Gold Rates: మిడిసిపడుతున్న పసిడి.. 75 రోజుల్లో 14 శాతం రాబడి.. పెట్టుబడిదారుల గందరగోళం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను బంగారం ఆకర్షిస్తుంది. దాదాపు 75 రోజుల్లో బంగారం పెట్టుబడిదారులకు 14 శాతం వరకు రాబడిని ఇచ్చిందంటే ధర పెరుగుదల ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. మూడేళ్ల క్రితం బంగారం కొన్న వారికి 17 శాతం వార్షిక ఆదాయాన్ని ఇచ్చింది. ఇది సెన్సెక్స్‌లో 11.5 శాతం రాబడి కంటే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో బంగారం పెట్టుబడిదారులకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది.

బంగారంపై ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారు ఈ సమయంలో బంగారం అమ్మడం మేలేనా? అనే విషయంలో చాలా గందరగోళానికి గురవుతున్నారు. బంగారం ధరల పెరుగుదల త్వరలో ముగియవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక దౌత్య చర్చలు మరింత స్థిరమైన అంతర్జాతీయ వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. దీని వల్ల బంగారం ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారానికి సంబందించిన రిస్క్-రిటర్న్ చెల్లింపు సమీప భవిష్యత్తులో దానికి అనుకూలంగా ఉండదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం బంగారం ఈక్విటీ కంటే మెరుగ్గా పని చేస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 1999 నుంచి సెన్సెక్స్-టు-గోల్డ్ నిష్పత్తి విశ్లేషణ ప్రకారం నిష్పత్తి 1 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈక్విటీలు రాబోయే మూడు సంవత్సరాలలో బంగారాన్ని అధిగమిస్తాయని, నిష్పత్తి 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, బంగారం రాబోయే మూడు సంవత్సరాలలో ఈక్విటీలను అధిగమిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుత నిష్పత్తి దీర్ఘకాలిక సగటు 0.96 కంటే తక్కువగా ఉంది. దీని బట్టి రాబోయే మూడు సంవత్సరాలలో ఈక్విటీ బంగారాన్ని అధిగమించవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
1980లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత, తరువాతి రెండేళ్లలో బంగారం ధరలు 56 శాతం తగ్గుదల చూశాయి. ఆ తర్వాత బంగారం మళ్ళీ గరిష్ట స్థాయికి చేరుకోవడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత 1989 నవంబర్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2012లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. 2012 నవంబర్‌లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలలో 30 శాతం తగ్గుదల కనిపించింది. 2019 సంవత్సరంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 75 రోజుల్లో బంగారం పెట్టుబడిదారులకు దాదాపు 14 శాతం రాబడిని ఇచ్చినా భవిష్యత్‌లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చని మెజార్టీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి