Gold: బంగారం కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేకుంటే మోసపోతారు..
కరీంనగర్‌కు చెందిన రైతు ప్రవీణ్ పంట పండించి మంచి ఆదాయం పొందాడు. ఆ డబ్బును బంగారు ఆభరణాల(Gold jewellary)పై పెట్టుబడిగా పెట్టాడు...
కరీంనగర్‌కు చెందిన రైతు ప్రవీణ్ పంట పండించి మంచి ఆదాయం పొందాడు. ఆ డబ్బును బంగారు ఆభరణాల(Gold jewellary)పై పెట్టుబడిగా పెట్టాడు. అప్పుడు బంగారం 10 గ్రాములు రూ.55,000లుగా ఉంది. పది తులాల విలువైన ఆభరణాలకు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ(GST) కలిపి ఆరు లక్షల రూపాయలు చెల్లించాడు. అయితే అతని భార్య చికిత్సకు డబ్బులు అవసరం కావడంతో బంగారం అమ్మేందుకు నగల వ్యాపారి వద్దకు వెళ్లాడు. కానీ నగల వ్యాపారి ధర చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. 20 క్యారెట్ల(carates) ఆభరణాలను ప్రవీణ్‌కు 24 క్యారెట్ల ధరకు విక్రయించారు. ఇప్పుడు బంగారం ధర రూ.51,000 కాబట్టి 20 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,000 అవుతుంది. దీనిపై కూడా, స్వర్ణకారుడు 10 శాతం తరుగుగా తీసివేశాడు. ప్రవీణ్ ఆభరణాల అమ్మగా కేవలం 3.60 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈ కథ ప్రవీణ్ ఒకరిదే మాత్రమే కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఆభరణాలు కొనుగోలు చేసి తమ పొదుపును బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు.
పెట్టుబడికి బంగారం మంచి ఎంపిక అని కేడియా అడ్వైజరీ వ్యవస్థాపకుడు అజయ్ కేడియా చెప్పారు. కానీ బంగారు ఆభరణాలు ఏ సందర్భంలోనూ మంచి ఎంపిక కాదన్నారు. ఈ పెట్టుబడిలో మీరు లాభాన్ని ఆశించలేరని పేర్కొన్నారు. అందుకే బంగారు ఆభరణాలపై ఎప్పుడూ పెట్టుబడి పెట్టకూడదు. ఆభరణాలను అవసరాలకు మాత్రమే కొనుగోలు చేయాలి. మీరు కొనుగోలు చేసే ఆభరణాలన్నీ హాల్‌మార్క్‌తో ఉండాలి. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు సావరిన్ గోల్డ్ బాండ్ ఉత్తమ ఎంపిక అని అజయ్ కేడియా చెప్పారు. మీరు భౌతిక బంగారాన్నే కొనుగోలు చేయాలనకుంటే.. దానిని నాణెం, బార్ లేదా బిస్కెట్ రూపంలో బ్యాంకు ద్వారా కొనుగోలు చేయండి. ఒకవేళ మీరు ఆభరణాలు స్వర్ణకారుడి నుంచి కొనుగోలు చేస్తుంటే.. దాని స్వచ్ఛతను నిర్ధారించుకోండి. అలాగే, మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే.. ఖచ్చితంగా దానికి బిల్లు తీసుకోండి.
బిల్లు ఎందుకు తీసుకోవాలంటే.. ప్రభుత్వం ఇప్పుడు బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసినప్పటికీ.. కొంతమంది నగల వ్యాపారులు ఇప్పటికీ హాల్‌మార్క్ లేకుండా ఆభరణాలను విక్రయిస్తున్నారు. జీఎస్టీని ఆదా చేసేందుకు కొందరు బిల్లు లేకుండానే ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ దురాశ వారికి నష్టాన్ని మిగిల్చవచ్చు. అందుకే మీరు నగలు కొనుగోలు చేసినప్పుడల్లా ఖచ్చితంగా దానికి బిల్లు తీసుకోండి. దీని వల్ల మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. మీరు ఈ ఆభరణాలను విక్రయించడానికి వెళ్లినప్పుడల్లా, స్వర్ణకారుడు దాని స్వచ్ఛత విషయంలో మిమ్మల్ని మోసం చేయలేడు. బిల్లుతో పాటు ఆభరణాలను విక్రయించేటప్పుడు, నగల వ్యాపారులు మిమ్మల్ని ఎటువంటి పరిస్థితిలోనూ మోసం చేయలేరు. మీరు ఇల్లు, వస్తువులకు బీమా తీసుకుంటే, దొంగతనం లేదా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మీరు దానిని క్లెయిమ్ చేయవచ్చు. బీమా కంపెనీలు బిల్లు లేకుండా క్లెయిమ్‌లను అంగీకరించవు. ఇదే పరిస్థితి బ్యాంకు లాకర్లకూ వర్తిస్తుంది. ఇది కాకుండా బిల్లుతో కొనుగోలు చేసిన నగలను ఆదాయపు పన్ను శాఖ దాడుల సమయంలో జప్తు చేయలేరు. అందుకే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీని ఎగవేసేందుకు ప్రయత్నించకండి. ప్రవీణ్ వంటి పరిస్థితిని ఎదుర్కొకుండా ఉండాలంటే బిల్లు తప్పనిసరిగా తీసుకోండి.
Read Also.. Gold Bands: గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి.. అందులో పెట్టుబడి పెట్టడం మంచిదేనా..