April 1st: అమ్మో ఏప్రిల్ 1.. సామాన్యులకు షాకింగ్ న్యూస్.. బాదుడే.. బాదుడు..
సామాన్యులకు ఏప్రిల్ 1 నుంచి ఓ రేంజ్ వడ్డన ఉండబోతుంది. ఏ పని చేయాలన్నా బ్యాండ్ పడుతుంది. గడ్డు రోజులు ఏప్రిల్ ఫస్ట్ నుంచి వెంటాడనున్నాయి.
April 2022 Rule Change: ఏప్రిల్ 1 విడుదల.. ఇది మామూలు విడుదల కాదు. రేట్లకు రెక్కలు తొడిగి విడుదల చేయనున్నారు. ఇది ఒక ప్రభుత్వమో.. లేకపోతే ఒక కంపెనీ గురించో కాదు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, లోకల్ మున్సిపాల్టీల వరకు… బడా పెట్రో కంపెనీల నుంచి కార్లలో వాడే చిన్న చిన్న ఐరన్ నట్ల వరకు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మనం వాడే నిత్యావసరాలు, అత్యావసరాలు, ఇంట్లో కరెంటు.. ఒంటికేసుకునే దుస్తులు, వాహనాలు, ఇలా ప్రతీ వస్తువుపై రేట్ల బాదుడు షురూ కానుంది. కాబట్టి మై డియర్ ఫెలో సిటిజన్స్… అన్నిటికీ సిద్ధం అవండి. దేశంలో ఇప్పటికే పెట్రోల్ రేట్లు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత పది రోజుల్లో 9 సార్లు పెట్రోవాత పెట్టాయి ఆయిల్ కంపెనీలు. ఇకపైనే ఆగుతాయన్న గ్యారెంటీ లేదు. ఏప్రిల్ 1న కూడా ఈ బాదుడు ఉండబోతోంది. ఇక గ్యాస్ విషయానికొస్తే.. సిలిండర్ ధరలను ప్రతి నెలా సవరిస్తుంటాయి పెట్రోలియం కంపెనీలు. ఈ లెక్కన ఏప్రిల్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయి. ఎన్నికల కారణంగా చాలా రోజులుగా ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు మార్చి 22న 50 రూపాయలు పెంచారు. ఏప్రిల్ 1న మళ్లీ పెంచే అవకాశాలున్నాయి.
మరో ముఖ్యమైన పెంపు విద్యుత్ చార్జీలు. తెలుగు రాష్ట్రాల ప్రజలపై ప్రభుత్వాలు విద్యుత్ భారం మోపుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి వాడే ప్రతీ యూనిట్‌పైనా భారం పడనుంది. ఇళ్లలో ప్రజలు వాడే కరెంటుకు ప్రస్తుత ఛార్జీలపై అదనంగా తెలంగాణలో అయితే 40 నుంచి 50 పైసలు.. ఏపీలో 45 పైసల నుంచి రూపాయి 57పైసల వరకు పెంచేశారు. దీంతో తెలంగాణలో వినియోగదారులపై అదనంగా 5596 కోట్ల రూపాయలు.. ఏపీలో 1400 కోట్ల రూపాయల భారం పడనుంది.
ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరగబోయే మరో సెగ్మెంట్ ఫార్మసీ. జ్వరం, ఇన్ఫెక్షన్లు, బీపీ, రక్త హీనత.. ఇలా అన్ని రోగాలకు వాడే మందుల ధరలు పెరగబోతున్నాయి. నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఇప్పటికే అనుమతులిచ్చింది. దాదాపు 800 రకాలైన మందుల ధరలు పెరగబోతున్నాయి. పారాసెటమాల్ నుంచి అజిత్రోమైసిన్, సిప్రోఫ్లాగ్జాసిన్, మెట్రానిడజోల్ గోళీల రేటు ఘాటెక్కనున్నాయి.
ఇక టోల్ బాదుడు కూడా ఏప్రిల్ 1 నుంచి ఉండబోతోంది. ఏపీలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫీజులు పెరగనున్నాయి. కార్లు, జీపులు వంటి వాహనాలపై 5-10 రూపాయలు, బస్సులు, లారీలకు 15-25 రూపాయలు పెరగబోతున్నాయి. భారీ వాహనాలకు 50 వరకు పెంచనున్నారు. ఇక కార్లు కొనాలన్నా ధరలు భారీగా పెరగనున్నాయి. బీఎండబ్ల్యూ, టయోటా, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి 8 కంపెనీలు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ముడి సరకు ధరలు పెరగడమే ఇందుకు కారణం.
ఇక వడ్డీరేట్లను పరిశీలిస్తే.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటు తగ్గనుంది. ఇప్పటికే ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 తగ్గించిన కేంద్రం.. వీటి వడ్డీ రేట్లలోనూ కోత విధించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. పీఎఫ్ ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి పన్ను భారం పడనుంది. ఉద్యోగి వాటా 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం జమ చేస్తే ఆ మొత్తానికి పన్ను పడనుంది. పోస్టాఫీసు పథకాలైన మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం ఇకపై నగదు రూపంలో ఇవ్వరు. ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లించనున్నారు.
ఏప్రిల్ 1 నుంచి క్రిప్టోపై పన్నును విధించనున్నట్లు ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. బిట్ కాయిన్, డోజ్, ఇథేరియమ్, ఇలా ఏ వర్చువల్ ఆస్తుల బదిలీపై అయినా 30 శాతం చొప్పున పన్ను విధించనున్నారు. సొంతింటి కొనుగోలులో సెక్షన్ 80EEA కింద 1.5 లక్షల రూపాయల మినహాయింపు ఇక సాధ్యం కాదు. ఏప్రిల్ 1 నుంచి ఈ మినహాయింపు వర్తించదు. 2022 బడ్జెట్‌లో ఈ మినహాయింపును కేంద్రం కొనసాగించలేదు.
మార్చి 31 దాటితే పాన్ ఆధార్ లింక్ చేయాలన్నా 500 నుంచి వెయ్యి వరకు ఫైన్ కట్టాల్సిందే. నిత్యావసరాలు, కూరగాయల రేట్లు ఇప్పటికే కొండెక్కి కూర్చున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అడుగు బయటపెడితే.. వందల్లో ఖర్చు వేలల్లో.. వేల రూపాయలయ్యేది లక్షల్లో ఖర్చుకానుంది.
Also Read: Hyderabad: సంచలనం.. హైదరాబాద్‌లో డ్రగ్స్ వల్ల తొలి మరణం.. మరో 8 మంది..
Hyderabad Metro: సూపర్ సేవర్ కార్డు.. రూ.59తో రోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు