AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు.. ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం

Cooking Oil Price: వంట నూనె ధరలతో ఇబ్బందులకు గురైన సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అరిపోయే శుభవార్త చెప్పింది. వంట నూనెల ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం..

Cooking Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు.. ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం
Subhash Goud
|

Updated on: Jun 17, 2021 | 11:50 AM

Share

Cooking Oil Price: వంట నూనె ధరలతో ఇబ్బందులకు గురైన సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అరిపోయే శుభవార్త చెప్పింది. వంట నూనెల ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  అయితే అయితే కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ మేరకు కొత్త ధరలు 2021 జూన్ 17 వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త ధరలను  పరిశీలిస్తే.. పామాయిల్‌ ధర 2021 మే 7వ తేదీ నాటికి 142 రూపాయలు ఉండగా, ఇప్పుడు కిలోకు రూ.115 వరకు దిగి వచ్చింది. అలాగే 2021, మే 5వ తేదీ నాటికి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలోకు రూ.188 ఉంది. ఇప్పుడు కిలోకు 16శాతం మేర అంటే రూ.157కు పడిపోయింది. 2021, మే 20 నాటికి సోయా ఆయిల్‌ కిలోకు రూ.162 ఉండగా, ముంబైలో కిలోకు రూ.138కి పడిపోయింది. అలాగే ఆవ నూనె విషయంలో 2021, మే 16 నాటికి రూ.175 ఉండగా, ఇప్పుడు కిలోకు రూ.157కు దిగివచ్చింది. 2021 మే 14 నాటికి వేరుశనగ నూనె ధర రూ.190 ఉండగా, ఇప్పుడు కిలోకు రూ.174 వరకు దిగి వచ్చింది. ఇక మే2 నాటికి వనస్పతి ధర కిలోకు రూ.154 ఉండగా, ఇప్పుడు రూ.141కి దిగి వచ్చింది.

కాగా, కాండ్లా, ముంద్రా పోర్ట్‌లలో నూనె స్టాక్‌ భారీగా నిలిచిపోయింది. ఈ స్టాక్‌కు అనుమతి లేకపోవడం వల్ల అలాగే పోర్ట్‌లలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఈ స్టాక్‌కు క్లియరెన్స్ వస్తుండటంతో మార్కెట్‌లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుంది. దీని వల్ల నూనె ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంట నూనె కోసం భారత్‌ ఎక్కువగా దిగుమతిపై ఆధారపడింది. ప్రతి ఏడాది భారత్‌ వంట నూనె దిగుమతుల కోసం రూ.75వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఒక వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ సామాన్యుడి నడ్డి వరుస్తుంటే.. మరోవైపు వంట నూనెల ధరలు కూడా భారీగా పెరుగుతూ సామాన్యులకు గండంగా మారుతోంది. వంట నూనె ధర ఈ నెలలో భారీగా పెరిగింది. పామ్ ఆయిల్, వేరు శనగ నూనె, ఆవాల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ఇలా మీరు ఏ నూనె తీసుకున్నా కూడా ధరలు మండిపోతున్నాయి. వంటల్లో నూనె వేయాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే.. వంట నూనె ధర దశాబ్ద కాలంలోనే గరిష్ట స్థాయికి చేరింది. 2010 జనవరి నుంచి నూనె ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అంతేకాదు నిత్యావసర సరుకులు సైతం ధరలతో మండిపోతున్నాయి. ప్రతియేటా ముడి వంటనూనె దిగుమతుల కోసం కేంద్రం 76 వేల కోట్ల రూపాయలకుపైగా వెచ్చిస్తోంది. దేశంలో వరి, గోధుమ ఇతర ఆహార పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు ఉన్నట్లే నూనె గింజల పంటలకు లేవు. రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు అందకపోవడం కారణంగా అధిక శాతం రైలులు వీటిని సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.

అసలు ఎందుకింత ధరలు పెరుగుతున్నాయ్‌..

దీనికి అధికంగా మనం దిగుమతులపై ఆధారపడడమే కారణం. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్‌, బ్రెజిల్‌, ఉక్రెయిన్‌, రష్యా, అర్జెంటీనా నుంచి పొద్దుతిరుగుడు నూనెను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. అలాగే వంట నూనెలపై దేశం దిగుమతి సుంకాలు అధికంగా ఉండడమూ ధరలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. మరో ఐదు శాతం వస్తుసేవల పన్ను జీఎస్టీ రూపంలో చెల్లించాల్సి ఉండటం వల్ల ధరలు పెరుగుతున్నాయి. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ ఆంక్షలతో దిగుమతులు ఆగిపోవడం కూడా ధరలు పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో లభించే డేటా ప్రకారం.. ఆరు రకాల వంట నూనెల నెలవారీ సగటు, రిటైల్‌ ధరలు 2010 జనవరి నుంచి అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రాల పౌర సరఫరాల విభాగం సైతం అంగీకరిస్తున్నాయి.

భారత్‌లో మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నూనె గింజలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో సాగయ్యే ప్రధాన నూనె గింజలు వేరు శెనగ, పామాయిల్‌, నువ్వులు, సోయా, అముదాలు, పొద్దు తిరుగుడు, ఆవాలు. 2020 ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల 30 లక్షలు మెట్రిక్‌ టన్నుల నూనెగింజల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది కోటీ 20 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉత్పత్తి చేసిన సోయాబిన్‌ అత్యధికంగా సాగు చేసిన పంటగా నిలిచింది. రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో వంటనూనెల వినియోగం పడిపోయింది. ఆయిల్ ప్యాకెట్ కార్టన్లు గతంలో రోజుకు 50 అమ్మితే, ఇప్పుడు 20 కూడా అమ్మలేకపోతున్నామని వ్యాపారులు అంటున్నారు. వంట నూనెల ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుదల కంటే దేశీయంగా అధికంగా ఉంది. దేశీయ అవసరాల్లో 70 శాతం దిగుమతుల ద్వారానే భర్తీ అవుతోంది. అంతర్జాతీయ ధరలు దేశీయ ధరలకు కీలకం. దిగుమతి సుంకాలు తగ్గించి ధరలకు అడ్డుకట్ట వేయవచ్చు.

ఇవీ కూడా చదవండి

Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియామకం.. అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న సంస్థ వెల్లడి

BMI: పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయం ప్రభావం.. 51 శాతం పిల్లల్లో అనారోగ్య సమస్యలు: సర్వేలో వెల్లడి