Adani Group: అదానీ గ్రూప్ అవకతవకలతో స్టాక్‌మార్కెట్ ఢమాల్.. 2 రోజుల్లోనే పదిలక్షల కోట్ల నష్టం..
Stock Market: స్టాక్ మార్కెట్స్‌లో ప్రభంజనం సృష్టిస్తూ.. అదరగొడుతోన్న అదానీ గ్రూప్‌కి చుక్కెదురయ్యింది. గత కొంతకాలంగా స్టాక్‌మార్కెట్లో శరవేగంతో దూసుకెళ్ళిన అదానీ గ్రూప్ షేర్లు మొట్టమొదటిసారి ఢమాల్‌మన్నాయి.
Adani Group: మన స్టాక్‌మార్కెట్లలో గత ఎనిమిదేళ్లుగా వీరవిహారం చేస్తున్న అదానీ గ్రూపు షేర్లు- తొలిసారి ఢమాల్ మన్నాయి. అమెరికన్ సంస్థ హిండర్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లకు రెండు రోజుల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నిన్న అదానీ షేర్లకు లక్ష కోట్ల నష్టం వస్తే, ఇవాళ ఆ నష్టం మరింత తీవ్రమైంది. రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు అక్షరాలా పదిలక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన సంచలన నివేదికే- స్టాక్‌మార్కెట్ల నష్టాలకు కారణమయ్యింది. రెండేళ్ల పాటు అదానీ సంస్థ లావాదేవీలపై పరిశోథన చేసినట్టు ఆ సంస్థ తెలిపింది.
అదానీ గ్రూప్ షేర్ల పతనం ఈరోజు కూడా మార్కెట్ సూచీలపై తీవ్రమైన ప్రభావం చూపింది. అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ టోటల్ గ్యాస్ షేర్ 20 శాతం వరకు నష్టపోయింది. తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ 18.52 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 16.29 శాతం వరకు నష్టపోయాయి. అదానీ కొత్తగా కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్ 17.33 శాతం నష్టపోయింది.
అదానీ గ్రూప్‌లో రేగిన ప్రకంపనలు.. యావత్ షేర్ మార్కెట్ నీ ఓ కుదుపు కుదిపేసింది. అదానీ గ్రూప్‌లో 10 లిస్టెడ్ కంపెనీలు ఉంటే, అందులో మూడు కంపెనీల షేర్లు రికార్డుస్థాయి కనిష్టాలకు పడిపోయాయి. అదానీ బుల్స్ తిన్న దెబ్బలకు మార్కెట్లకు 12 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
అయితే తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు హిండెన్‌బర్గ్ సంస్థపై అమెరికాతో పాటు భారత్‌లో కూడా కేసులు వేస్తునట్టు అదానీ గ్రూప్ ప్రకటన చేసింది. దీంతో నిన్న, ఇవాళ కలిపి బాంబే స్టాక్ ఎక్స్చేంజీ మార్కెట్ క్యాప్ 280 లక్షల కోట్ల నుంచి 268 లక్షల కోట్లకు పడిపోయింది. బ్యాంకింగ్, LIC షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ 874 పాయింట్లు, నిప్టీ 287 పాయింట్లు కోల్పోయింది.
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మునిగాయి. కీలక సూచీలు రెండు శాతానికి పైగా పడిపోయి… ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీశాయి. రెండు రోజుల వరుస నష్టాలతో దాదాపు రూ.10.65 లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్టర్లు నష్టపోయారు. రాబోయే మరికొద్ది రోజుల్లో మార్కెట్ మరికొన్ని ప్రతికూల అంశాలున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.