మందికి దీని పాత పేరు కల్కా మెయిల్ గానే సుపరిచితం. ఈ రైలు కోల్‌కతా నుండి హర్యానాలోని కల్కా వరకు నిరంతరం ప్రయాణిస్తోంది.
159 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర
హౌరా-కల్కా మెయిల్ తన ప్రయాణాన్ని జనవరి 1, 1866 న ప్రారంభించింది. ఇది 159 సంవత్సరాలుగా నిరంతరంగా నడుస్తోంది. ప్రారంభంలో దీనికి ఈస్ట్ ఇండియా రైల్వే మెయిల్ అని పేరు ఉండేది. తరువాత అది హౌరా-కల్కా మెయిల్ గా మారింది. ఈ రైలును బ్రిటిష్ కాలంలో నిర్మించారు. అప్పట్లో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. అందువల్ల బ్రిటిష్ అధికారులు, వారి కుటుంబాలు వేసవిలో కోల్‌కతా నుండి సిమ్లాకు వెళ్లడానికి ఢిల్లీ మీదుగా కల్కా వరకు ఈ రైలును ఉపయోగించేవారు. కల్కా నుండి సిమ్లా వరకు రైల్వే లైన్‌ను తరువాత నిర్మించారు. ఈ రైలు మొదట కోల్‌కతా నుండి న్యూఢిల్లీ వరకు నడిచేది. తరువాత దాన్ని కల్కా వరకు పొడిగించారు.
నేతాజీ ఎక్స్‌ప్రెస్‌గా..
ఈ రైలుకు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1941 జనవరి 17న రాత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారి కళ్లు గప్పి పారిపోయే క్రమంలో గోమోహ్ స్టేషన్ వద్ద ఈ రైలును ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ చారిత్రక అనుబంధాన్ని గౌరవిస్తూ 2021లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కల్కా మెయిల్ పేరును నేతాజీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ విధంగా నేతాజీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా కొనసాగుతూ నేటికీ వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




