Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Tickets: విమాన ప్రయాణికులకు దీపావళి ధమాకా.. 20-25శాతం వరకూ టికెట్ ధరలు తగ్గింపు..

దీపావళి భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటి. చాలా మంది ప్రజలు కుటుంబంతో కలిసి ఉండటానికి.. పని చేసే చోటు నుంచి సెలవులు తీసుకొని వచ్చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణాలు పెరుగుతాయి. బుకింగ్లు అధికమవుతాయి. ఫలితంగా విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచుతాయి. సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది. కానీ దీనికి విరుద్ధంగా దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20-25 శాతం తగ్గాయి.

Air Tickets: విమాన ప్రయాణికులకు దీపావళి ధమాకా.. 20-25శాతం వరకూ టికెట్ ధరలు తగ్గింపు..
Flight
Madhu
|

Updated on: Oct 15, 2024 | 5:25 PM

Share

సాధారణంగా పండుగల సమయంలో అన్ని రంగాల్లోనూ ఆఫర్లు ప్రకటిస్తారు. అయితే రవాణా రంగానికి వచ్చే సరికి పండుగల సమయాల్లోనే రేట్లు పెరుగుతుంటాయి. బస్సులు, రైళ్లలో స్పెషల్ పేరిట డబుల్ రేట్లు వసూలు చేస్తూ ఉంటారు. ఇక విమాన ప్రయాణానికి అక్కడ కూడా అంతే.. డిమాండ్ పెరిగితే టికెట్లు పెరుగుతుంటాయి. అయితే ఈ సారి దీపావళికి మాత్రం విమాన ప్రయాణికులు తప్పనిసరిగా ఆనంద పడతారు. ఎందుకంటే ఆ సమయంలో విమాన ప్రయాణాలపై టికెట్ల రేట్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా దేశీయ రూట్లలో సగటు విమాన చార్జీలు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 20 నుంచి 25శాతం తగ్గాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ధరలు తగ్గడానికి కారణం ఏమిటి?

సాధారణంగా విమానయాన సంస్థలు డైనమిక్ ప్రైసింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. ఇవి డిమాండ్ పెరిగేకొద్దీ ఛార్జీలను పెంచుతాయి. ముఖ్యంగా దీపావళి వంటి సెలవుల సమయంలో ఆటో మేటిక్ గా ధరలు పెరుగుతాయి. కానీ అందుకు విరుద్ధంగా దీపావళికి తక్కువ చార్జీలు ఉండటం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విమాన టిక్కెట్ ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా కెపాసిటీ పెరగడం, ఇటీవల చమురు ధరలు తగ్గడం వంటి వాటి ప్రభావమేనని భావిస్తున్నారు. గత సంవత్సరం, పరిమిత సామర్థ్యం కారణంగా దీపావళి సమయంలో విమాన ఛార్జీలు పెరిగాయి. ప్రధానంగా గో ఫస్ట్ ఎయిర్‌లైన్ సస్పెన్షన్ కారణంగా ఇది జరిగింది. ఈ సంవత్సరం కొంత ఉపశమనం ఉంది.. అదనపు సామర్థ్యం అందుబాటులో కి వచ్చింది. ఇది అక్టోబర్ చివరి వారంలో కీలక మార్గాలలో సగటు విమాన ఛార్జీలలో 20-25 శాతం తగ్గుదలకు దారితీసిందని వివరిస్తున్నారు. అలాగే చమురు ధరలలో తగ్గుదల కూడా ఓ కారణంగా వివరిస్తున్నారు. ఈ సంవత్సరం 15 శాతం తగ్గడం దీనికి దోహద పడి ఉండవచ్చని చెబుతున్నారు. ఫలితంగా పండుగ సీజన్‌లో ప్రయాణికులకు మరింత సరసమైన ధరలకు విమానాల్లో ప్రయాణించే అవకాశం ఏర్పడింది.

ధరల వ్యత్యాసం ఇలా..

విమానాల్లో 30 రోజుల ఏపీడీ (అడ్వాన్స్డ్ పర్చేస్ డేట్) ప్రాతిపదికన వన్-వే సగటు ఛార్జీలు ఉంటాయి. దీపావళి సమయంలో గతేడాదికి ఇప్పటికీ అంటే 2023 నవంబర్ 10 నుంచి 16, ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకూ ధరల తేడాను గమనిస్తే..

  • బెంగళూరు-కోల్‌కతా విమానానికి సగటు విమాన చార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుంచి ఈ ఏడాది రూ.6,319కి తగ్గాయి.
  • చెన్నై-కోల్‌కతా మార్గంలో టికెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి అంటే 36 శాతం తగ్గింది.
  • ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన చార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి అంటే 34 శాతం తగ్గింది.
  • అదేవిధంగా ఢిల్లీ-ఉదయ్‌పూర్ రూట్‌లో టికెట్ ధరలు 34 శాతం తగ్గి, రూ.11,296 నుంచి రూ.7,469కి వచ్చాయి.
  • ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత కనిపిస్తోంది.

ఈ మార్గాల్లో పెరుగుతున్నాయ్..

ఇదిలా ఉండగా, కొన్ని మార్గాల్లో విమాన చార్జీలను 34 శాతం వరకు పెంచారు. అహ్మదాబాద్‌-ఢిల్లీ రూట్‌లో టికెట్‌ ధర రూ.6,533 నుంచి రూ.8,758కి అంటే 34 శాతం పెరిగింది. ముంబై-డెహ్రాడూన్‌ రూట్‌లో రూ.11,710 నుంచి రూ.15,527కి అంటే 33 శాతం పెరిగిందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..