EV Cars: ఈవీ కార్ల అమ్మకాల్లో మహీంద్రా రికార్డులు.. 70 రోజుల్లో 10 వేల కార్ల అమ్మకాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లతో పాటు ఈవీ కార్ల కొనుగోలుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతో టాప్ కంపెనీలు తమ ఈవీ కారు వెర్షన్లను రిలీజ్ చేస్తుంది. భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రిలీజ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ ఈవీ కార్లు అమ్మకాల్లో రికార్డులను సృష్టించాయి.

మహీంద్రా & మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఏ కంపెనీ సాధించని కొత్త మైలురాయిని సాధించింది. ఆ కంపెనీ మార్చి మధ్యలో ప్రారంభించిన ఈవీ డెలివరీలు కేవలం 70 రోజుల్లోనే 10,000 యూనిట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కారణంగానే ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయి. ఈ కంపెనీ ప్రస్తుతం రెండు మోడళ్లలో పూర్తిగా లోడ్ చేయబడిన ‘ప్యాక్ త్రీ’ వేరియంట్లను మాత్రమే అందిస్తోంది. ఈ కార్లు 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తాయి.
మహీంద్రా ప్రతి మోడల్‌కు సంబంధించిన వ్యక్తిగత అమ్మకాల గణాంకాలను వెల్లడించనప్పటికీ ప్రారంభ ట్రెండ్ స్పష్టంగా ఎక్స్ఈవీ 9ఈ మరింత ప్రజాదరణ పొందుతున్నట్లు చూపిస్తుంది. రెండు మోడళ్లపై కస్టమర్ ఆసక్తి ప్రారంభం నుంచి అధికంగా ఉంది. బుకింగ్స్ మొదటి రోజున మహీంద్రాకు కలిపి 30,179 ఆర్డర్లు వచ్చాయి. వాటిలో ఎక్స్ఈవీ 9ఈ 56 శాతం, బీఈ 6 మిగిలిన 44 శాతం బుక్లింగ్లను పొందాయి. బుకింగ్స్ మొత్తం విలువ రూ. 8,472 కోట్లుగా ఉంది. ఎక్స్ఈవీ 9ఈ ధర రూ.21.90 లక్షల నుంచి రూ.30.50 లక్షల మధ్య ఉంటుంది. బీఈ 6 ధర రూ.18.90 లక్షల నుంచి ప్రారంభమై రూ.26.90 లక్షల వరకు ఉంటుంది.
ఎక్స్ఈవీ 9ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 656 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అలాగే బీఈ 6 683 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ రెండు ఎస్‌యూవీలను 140 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఎక్స్ఈవీ 9ఈ 282 బీహెచ్‌పీ, 380 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. క్యాబిన్ లోపల మహీంద్రా ఎస్‌యూవీలను హైటెక్ సెటప్‌తో అమర్చారు. ఇందులో మూడు స్క్రీన్లు, 16 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఏఆర్-ఆధారిత హెడ్స్- అప్ డిస్‌ప్లే, డ్రైవర్, ప్రయాణీకులను పర్యవేక్షించడానికి కెమెరాలు వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి