PM Kisan: పీఎం కిసాన్ డబ్బు మీ ఖాతాలో పడలేదా.. వెంటనే ఇలా చేయండి..
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత నిధులను విడుదల చేసింది. ప్రధాని మోదీ 9 కోట్ల మంది రైతులకు రూ.18,000 కోట్లకు పైగా జమ చేశారు. అయితే కొంతమంది రైతుల అకౌంట్లలో ఈ నిధులు జమకాలేదని తెలుస్తోంది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిధులు జమకాకపోవడానికి కారణాలు ఇవే కావచ్చు..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత నిధులను ప్రధాని మోదీ బుధవారం కోయంబత్తూరు వేదికగా విడుదల చేశారు. ఈ విడతలో సుమారు 9 కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.18,000 కోట్లకు పైగా నిధులను కేంద్రం జమ చేసింది. దీంతో రైతుల వ్యవసాయ అవసరాలకు ఎంతో ఊరట లభించనుంది.
ఇప్పటివరకు 11కోట్ల మందికి
2019, ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇటీవల ఆగస్టు 2న 20వ విడత నిధులను విడుదల చేయగా, ఇప్పుడు 21వ విడత కూడా రైతుల చేతికి అందింది. ఇప్పటివరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ. 3.70 లక్షల కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
డబ్బులు రాకపోతే ఇలా చేయండి..
కొంతమంది రైతులకు అర్హత ఉన్నప్పటికీ ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.. అవి ఏంటంటే..?
- e-KYC పూర్తి కాకపోవడం: అత్యంత సాధారణ సమస్య అసంపూర్ణమైన e-KYC.
- ఆధార్ వివరాలు: బ్యాంకు ఖాతాలోని వివరాలకు, ఆధార్ కార్డులోని వివరాలకు తేడాలు ఉండటం.
- బ్యాంకు లింక్: బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం లేదా IFSC కోడ్ తప్పుగా ఉండటం.
కాబట్టి రైతులందరూ వెంటనే తమ స్టేటస్ చెక్ చేసుకుని బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలని, అలాగే e-KYC పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




