AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Ticket Refund: క్యాన్సర్‌తో అమెరికా ప్రయాణం రద్దు.. టికెట్ల రీఫండ్‌పై ఖతార్ ఎయిర్‌వేస్, ఈజ్‌మైట్రిప్‌కు కమిషన్ బిగ్‌ షాక్!

Flight Ticket Refund: భవిష్యత్తులో ప్రయాణించేందుకు విమాన టికెట్లను ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించామని తెలిపింది. అయితే వైద్య పత్రాలు, ఈమెయిల్స్, ఎయిర్‌లైన్‌ రీఫండ్‌ విధానాన్ని కమిషన్‌ పరిశీలించింది. ప్రయాణానికి ముందు ప్రాణాంతక అనారోగ్యం ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రాలతో నిరూపిస్తే, వైద్య..

Flight Ticket Refund: క్యాన్సర్‌తో అమెరికా ప్రయాణం రద్దు.. టికెట్ల రీఫండ్‌పై ఖతార్ ఎయిర్‌వేస్, ఈజ్‌మైట్రిప్‌కు కమిషన్ బిగ్‌ షాక్!
Flight Ticket Refund
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Oct 14, 2026 | 9:04 PM

Share

Flight Ticket Refund: ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌ కారణంగా అమెరికా ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ఓ ప్రయాణికుడి కుటుంబానికి వినియోగదారుల కమిషన్‌ ఊరటనిచ్చింది. టికెట్ల రీఫండ్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న ఫిర్యాదుపై ఖతార్ ఎయిర్‌వేస్‌, ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ ఈజ్‌మైట్రిప్‌ సంయుక్తంగా రూ.3,06,168 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో టికెట్‌ రీఫండ్‌, మానసిక వేదనకు పరిహారం, న్యాయపరమైన ఖర్చులు ఉన్నాయి.

హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌-3 సెప్టెంబర్‌ 29, 2026న ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కమిషన్‌ ఆదేశాల ప్రకారం.. టికెట్‌ రీఫండ్‌గా రూ.1,86,168పై ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించాలి. మానసిక వేదన, అసౌకర్యానికి పరిహారంగా రూ.లక్ష, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.20 వేలు చెల్లించాలి. ఉత్తర్వులు అందిన 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని సంస్థలను కమిషన్‌ ఆదేశించింది.

యమర్తి రఘురామ్‌, ఆయన భార్య శాల్‌ రేఖ యమర్తి 2024 ఆగస్టు 2న హైదరాబాద్‌ నుంచి అమెరికాలోని అట్లాంటాకు వెళ్లేందుకు ఈజ్‌మైట్రిప్‌ ద్వారా రిటర్న్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్‌ 2న ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే నవంబర్‌ 1న రఘురామ్‌కు అకస్మాత్తుగా ఫిట్స్‌ వచ్చాయి. వైద్య పరీక్షల్లో ఆయనకు మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో అది ప్రాణాంతక క్యాన్సర్ కణితి అని నిర్ధారణ అయింది.

నవంబర్‌ 12న ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆరు వారాల పాటు రేడియేషన్‌ చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో అమెరికా ప్రయాణం చేయడం సాధ్యం కాకపోవడంతో టికెట్లను రద్దు చేసి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రఘురామ్‌ కోరారు.

తన వైద్య పరిస్థితిని వివరిస్తూ రఘురామ్‌ ఖతార్‌ ఎయిర్‌వేస్‌ను సంప్రదించారు. అయితే టికెట్లు ఈజ్‌మైట్రిప్‌ ద్వారా బుక్‌ చేసినందున ఆ సంస్థను సంప్రదించాలని ఎయిర్‌లైన్‌ సూచించింది. దీంతో ఆయన 2024 నవంబర్‌ 15న ఈజ్‌మైట్రిప్‌కు ఈమెయిల్‌ పంపారు. నవంబర్‌ 17న వైద్య పత్రాలను కూడా సమర్పించారు.

అయితే వైద్య కారణాలతో టికెట్‌ రీఫండ్‌కు చేసిన అభ్యర్థనను ఆలస్యంగా సమర్పించారనే కారణంతో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ తిరస్కరించినట్లు ఆయనకు సమాచారం అందింది. పలుమార్లు సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యపరమైన మినహాయింపు లేకుండా టికెట్లు రద్దు చేస్తే సుమారు రూ.95 వేలు తిరిగి చెల్లిస్తామని ఈజ్‌మైట్రిప్‌ తెలిపినట్లు ఆరోపించారు.

దీంతో రఘురామ్‌ న్యాయపరమైన నోటీసు పంపించి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అయితే కేసు విచారణలో ఉండగానే ఆయన మరణించారు. అనంతరం ఫిబ్రవరి 24న ఆయన పిల్లలు యమర్తి రేవంత్‌, యమర్తి రచనను న్యాయపరమైన వారసులుగా కేసును కొనసాగించేందుకు కమిషన్‌ అనుమతించింది. టికెట్లు తమ ద్వారా బుక్‌ చేయలేదని, రీఫండ్‌ ప్రక్రియను ఈజ్‌మైట్రిప్‌ నిర్వహించాల్సి ఉందని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వాదించింది.

భవిష్యత్తులో ప్రయాణించేందుకు టికెట్లను ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించామని తెలిపింది. అయితే వైద్య పత్రాలు, ఈమెయిల్స్, ఎయిర్‌లైన్‌ రీఫండ్‌ విధానాన్ని కమిషన్‌ పరిశీలించింది. ప్రయాణానికి ముందు ప్రాణాంతక అనారోగ్యం ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రాలతో నిరూపిస్తే, వైద్య కారణాలతో రీఫండ్‌ కోరేందుకు సంస్థ విధానంలో అవకాశం ఉందని గుర్తించింది. రఘురామ్‌ సమర్పించిన వైద్య పత్రాలు ఆయన అనారోగ్యం తీవ్రతను, ప్రయాణం చేయలేని పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. అలాగే ఈజ్‌మైట్రిప్‌ వైద్య పత్రాలను ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు పంపిన విషయాన్ని కూడా కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. రీఫండ్‌ అభ్యర్థనను సక్రమంగా పరిశీలించకుండా బాధ్యతను ఒకరిపై మరొకరు నెట్టివేయడాన్ని తప్పుబట్టింది.

వైద్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రీఫండ్‌ అభ్యర్థనను తగిన విధంగా పరిష్కరించడంలో రెండు సంస్థలు విఫలమయ్యాయని కమిషన్‌ అభిప్రాయపడింది. ఈ వ్యవహారం సేవల్లో లోపంగా పరిగణిస్తూ బాధిత కుటుంబానికి మొత్తం రూ.3,06,168 చెల్లించాలని ఆదేశించింది. ఉత్తర్వులు అందిన 45 రోజుల్లోగా చెల్లింపులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Follow Us