Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Jeevan Azad: పాలసీ 20 ఏళ్లు.. కానీ ప్రీమియం 12ఏళ్లు కడితే చాలు.. ప్రయోజనాలు మామూలుగా ఉండవు..

ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ అనేది.. పరిమిత కాల చెల్లింపు ఎండోమెంట్ ప్లాన్. బీమా ప్లస్ పొదుపు పథకం. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారు దురదృష్టవశాత్తు మరణిస్తే, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ఈ పథకం అందిస్తుంది.

LIC Jeevan Azad: పాలసీ 20 ఏళ్లు.. కానీ ప్రీమియం 12ఏళ్లు కడితే చాలు.. ప్రయోజనాలు మామూలుగా ఉండవు..
Insurance
Follow us
Madhu

|

Updated on: May 05, 2023 | 11:00 AM

లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్ఐసీ) ఆ పేరే ప్రజలకు ఓ పెద్ద భరోసా. అందుకే దానిలో ఏ పథకం కొత్త ప్రారంభించినా ప్రజలు దానిపై ఆసక్తి కనబరుస్తారు. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తారు. ఇదే క్రమంలో 2023 జనవరి 23న ఎల్‌ఐసీ జీవన్‌ ఆజాద్‌ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిని ప్రవేశపెట్టిన 10 నుంచి 15 రోజుల్లోనే ఆ స్కీమ్‌ కి విపరీతమైన స్పందన వచ్చింది. నెలలోపే 50,000 పాలసీలు అమ్ముడయ్యాయి. అయితే అంత పెద్ద మొత్తంలో పాలసీలు అమ్ముడవ్వడానికి కారణమేంటి? అంతలా ప్రయోజనాలు ఈ స్కీమ్‌లో ఏమున్నాయి. మరోసారి దాని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది పథకం.. ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ అనేది.. పరిమిత కాల చెల్లింపు ఎండోమెంట్ ప్లాన్. బీమా ప్లస్ పొదుపు పథకం. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారు దురదృష్టవశాత్తు మరణిస్తే, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ఈ పథకం అందిస్తుంది. ఈ పథకం కింద రుణ సౌలభ్యం కూడా ఉంది. మెచ్యూరిటీ తేదీ నాటికి పాలసీదారు జీవించి ఉంటే, జీవిత బీమాకు హామీ ఇచ్చిన మొత్తం చేతికి వస్తుంది.

ఎవరు అర్హులు.. ఈ జీవన్ ఆజాద్ జీవిత బీమా పాలసీ పొందేందుకు కనీస వయసు 90 రోజుల నుంచి గరిష్ఠంగా 50 ఏళ్లు. అంటే, మూడు నెలల వయస్సున్న పిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. దీనితో పాటు, మీకు 50 ఏళ్లు నిండినప్పటికీ ఆ తర్వాత 8 సంవత్సరాల పాటు పాలసీ కవరేజ్‌లో ఉంటారు. ఇందులో కనిష్టంగా సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఆరోగ్యంగా ఉన్నవారికి ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే రూ.3 లక్షల వరకు సమ్ అష్యూర్డ్‌తో ప్లాన్ తీసుకోవచ్చు. రూ.3 లక్షలకుపైగా సమ్ అష్యూర్డ్ కావాలంటే మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

పాలసీ వ్యవధి.. జీవన్ ఆజాద్ పాలసీ కాల వ్యవధి 15 నుంచి 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. పాలసీదారు వెసులుబాటును బట్టి వార్షిక ‍‌(12 నెలలకు ఒకసారి) లేదా అర్ధ వార్షిక ‍‌(6 నెలలకు ఒకసారి) లేదా త్రైమాసిక ‍‌(3 నెలలకు ఒకసారి) లేదా నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు. 20 ఏళ్ల పాలసీ టర్మ్ తీసుకుంటే 8 ఏళ్లు మినహాయించి మిగిలిన 12 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

డెత్ బెనిఫిట్‌.. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే మరణిస్తే, ఈ పథకం కింద అతని కుటుంబ సభ్యులకు డెత్‌ బెనిఫిట్‌ లభిస్తుంది. మరణ ప్రయోజనం బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు సమానంగా ఉంటుంది. పాలసీదారు మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో ఇది 105% కంటే తక్కువ కాకుండా ఉంటుంది.

(నోట్: పై సమాచారం అవగాహన కోసం మాత్రమే. పాలసీ ఎంచుకునే ముందు పాలసీ డాక్యుమెంట్ చదివి, దాని గురించి వివరంగా తెలుసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టాలి.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..