AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking News: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం.. త్వరలో ప్రక్రియ మొదలుపెట్టే యోచనలో కేంద్రం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తరహాలో నాలుగైదు సమర్థవంతమైన భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే దేశంలో ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు..

Banking News: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం.. త్వరలో ప్రక్రియ మొదలుపెట్టే యోచనలో కేంద్రం
Banking News
Janardhan Veluru
|

Updated on: Jul 14, 2022 | 10:51 AM

Share

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల జోరును కేంద్ర ప్రభుత్వం కొనసాగించనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను మరో దఫా చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. గత మూడేళ్లలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం కావడం తెలిసిందే. మరిన్ని బ్యాంకుల విలీన ప్రక్రియను త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. ఈ కథనంలోని వివరాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తరహాలో నాలుగైదు సమర్థవంతమైన భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే దేశంలో ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మరిన్ని బ్యాంకులను విలీనం చేసే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు ఉన్నాయి. తదుపరి విలీన ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగంలో నాలుగైదు భారీ బ్యాంకులకు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సదరు సీనియర్ అధికారి తెలిపారు. విలీనం కానున్న బ్యాంకులు ఈ నెలాఖరుకల్లా ఫీడ్ బ్యాక్ సమర్పించాలని కోరినట్లు తెలిపారు. విలీనం విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌(IBA)తో విస్తృత సంప్రదింపులు జరపనున్నట్లు వెల్లడించారు. అలాగే ఇతర బ్యాంకర్ల అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా క్లారిటీ తీసుకుంటామని తెలిపారు.

2017నాటికి దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. దేశంలోని 10 జాతీయ బ్యాంకులను నాలుగు భారీ బ్యాంకుల్లో విలీనం చేయనున్నట్లు 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 12కు తీసుకురానున్నట్లు తెలిపింది. ఆ మేరకు 2020 ఏప్రిల్‌లో ఈ బ్యాంకుల విలీన ప్రక్రియను పూర్తి చేశారు.

2017లో భారతీయ మహిళ బ్యాంకు, మరో ఐదు అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేయగా.. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేశారు. 2020లో బ్యాంకుల విలీన ప్రక్రియను భారీ ఎత్తున చేపట్టారు. ఈ ఏడాదిలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామెర్స్‌లను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. అలాగే సిండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంకులో విలీనం చేశారు. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయగా.. అలహాబాద్ బ్యాంక్‌ను ఇండియన్ బ్యాంక్‌లో విలీనం చేశారు.

ఇవి కూడా చదవండి

విలీన ప్రక్రియ తర్వాత చాలా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గత రెండేళ్లుగా బాగా మెరుగుపడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకుల లాభాలు రెండింతలైనట్లు తెలిపారు. సానుకూల ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 4-5 బ్యాంకులకు కుదించే దిశగా విలీన పక్రియను కొనసాగిస్తామని తెలిపారు.

అటు పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..