Traffic Fines: బైక్‌పై ఆ రూట్‌లో వెళ్తున్నారా? పట్టుబడ్డారో అంతే సంగతులు.. రూ. 20 వేలు ఫైన్ కట్టాల్సిందే!
బైక్‌పై ఆ రూట్‌లో వెళ్తున్నారా? పట్టుబడ్డారో అంతే సంగతులు.. రూ. 20 వేలు ఫైన్ కట్టాల్సిందే! ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే..?
వాహనదారులకు.. మరీ ముఖ్యంగా టూ వీలర్, త్రీ వీలర్‌కు ఇది అలెర్ట్. మీరు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో స్కూటర్, బైక్ లేదా ఆటో నడుపుతూ వెళ్లాలనుకుంటున్నట్లయితే.. పొరపాటున కూడా అలా చేయకండి. అవును, మీరు వింటున్నది నిజమే. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో బైక్ లేదా స్కూటర్ లేదా ఆటో నడుపుతూ పట్టుబడితే, భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఆ హైవేపై టూ, త్రీ వీలర్స్ నిషేధం.. అవి నడుపుతూ పట్టుబడిన వారికి ట్రాఫిక్ పోలీసులు రూ. 20 వేల భారీ చలానాను విధిస్తున్నారు.
ఇప్పటికే ఈ నియమంపై అవగాహన కల్పించేందుకు పోలీసులు హైవేపై సైన్ బోర్డులను, అలాగే ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయినా కూడా ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదు. తమ పంధాలోనే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలు వెళ్లడం సాగిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు దిగారు. అందులో భాగంగానే గతేడాది ఆగష్టులో రూ. వెయ్యి ఫైన్‌కు బదులుగా.. ఆ హైవేపై నడుపుతూ పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, ఆటోలకు రూ. 20 వేలు జరిమానా విధించడం మొదలుపెట్టారు. విధిస్తూ వచ్చారు.
అధికారిక గణాంకాల ప్రకారం, 2022లో ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారు 12,081 కాగా, రెండు ఎక్స్‌ప్రెస్‌వేలపై నో పార్కింగ్ ప్లేస్‌లో వాహనాన్ని పెట్టి దొరికిన వారి సంఖ్య 17,495గా ఉంది. ఇక ఎక్స్‌ప్రెస్‌వేలలోకి నిషేధం ఉన్న వాహనాలతో దొరికినవారు 6,986 కాగా, అతివేగంగా నడిపిన వాహనాలకు.. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాల సంఖ్య 61,848. అలాగే గత ఏడాది ఎక్స్‌ప్రెస్‌వే మార్గాల్లో తిరిగిన 563 ఆటోలను కూడా పోలీసులు సీజ్ చేశారు. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2600 ద్విచక్ర వాహనాలకు చలానాలు పోలీసులు కట్ చేశారు.
కాగా, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాల అధిక వేగం కారణంగా ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ కారణంగానే ఎక్స్‌ప్రెస్‌వేలో వాటి ప్రవేశాన్ని నిషేధించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గత ఏడాది రెండు ఎక్స్‌ప్రెస్‌వేలపై మొత్తం 168 ప్రమాదాలు జరగగా, అందులో 106 మంది మరణించగా, 125 మంది గాయపడ్డారు. దీంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్‌వేలపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వచ్చిన ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు భారీ జరిమానాలు వేస్తున్నామని స్పష్టం చేశారు.