New Zealand crisis: ఆపదలో అందమైన దేశం.. దిగజారిన ఆర్థిక వ్యవస్థ
న్యూజిలాండ్ అనగానే అందమైన నదులు, ఎత్తయిన కొండలు, అత్యద్బుతమైన ప్రకృతి రమణీయ ధృశ్యాలు గుర్తుకువస్తాయి. మన తెలుగు సినిమాలోని అనేక పాటలను అక్కడే చిత్రీకరిస్తారు. ఆ దేశంలో భారత సంతతికి చెందిన ప్రజలు కూడా ఎక్కువగా నివస్తున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టులోనూ వారిని మనం చూస్తూ ఉంటాం. ఈ అందమైన ద్వీపదేశం నేడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆర్థిక వ్యవస్థ అధికారికంగా మాంద్యంలోకి ప్రవేశించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ దేశ జీడీపీ ఒక శాతానికి తగ్గిపోయింది.

కివీ బ్యాంకు ఎకనామిక్స్ నివేదిక ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో జీడీపీ ఒక శాతానికి పడిపోయింది. రెండో త్రైమాసికంలోనూ 1.1 శాతం మాత్రమే నమోదైంది. దీంతో దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఆ దేశ ఆర్థిక కార్యకలాపాలు ఊహించిన దానికంటే బలహీన పడడం, న్యూజిలాండ్ డాలర్ రెండేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోవడం దీనికి ప్రధాన కారణం. ఆ దేశంలోని 16 భారీ పరిశ్రమలలో 11 పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. వాటిలో నిర్మాణ, వస్తు ఉత్పత్తి, సేవల రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. వీటిలోని వస్తు ఉత్పత్తి కంపెనీలు తమ రోజు వారీ ఉత్పత్తిని సగానికి తగ్గించేశాయి. దీంతో కార్మికులను పని లేకుండా పోయింది. నష్టాల కారణంగా ఉద్యోగులు, కార్మికులను ఆయా కంపెనీలు భారీ ఎత్తున తొలగిస్తున్నాయి. దేశ జీడీపీని ప్రభావితం చేసే భారీ పరిశ్రమలు నష్టాల బాట పట్టడంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది.
ఆర్థిక మాంద్యం కారణంగా న్యూజిలాండ్ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దీంతో పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించాయి. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించి కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నా, వాటిలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నా ఆశించిన విధంగా లాభాలు ఉండడం లేదు. ఒక్క వ్యవసాయ రంగాన్ని మినహాయించి మిగిలినవన్నీ సంక్షోభంలో ఉన్నాయి. న్యూజిలాండ్ దేశం జీడీపీ వరుసగా రెండో త్రైమాసికంలోనూ పతనమైంది. డాలర్ విలువ విపరీతంగా తగ్గిపోయింది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కలిగిస్తోంది. కోవిడ్ సమయంలో ఏర్పడిన ప్రతిష్టంభన తర్వాత ఇంతిలా సంక్షోభం ఏర్పడడం ఇదే మొదటి సారి. అంతకు ముందు 1991లో ఇలాంటి ఇబ్బందులనే న్యూజిలాండ్ ఎదుర్కొంది.
న్యూజిలాండ్ ప్రభుత్వ విధానాలను ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆర్థిక ప్రతినిది బార్బరా ఎడ్మండ్స్ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నికోలా విల్లీస్ పొదుపు చర్యల కారణంగా మాంద్యం తీవ్రమైందని ఆరోపించారు. న్యూజిలాండ్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ లో ఆర్థిక వేత్త అయిన క్రెయిగ్ రెన్నీ మాట్లాడుతూ మాంద్యం కారణంగా ఇబ్బందులు తీవ్ర తరమవుతాయన్నారు. ఆర్థిక వ్యవస్థ అనుకున్న దానికంటే అధ్వానంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలోని క్షీణత ఎక్కువకాలం కొనసాగితే ఆ దేశం మాంద్యంలోకి వెళ్లిపోతుంది. అంటే తీవ్రమైన ఆర్థిక మందగమనాన్నే మాంద్యం అనవచ్చు. దీని కారణంగా నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతాయి. అలాగే దేశానికి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రొజెక్ట్ (జీడీపీ) బాగా తగ్గిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








