EPFO’s corpus: పరుగులు పెడుతున్న ఈపీఎఫ్ఓ కార్పస్.. ఐదేళ్లలో రెట్టింపుకంటే ఎక్కువ
ప్రతి ఒక్కరూ ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటారు. దీనికోసం అనేక ప్రణాళికలు వేసుకుంటారు. వీరిలో ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనే పథకం అమలువుతుంది.
ప్రతి నెలా వారికి వచ్చే జీతంలో కొంత భాగం దీనిలో జమచేస్తారు. యజమాని కూడా అదే మొత్తం ఆ ఉద్యోగి, కార్మికుడి ఖాతాలో వేస్తారు. ఉద్యోగ విరమణ సమయానికి అది పెద్ద మొత్తంగా మారి ఆదుకుంటుంది. ఈపీఎఫ్ పథకాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) నిర్వహిస్తుంది. కాగా.. ఈపీఎఫ్ వో పెట్టుబడి కార్పస్ గత ఐదేళ్లలో రెట్టింపు అయ్యింది. దాదాపు రూ.24.75 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇటీవల లోక్ సభలో ఈపీఎఫ్ వో కార్పస్ గురించి వివరించారు. 2024 మార్చి 31 నాటికి రూ.24.75 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ మొత్తం 2019-20లో కేవలం రూ.11.1 లక్షల కోట్లుగా ఉంది. గత ఐదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి రికార్డు నెలకొల్పింది.
ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్థిక సేవల విభాగం తెలియజేసిన పెట్టుబడి నమూనాకు అనుగుణంగా ఈపీఎఫ్ వో వివిధ మార్గాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తుంది. వాటిలో డెట్ సెక్యూరిటీలు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లు ఉంటాయి. 2015 మార్చి 31వ తేదీన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ), ఈపీఎఫ్ సమావేశం జరిగింది. దానిలో ఆమోదించిన ప్రకారం అదే ఏడాది నుంచి సెంట్రల్ ఎక్స్చేంజ్ ఫండ్ లలో ఈపీఎఫ్ వో పెట్టుబడులు మొదలయ్యాయి. ఈపీఎఫ్ వో క్రమం తప్పకుండా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతోంది. బీఎస్ ఈ, ఎన్ ఎస్ఈ సూచనలను తీసుకుంటుంది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల ద్వారా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే భారత ప్రభుత్వ వాటాల ఉప సంహరణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈటీఎఫ్ లలో కూడా పెట్టుబడులు పెడుతుంది. లోక్ సభలో మంత్రి తెలిపిన వివరాల ప్రకారం 2024-25 (అక్టోబర్ 2024 వరకూ) ఈపీఎఫ్ వో రూ.34,207 కోట్లను ఈటీఎఫ్ లలో ఇన్వెస్ట్ చేసింది.
కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన నవంబర్ 30వ తేదీన ఈపీఎఫ్ వో సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధిక ఆదాయం పొందే విధానంలో భాగంగా సీపీఎస్ఈ, భారత్ 22 ఎక్స్చేంజ్ ట్రేడెట్ ఫండ్ పెట్టుబడుల కోసం రిడెంప్షన్ పాలసీని ఆమోదించారు. అలాగే సెబీ నియంత్రణలో ఉండే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పీఎస్ యూ) స్పాన్సర్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్టులు జారీ చేసిన యూనిట్లలో పెట్టుబడుల కోసం విధివిధానాలను రూపొందించారు. ఈపీఎఫ్ చందాదారులందరికీ మెరుగైన రాబడిని అందించే క్రమంలో భాగంగా అనేక నిర్ణయాలను ఈపీఎఫ్ వో తీసుకుంటోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..