Electric Scooter: ఓలా, టీవీఎస్‌లకు పోటీగా ఏథర్ కొత్త స్కూటర్.. ఏకంగా రూ. 30,000 తగ్గింపు ధరతో.. పూర్తి వివరాలు ఇవి..
మీరు ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో మంచి ఆప్షన్ ఉంది. ఏథర్ ఎనర్జీ కంపెనీ కొత్త ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని ధర పాత ధరకంటే రూ. 30,000 తక్కువే ఉంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

విద్యుత్ శ్రేణి వాహనాల తయారీ, విక్రయాల్లో పోటీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ల విషయంలో ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ ప్రత్యర్థుల కన్నా అధిక ఫీచర్లు లేదా, తక్కువ బడ్జెట్ లో వాహనాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కూడా ఓ కీలకమైన నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏథర్ 450ఎక్స్ మోడల్‌లో కొన్ని టెక్నికల్ మార్పులు చేసి అందుబాటు ధరలో మార్కెట్లో లాంచ్ చేసింది. ఏకంగా బైక్ పై రూ. 30వేలు ధరను తగ్గించడం విశేషం. అయితే ఫుల్ ఫీచర్లు కావాలంటే మాత్రం ప్రో ప్యాక్ పేరిట మరో మోడల్ అందుబాటులో ఉంచామని, దీని ధర రూ. 30 వేలు ఎక్కువని కంపనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఓలా, టీవీఎస్ లకు పోటీగా..
ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఓలా, టీవీఎస్‌లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏథర్ ఎనర్జీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాయి. ఫలితంగా ఏథర్ అమ్మకాలు తగ్గాయి. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ఏథర్ కంపెనీ.. ఏథర్ 450 ప్లస్ పేరిట ఉన్న వేరియంట్‌ను తొలగించింది. ఏథర్ 450 ఏక్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. దీని ధరను రూ.30 వేలు తగ్గించింది. అందు కోసం ఈ మోడల్‌లో రైడ్ మోడ్స్, టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సౌలభ్యాలను తీసివేసింది. వాటితో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, మ్యూజిక్, కాల్స్, మ్యాప్స్, మొబైల్ కనెక్టివిటీ వంటి వాటినీ మినహాయించింది.
పనితీరులో తగ్గేది లేదు..
ఈ ఫీచర్లు మినహాయిస్తే పవర్, పెర్ఫార్మెన్స్ విషయంలో రెండు స్కూటర్లు ఒకటేనని కంపెనీ పేర్కొంది. ఏథర్ 450ఎక్స్ ధర ఎక్స్ ఫోరూం రూ.1,14,636 గా ఉంది. అయితే, పైన పేర్కొన్న అన్ని ఫీచర్లతో ప్రో ప్యాక్ వేరియంట్ మాత్రం రూ.1.45 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో ఓలా 3kwh వేరియంట్ ధర రూ.1.14 లక్షలుగా ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ రేటు రూ.1.12 లక్షలుగా అందుబాటులో ఉంది.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




