ATM: ఏటీఎమ్ క్యాన్సిల్ బటన్ రెండుసార్లు నొక్కితే ఏం జరుగుతుంది.. ఆ ప్రచారం నిజమేనా..?
ఏటీఎం మోసాలను అరికట్టడానికి క్యాన్సిల్ బటన్‌ను రెండుసార్లు నొక్కాలనే ప్రచారం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీనిని పీఐబీ ఖండించింది. అలాంటి పుకార్లను నమ్మవద్దని, ఇది కేవలం లావాదేవీలను రద్దు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. నిజమైన ఏటీఎం మోసాల నుండి రక్షణకు అవసరమైన భద్రతా జాగ్రత్తలను పాటించడం ముఖ్యం.

ఏటీఎమ్‌ల ద్వారా బ్యాంకింగ్ సేవలు సౌకర్యవంతంగా మారినప్పటికీ ఏటీఎమ్ పిన్ నంబర్లను దొంగిలించడం.. స్కామింగ్ వంటి మోసాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా వృద్ధులు ఈ మోసాలకు ఎక్కువగా గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎమ్‌ల నుంచి డబ్బు తీసిన తర్వాత క్యాన్సిల్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే పిన్ నంబర్ సురక్షితంగా ఉంటుందనే ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది.
అదంతా ఫేక్..
ఈ వాదనపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్-చెకర్ స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ పోస్ట్‌ను పీఐబీ ఫ్యాక్ట్-చెకర్ ఖండించింది. ప్రభుత్వ సంస్థలు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి సలహాను ఎప్పుడూ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఏటీఎమ్ యంత్రాలపై ఉన్న క్యాన్సిల్ బటన్ కేవలం లావాదేవీలను క్యాన్సిల్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రెండుసార్లు నొక్కడం వల్ల హ్యాకింగ్ లేదా కార్డ్ స్కిమ్మింగ్ వంటి మోసాలు ఆగవని పీఐబీ తేల్చి చెప్పింది. అలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించింది.
ఏటీఎమ్ మోసాల నుండి రక్షణ..?
కార్డ్ స్కిమ్మింగ్, ఫిషింగ్ మరియు కీప్యాడ్ ట్యాంపరింగ్ వంటి మోసాల వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. మీ డబ్బును మరియు ATM పిన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి తీసుకోదగిన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి:
స్కిమ్మింగ్ పరికరాలపై నిఘా: ఏటీఎమ్‌లలో అనుమానాస్పద పరికరాలు కనిపిస్తే ఆ ఏటీఎమ్‌ని అస్సలు ఉపయోగించవద్దు. వెంటనే ఈ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయండి.
పిన్ భద్రత: పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ మీ చేతిని లేదా మరొక వస్తువును కీప్యాడ్‌పై అడ్డుగా ఉంచండి.
లావాదేవీ హెచ్చరికలు: ఏటీఎమ్ లావాదేవీల కోసం మీ ఫోన్ ఎస్ఎంఎస్, ఇమెయిల్ హెచ్చరికలను తప్పక పర్యవేక్షించండి. ఇది ఏవైనా అనధికార లావాదేవీల గురించి మిమ్మల్ని వెంటనే అప్రమత్తం చేస్తుంది.
కార్డు పోయినా – చోరీ అయినా: మీ కార్డు పోయినా లేదా చోరీ అయిన వెంటనే మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ ద్వారా దాన్ని బ్లాక్ చేయండి. ఇది దుర్వినియోగ అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు ఇటువంటి మోసాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




