AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: బంగారం ధరలకు మళ్లీ బూస్ట్? 2027లో భారీగా పుంజుకునే అవకాశం.. HSBC కీలక అంచనా!

Gold Rate: ప్రస్తుతం బంగారంపై డాలర్ బలం, అధిక వడ్డీ రేట్ల అంచనాలు, చమురు ధరలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కానీ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భారత్-చైనా సంస్థాగత డిమాండ్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఫెడ్ విధానంలో మార్పు వంటి అంశాలు 2027లో బంగారం ధరలకు..

Gold Rate: బంగారం ధరలకు మళ్లీ బూస్ట్? 2027లో భారీగా పుంజుకునే అవకాశం.. HSBC కీలక అంచనా!
Gold Price 2027
Subhash Goud
|

Updated on: Oct 05, 2026 | 7:34 PM

Share

Gold Rate: బంగారం ధరలు ఇటీవలి కాలంలో భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి, బలపడుతున్న అమెరికా డాలర్, పెరుగుతున్న చమురు ధరలు పసిడిపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే పరిస్థితులు మారితే 2027లో బంగారం ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని HSBC అంచనా వేసింది.

ఫెడ్ నిర్ణయాలపైనే కీలక ఆధారం

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్లు ఊహిస్తున్నంత కఠినంగా వ్యవహరించకపోతే బంగారం ధరలు తిరిగి పెరిగే అవకాశం ఉందని HSBC చీఫ్ ప్రెషియస్ మెటల్స్ అనలిస్ట్ జేమ్స్ స్టీల్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లు అమెరికాలో మరిన్ని వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. దీంతో అమెరికా డాలర్, బాండ్లపై రాబడులు పెరగడం బంగారం ఆకర్షణను తగ్గిస్తోంది. అయితే ఫెడ్ ఊహించినంత వేగంగా వడ్డీ రేట్లను పెంచకపోతే పరిస్థితి బంగారానికి అనుకూలంగా మారవచ్చని HSBC చెబుతోంది.

రికార్డు స్థాయి నుంచి భారీ పతనం

ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు భారీ రికార్డును నమోదు చేశాయి. జనవరి 30న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర సుమారు $5,450 వరకు వెళ్లింది. అయితే ఆ తర్వాత ధరలు భారీగా పడిపోయి జూన్ చివరి నాటికి సుమారు $3,942కు చేరాయి. ఇరాన్ వివాదం, చమురు ధరల పెరుగుదల, అమెరికా బాండ్ యీల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటం వంటి అంశాలు బంగారంపై ఒత్తిడికి కారణమయ్యాయి.

ఇవి కూడా చదవండి

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కీలకం

అయితే బంగారానికి పూర్తిగా ప్రతికూల పరిస్థితులు లేవని హెచ్‌ఎస్‌బీసీ అభిప్రాయపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను విభిన్నీకరించేందుకు బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ఈ కొనుగోళ్లు బంగారం ధరలకు ఒక రకమైన కనీస మద్దతు కల్పించే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దీర్ఘకాలిక రిజర్వ్ డైవర్సిఫికేషన్ వంటి అంశాలు కూడా పసిడికి మద్దతుగా నిలవొచ్చని తెలిపింది.

భారత్, చైనాలో సంస్థాగత డిమాండ్

భారత్, చైనాల్లో బంగారానికి సంస్థాగత డిమాండ్ కూడా కొంత బలంగా ఉందని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. నియంత్రణల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆర్థిక సంస్థలకు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. అదే సమయంలో ఈ రెండు దేశాల్లో ప్రాపర్టీ, ఈక్విటీ మార్కెట్లలో బలహీనత ఉండటం వల్ల పెట్టుబడిదారులు బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా చూడవచ్చని HSBC అభిప్రాయపడుతోంది.

నగల డిమాండ్ మాత్రం బలహీనం

బంగారం ధరలు భారీగా పెరగడంతో సాధారణ వినియోగదారుల నుంచి నగల డిమాండ్ తగ్గుతోంది. అధిక ధరలు కొనసాగుతున్నంత కాలం జ్యువెలరీ డిమాండ్ త్వరగా కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని HSBC అంచనా వేస్తోంది. అయితే పెట్టుబడి పరంగా బంగారంపై ఆసక్తి తిరిగి పెరిగితే ETFలు, బార్లు, ఇతర పెట్టుబడి మార్గాల ద్వారా డిమాండ్ పెరగవచ్చని పేర్కొంది.

2027లో గోల్డ్ ధరలకు మళ్లీ మంచి రోజులు?

ఇదే సమయంలో 2027లో బంగారం ధరలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నది హెచ్‌బీసీ తాజా అంచనాలో కీలక అంశం. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మార్కెట్లు అంచనా వేస్తున్నంత స్థాయిలో పెంచకపోతే, డాలర్‌పై ఒత్తిడి రావచ్చు. అలాంటి పరిస్థితిలో బంగారం మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే HSBC గతంలో 2027 సగటు బంగారం ధర అంచనాను తగ్గించినప్పటికీ, దీర్ఘకాలికంగా పసిడిపై సానుకూల వైఖరిని కొనసాగిస్తోంది. జూలైలో 2027 సగటు అంచనాను ఔన్స్‌కు $4,925గా పేర్కొంది. అయితే తాజా విశ్లేషణలో సమీపకాల ఒత్తిడి తర్వాత 2027లో పరిస్థితులు అనుకూలిస్తే బంగారం మళ్లీ పైకి కదలొచ్చని తెలిపింది.

ప్రస్తుతం బంగారంపై డాలర్ బలం, అధిక వడ్డీ రేట్ల అంచనాలు, చమురు ధరలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కానీ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భారత్-చైనా సంస్థాగత డిమాండ్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఫెడ్ విధానంలో మార్పు వంటి అంశాలు 2027లో బంగారం ధరలకు మళ్లీ బలమైన మద్దతు ఇవ్వవచ్చని హెచ్‌ఎస్‌బీసీ అభిప్రాయపడుతోంది. అంటే.. ప్రస్తుతం బంగారం ధరల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, 2027లో మళ్లీ పసిడి పరుగులు పెట్టే అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేమన్నది హెచ్‌ఎస్‌బీసీ అంచనా.

గమనిక: ఇది HSBC అంచనాల ఆధారంగా రూపొందించిన వార్తా కథనం మాత్రమే. బంగారం ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతాయి.

ఇది కూడా చదవండి: Bajaj Pulsar: 2026 బజాజ్ పల్సర్ NS400Z లాంచ్.. కొత్త TFT డిస్‌ప్లే, అద్భుతమైన ఫీచర్లతో ఎంట్రీ!

ఇది కూడా చదవండి: Fitness Mistakes: ఫిట్‌నెస్ ప్రియులు చేసే అతిపెద్ద తప్పులు.. ఇవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us