డెలివరీ బాయ్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా..? జొమాటో సీఈవో లెక్కలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మన ఇంటి డోర్ వద్దకు కేవలం పది నిమిషాల్లో వేడివేడి ఆహారాన్ని లేదా సరుకులను చేరవేసే గిగ్ వర్కర్ల పని అనుకున్నంత ఈజీ కాదు. ట్రాఫిక్, ఎండ, వానలను లెక్కచేయకుండా పని చేసే ఈ డెలివరీ పార్ట్‌నర్లు నెలకు ఎంత సంపాదిస్తారు? ఇటీవల గిగ్ వర్కర్ల సమ్మెలు చర్చనీయాంశమైన వేళ, జొమాటో, బ్లింకిట్ అధినేత దీపేంద్ర గోయల్ కీలక విషయాలను వెల్లడించారు.

ఇటీవలి కాలంలో గిగ్ వర్కర్ల సమ్మెలు, వారి పని ఒత్తిడిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పది నిమిషాల డెలివరీ సర్వీసుల వల్ల రైడర్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జొమాటో, బ్లింకిట్ సీఈఓ దీపేంద్ర గోయల్ డెలివరీ సంపాదన, పని గంటలు, భద్రతకు సంబంధించిన కీలక గణాంకాలను విడుదల చేశారు.
నెలకు రూ. 25 వేలకు పైగా సంపాదన సాధ్యమేనా?
చాలా మంది సామాన్యుల మనసులో మెదిలే ప్రశ్న.. అసలు ఒక డెలివరీ బాయ్ నెలకు ఎంత సంపాదిస్తాడు? ఈ లెక్కలను దీపేంద్ర గోయల్ వెల్లడించారు. 2025లో జొమాటో డెలివరీ బాయ్ సగటు గంట సంపాదన రూ.102గా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11శాతం పెరిగింది. ఒక వ్యక్తి నెలకు 26 రోజులు, రోజుకు 10 గంటల చొప్పున పని చేస్తే అతని ఆదాయం రూ. 26,500 వరకు ఉంటుంది. పెట్రోల్, బైక్ నిర్వహణ ఖర్చుల కోసం 20శాతం మినహాయిస్తే, డెలివరీ బాయ్ చేతికి రూ.21,000 నికర ఆదాయం అందుతుంది. ఇది నేటి కాలంలో అనేక ఎంట్రీ లెవల్ ఆఫీస్ ఉద్యోగాల జీతంతో సమానం.
పార్ట్ టైమ్ వైపే మొగ్గు.. ఏడాదికి కేవలం 38 రోజులే పని!
డెలివరీ పనిని అందరూ పూర్తి స్థాయి కెరీర్‌గా ఎంచుకోవడం లేదని డేటా చెబుతోంది. సగటున ఒక డెలివరీ పార్ట్‌నర్ ఏడాదిలో కేవలం 38 రోజులు మాత్రమే పని చేస్తున్నారు. కేవలం 2.3శాతం మంది మాత్రమే ఏడాదికి 250 రోజుల కంటే ఎక్కువ పని చేస్తున్నారు. నిర్దిష్ట షిఫ్టులు లేదా బాస్ వేధింపులు లేకపోవడంతో యువత తమకు ఖాళీ ఉన్న సమయంలో అదనపు ఆదాయం కోసం ఈ పనిని ఎంచుకుంటున్నారని కంపెనీ తెలిపింది.
టిప్స్ ఇవ్వడంలో పిసినారితనం
డెలివరీ యాప్స్ టిప్స్ డబ్బును తమ వద్దే ఉంచుకుంటాయనే అపోహను గోయల్ కొట్టిపారేశారు. కస్టమర్లు ఇచ్చే టిప్ 100శాతం రైడర్‌కే చేరుతుందని స్పష్టం చేశారు. అయితే భారతీయ కస్టమర్లు టిప్స్ ఇవ్వడంలో వెనుకబడి ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. బ్లింకిట్ ఆర్డర్లలో కేవలం 2.5శాతం, జొమాటోలో కేవలం 5శాతం ఆర్డర్లకు మాత్రమే టిప్స్ అందుతున్నట్లు తెలిపారు. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్‌కు గంటకు సగటున కేవలం రూ. 2.6 మాత్రమే టిప్స్ రూపంలో వస్తోంది.
10 నిమిషాల డెలివరీ.. ప్రాణాలకు ముప్పా?
వేగవంతమైన డెలివరీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలపై గోయల్ వివరణ ఇచ్చారు. 10 నిమిషాల డెలివరీ అనేది రైడర్ వేగం మీద కాకుండా స్టోర్ యొక్క స్థానం, లాజిస్టిక్స్ మీద ఆధారపడి ఉంటుందన్నారు. “బ్లింకిట్‌లో సగటు డెలివరీ దూరం కేవలం 2 కిలోమీటర్లు. దీనిని పూర్తి చేయడానికి 8 నిమిషాలు పడుతుంది. ఈ క్రమంలో రైడర్ సగటు వేగం గంటకు 16 కిలోమీటర్లు మాత్రమే. ఇది సాధారణ సిటీ ట్రాఫిక్ వేగం కంటే చాలా తక్కువ, సురక్షితం” అని ఆయన తెలిపారు. మొత్తానికి గిగ్ ఎకానమీలో ఆదాయం బాగున్నప్పటికీ, నిర్వహణ ఖర్చులు, కస్టమర్ల నుంచి ఆశించిన మద్దతు తోడైతే ఈ కార్మికుల జీవితాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
