కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే.. ఈ సీక్రెట్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే
సొంత కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్. కానీ సరైన ఆర్థిక అవగాహన లేకుండా తీసుకునే కార్ లోన్.. ఆ ఆనందాన్ని కాస్తా పెద్ద ఆర్థిక భారంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. చాలామంది కేవలం ఈఎంఐ తక్కువగా ఉందనే ఒకే ఒక్క విషయాన్ని చూసి మోసపోతుంటారు. కార్ లోన్ తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఆ తప్పుల గురించి తెలుసుకుందాం..

కార్లు కేవలం హోదాకే కాదు, నేటి ఆధునిక జీవనశైలిలో కుటుంబ అవసరాలకు కూడా అత్యంత ముఖ్యమైనదిగా మారిపోయింది. దీంతో సొంత కారు కల నెరవేర్చుకోవడానికి ఎక్కువమంది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్ తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాంకులు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు సులువైన వాయిదాలతో రుణాలు అందిస్తున్నాయి. అయితే కారు రుణం తీసుకునే సమయంలో సరైన అవగాహన లేకపోతే.. ఆ ఆనందం కాస్తా ఆర్థిక భ భారంగా మారే ప్రమాదం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. లోన్ తీసుకుని కారు కొనుగోలు చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ప్రధాన పొరపాట్లు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈఎంఐ తక్కువగా ఉందనే భ్రమలో పడకండి..
చాలామంది ప్రతి నెలా చెల్లించే వాయిదా తక్కువగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ అది పూర్తి నిజం కాదు. ఈఎంఐ తక్కువగా ఉందంటే, మీరు రుణం చెల్లించే కాలపరిమితి ఎక్కువగా ఉందని అర్థం. లోన్ గడువు పెరిగేకొద్దీ మీరు కట్టే వడ్డీ మొత్తం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి కేవలం నెలవారీ వాయిదాను మాత్రమే కాకుండా లోన్ కాలపరిమితిని, మొత్తం వడ్డీని కూడా లెక్కించుకోవడం ముఖ్యం.
మొదటి బ్యాంక్ ఆఫర్‌కే ఓకే చెప్పేయకండి..
కారు కొనుగోలు చేయాలనే తొందరలో డీలర్ చూపించిన మొదటి లోన్ ఆఫర్‌కో లేదా మీ కంటికి కనిపించిన మొదటి బ్యాంక్ లోన్ ఆఫర్‌కు సంతకం చేయడం పెద్ద పొరపాటు. కనీసం 3 నుంచి 4 బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ క్లోజర్ ఛార్జీలను పోల్చి చూడాలి. వేర్వేరు ఆఫర్లను పోల్చడం వల్ల తక్కువ వడ్డీకే లోన్ లభించి, మీకు వేల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.
డౌన్ పేమెంట్ తగ్గించకండి.. ఎక్కువ చెల్లించడమే మేలు..
కొందరు తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని లోన్‌గా మార్చుకోవచ్చని భావిస్తుంటారు. ఇది తాత్కాలికంగా సులువుగా అనిపించినా దీర్ఘకాలంలో నష్టమే. డౌన్ పేమెంట్ ఎంత తక్కువ ఉంటే, బ్యాంక్ నుండి తీసుకునే రుణ మొత్తం అంత పెరుగుతుంది. దీనివల్ల వడ్డీ భారం పెరగడమే కాకుండా కొన్నిసార్లు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి కారు కొనేటప్పుడే గరిష్టంగా ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లించడం వల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
నిపుణుల సలహా
కారు కొనుగోలు అనేది నిరంతరం విలువ తగ్గే ఆస్తి. కాబట్టి మీ ఆదాయం, నెలవారీ బడ్జెట్‌ను సరిగ్గా అంచనా వేసుకుని.. వీలైనంత తక్కువ కాలపరిమితి, తక్కువ వడ్డీ రేటుతో ఉండే కార్ లోన్‌ను ఎంచుకోవడమే మంచిది.
