పెళ్లి చదివింపులు ఇష్టమొచ్చినంత చదివిస్తే కుదరదు! లెక్క ఎక్కువైతే మీకే డేంజర్..
పెళ్లిలో స్వీకరించే బహుమతులు, ఆభరణాలు, ఆస్తులపై ఆదాయపు పన్ను ఉండదు. అయితే, నగదు బహుమతులకు రూ. 2 లక్షల పరిమితి ఉంది. ఒకే వ్యక్తి నుండి ఒకే రోజు రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరించరాదు. ఈ నిబంధనను అతిక్రమిస్తే, స్వీకరించిన మొత్తానికి సమానమైన జరిమానా సెక్షన్ 269ST కింద విధించబడుతుంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వధూవరులకు బంధువులు, స్నేహితుల నుండి చాలా బహుమతులు అందుతాయి. అయితే పెళ్లికి వెళ్లిన వారు చదివింపుల్లో ఎంత వరకు చదివించవచ్చో తెలుసా? అలాగే వధూవరులు పెళ్లి బహుమతిగా ఎంత నగదు స్వీకరించవచ్చో తెలుసా? వీటిపై ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆదాయపు పన్ను ప్రకారం.. పెళ్లిలో వధూవరులు అందుకున్న ఏదైనా బహుమతి, అది నగదు, చెక్కు, ఆభరణాలు లేదా ఆస్తిపై ఎలాంటి పన్ను ఉండదు. వివాహ సందర్భంగా అందుకున్న బహుమతులు ఆదాయ వర్గంలోకి రావు, అందువల్ల వాటిపై ఎటువంటి పన్ను విధించబడదు. అయితే మీరు ఎంత మొత్తాన్ని అయినా నగదుగా స్వీకరించవచ్చని దీని అర్థం కాదు. నగదు బహుమతులపై ప్రత్యేక పరిమితి ఉంది.
రూ. 2 లక్షలకు మించొద్దు..!
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మీరు పెళ్లిలో నగదు బహుమతులు స్వీకరించవచ్చు కానీ ఒకే రోజులో ఒకే వ్యక్తి నుండి రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును స్వీకరించలేరు. బంధువు లేదా స్నేహితుడు మీకు రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు ఇస్తే, అది చట్ట ఉల్లంఘన అవుతుంది. మీరు ఈ పరిమితిని మించితే, మీకు భారీగా జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా మీరు నిబంధనలను ఉల్లంఘించి తీసుకున్న నగదు మొత్తానికి సమానం. ఉదాహరణకు ఎవరైనా మీకు రూ.3 లక్షల నగదు ఇస్తే, మీకు రూ.3 లక్షల జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా సెక్షన్ 269ST కింద విధించబడుతుంది. అందువల్ల, వివాహంలో నగదు స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
