Indian Railways: రైల్వే శాఖకు వినియోగదారుల కమిషన్ షాక్.. చోరీ అయిన బ్యాగ్ కోసం 4.7 లక్షలు ఫైన్
భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా రైలు ప్రయాణం ఏళ్లుగా ప్రజాదరణ పొందుతుంది. అయితే రైలు ప్రయాణం ఎంత చౌకగా ఉన్నప్పటికీ ఇటీవల రైళ్లల్లో దొంగతనాలు భారీగా పెరిగాయి. చోరీకి గురైన వస్తువుల గురించి సమీప రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అయితే ఈ తరహా ఫిర్యాదుపై రైల్వే నిర్లక్ష్యం వహించడంతో రైల్వే శాఖకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. చోరీ అయిన బ్యాగ్ కోసం రూ.4.7 లక్షలు ప్రయాణికుడికి ఇవ్వాలని తీర్పునిచ్చింది.
మే 2017లో అమర్‌కంటక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా దిలీప్ కుమార్ చతుర్వేది అనే ప్రయాణికుడికి బ్యాగ్ చోరీకి గురైంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన బ్యాగ్ చోరీ అయ్యిందని దిలీప్‌కుమార్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి పరిహారంగా రూ. 4.7 లక్షలు చెల్లించాలని భారతీయ రైల్వేని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. చతుర్వేది తన కుటుంబంతో కలిసి కట్నీలో రైలు ఎక్కాడు. అయితే రైలు దుర్గ్‌కి సమీపంలో ఉండగా తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అతని బ్యాగ్‌ను దుండగులు చోరీ చేశారు. తాను అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, రైలు టికెట్ ఎగ్జామినర్ (టిటిఇ) నిర్లక్ష్యం కారణంగా ఇతరులు రిజర్వ్ చేసిన కోచ్‌లోకి ప్రవేశించగలిగారని ఫిర్యాదులో పేర్కొన్నాడు .దీని వలన అతని బ్యాగ్ నుండి 9.3 లక్షల రూపాయల విలువైన నగదు, విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.
ఘటన జరిగిన వెంటనే చతుర్వేది రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దిలీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్ భద్రతా ఉల్లంఘనలకు రైల్వే శాఖ బాధ్యత వహిస్తుందని తీర్పునిచ్చింది. దొంగతనానికి దారితీసిన అధికారుల నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ రూ.4.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రైల్వే చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం అధికారికంగా బుక్ టిక్కెట్ బుక్ చేసుకుని రైలు ఎక్కిన వినియోగదారుల లగేజీపై రైల్వే బాధ్యత వహించదని రైల్వే శాఖ వాదించింది.
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) ఈ వాదనను తోసిపుచ్చింది. రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడం రైల్వేల ప్రాథమిక బాధ్యత అని తీర్పు చెప్పింది. ఈ సందర్భంలో, రైల్వే అధికారులు, ప్రత్యేకించి రైలు టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) నిర్లక్ష్యం కారణంగా సర్వీస్‌లో లోపం స్పష్టంగా కనిపించిందని రిజర్వ్‌డ్ కోచ్‌లోకి అనధికార వ్యక్తులను అనుమతించడం వల్లే దొంగతనం జరిగిందని నిర్ధారించింది. ఈ విషయమై చతుర్వేది గతంలో దుర్గ్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా, పరిహారం చెల్లించాలని రైల్వే అధికారులను ఆదేశించింది. అయితే రైల్వే శాఖ ఈ తీర్పుపై ఛత్తీస్‌గఢ్ స్టేట్ కన్స్యూమర్ కమిషన్ అప్పీల్ చేయడంతో ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చుంది. దీంతో దిలీప్ కుమార్ ఎన్‌సీడీఆర్‌సీలో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయడంతో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి