Lockdown Blow on Revenue: లాక్‌డౌన్ దెబ్బకు ప్రభుత్వ ఖజానాకు గండి.. సంక్షేమ పథకాలకే సగం ఖాళీ.. ఆదాయ అన్వేషణలో సర్కార్

కరోనా దెబ్బకు అనేక రంగాలు కుదేలయ్యాయి. వ్యాపార, వర్తక వాణిజ్యం నిలిచిపోయింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు ఈ మహమ్మారి ధాటికి చితికిపోయాయి.

Lockdown Blow on Revenue: లాక్‌డౌన్ దెబ్బకు ప్రభుత్వ ఖజానాకు గండి.. సంక్షేమ పథకాలకే సగం ఖాళీ.. ఆదాయ అన్వేషణలో సర్కార్
Lockdown Blow On Revenue Copy
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 02, 2021 | 11:03 AM

Lockdown Blow on Revenue: కరోనా దెబ్బకు అనేక రంగాలు కుదేలయ్యాయి. వ్యాపార, వర్తక వాణిజ్యం నిలిచిపోయింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు ఈ మహమ్మారి ధాటికి చితికిపోయాయి. తాజాగా డాటా సంస్థ డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సర్వే నిర్వహించిన సర్వేలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో దాదాపు 82 శాతం చిరు వ్యాపారులు కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నారని సంస్థ సర్వే తెలిపింది. తయారీ రంగం ముఖ్యంగా అనేక సంక్షోభానికి గురైందని వెల్లడించింది. దాదాపు 70 శాతం ఉత్పత్తి రంగ సంస్థలు కరోనాకు ముందు ఉన్న డిమాండ్‌ను తిరిగి పొందడానికి ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నాయి. 60 శాతం వివిధ కంపెనీలు ప్రభుత్వం నుంచి పథకాలతో మద్దతును ఆశిస్తున్నాయి. 42 శాతం కంపెనీలు మార్కెట్ యాక్సెస్, 37 శాతం ఉత్పాదకతను మెరుగుపరచడం, 34 శాతం ఫైనాన్స్‌ను సాధించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వెల్లడించాయి.

మరోవైపు ప్రభుత్వ ఖజానాకు భారీగానే గండిపడుతోంది. పన్ను రాబడిని కరోనా లాక్‌డౌన్‌ ఘోరంగా దెబ్బ తీసింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో రూ.2,038.09 కోట్ల మేర రాబడి తగ్గిందని అధికార వర్గాల సమాచారం. ఈ ఏడాది పన్ను రాబడుల ద్వారా రూ. 1,06,900.13 కోట్లను అంచనా వేశారు. అంటే, నెలకు సగటున రూ.8,908 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు సమకూరాల్సి ఉంది. కానీ.. మే నెలలో రూ.5,579.97 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అదే ఏప్రిల్‌లో రూ.7,618.06 కోట్లు వసూలయ్యాయి. వాస్తవానికి, ఏప్రిల్‌ నుంచే కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించింది. దీంతో, ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను విధించింది. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో మే 12వ తేదీ నుంచే లాక్‌డౌన్‌ మొదలైంది. నెలాఖరు వరకూ కొనసాగింది. ఫలితంగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించాయి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఇటు ప్రత్యక్షంగా, అటో పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండిపడింది.

ఇటు, జీఎస్టీతోపాటు మద్యం అమ్మకాలు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా తగ్గింది. ఏప్రిల్‌లో రూ.3,019.54 కోట్ల జీఎస్టీ వస్తే… మేలో రూ.1,733.07 కోట్లు మాత్రమే వసూలైనట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల ద్వారా ఏప్రిల్‌లో రూ.726.77 కోట్ల రాబడి సమకూరితే… మేలో కేవలం రూ.230.64 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక, ఊరట కలిగించే అంశం ఏమంటే.. అమ్మకం పన్ను మాత్రం కొంత ఆశాజనకంగా ఉంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు, పెట్రోలుపై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ను విధిస్తుంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతుండడంతో వీటిపై వ్యాట్‌ ఎక్కువగా వసూలైంది. దీంతో, ఏప్రిల్‌ కంటే మేలో అమ్మకం పన్ను ద్వారా రూ.36.56 కోట్లు అదనంగా సమకూరింది. ఇక, ఎక్సైజ్‌ సుంకాలు, ఇతర పన్నులు కూడా తగ్గాయి.

పన్ను రాబడి తక్కువగా ఉండడం, వేతనాలు, రైతుబంధు, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలకు నిధులను సర్దాల్సి రావడంతో ప్రభుత్వం మే నెలలో అపసోపాలు పడుతోంది. మే నెలలో రాబడి రూ. 13,045.24 కోట్ల నుంచి వేతనాలు, సంక్షేమ పథకాలకు సర్దుబాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాను పెంచుకునేందుకు అధ్యయనానికి మంత్రుల బృందంతో సబ్ కమిటీని నియమించింది. ఆదాయ మార్గాలపై విశ్లేషించి కేబినెట్ సబ్ కమిటీ.. భూముల విలువలు పెంచడం ద్వారా ఖజనాను పెంచుకోవచ్చని ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని మంత్రుల బృందం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా రాబడి పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.

ఇదిలా ఉంటే.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రిటైల్‌ రుణాలకూ కరోనా షాక్ తగులుతోంది. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో వసూళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు 11 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని ఎస్‌అండ్‌పీ అంచనా వేస్తోంది. అయితే, కరోనా విజృంభించి లాక్‌డౌన్లు పెరిగితే ఆ ప్రభావం వృద్ధిరేటుపై ఉంటుందని హెచ్చరించింది.

Read Also… Microsoft Bug: బగ్‌ను కనిపెట్టింది.. రూ. 22 లక్షలు గెలుచుకుంది. అసమాన ప్రతిభతో అదరగొట్టిన 20 ఏళ్ల ఢిల్లీ యువతి.