AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: మధ్య తరగతి ప్రజల ఆవేదన ఈ బడ్జెట్‌లోనైనా తీరుస్తారా..?

నా పేరు కిషోర్. నేను వరంగల్ లో ఉంటున్నాను. నేను ఒక ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ లో టీచర్‌ను. ఇప్పుడు స్కూల్ ఇంటర్వెల్ టైమ్. స్టూడెంట్స్ అంతా బయట గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు..

Budget 2023: మధ్య తరగతి ప్రజల ఆవేదన ఈ బడ్జెట్‌లోనైనా తీరుస్తారా..?
Budget 2023
Subhash Goud
|

Updated on: Jan 31, 2023 | 3:06 PM

Share

నా పేరు కిషోర్. నేను వరంగల్ లో ఉంటున్నాను. నేను ఒక ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ లో టీచర్‌ను. ఇప్పుడు స్కూల్ ఇంటర్వెల్ టైమ్. స్టూడెంట్స్ అంతా బయట గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. నేను స్టాఫ్‌రూమ్‌లో న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఈ పేపర్ లో బ‌డ్జెట్‌ కోసం సూచ‌న‌లు అడిగార‌ని వార్తలు వ‌చ్చాయి.

అందుకనే నేను ఈ లేఖ ద్వారా నా ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నా దుస్థితి గురించి మీకు ఒక ఆలోచన ఇస్తుందని భావిస్తున్నాను. మేడమ్ నాకు టీ అంటే చాలా ఇష్టం. నేను 4 నుండి 5 కప్పులు తాగుతాను. ఇప్పుడు నేను వాటిని 2 కి పరిమితం చేసాను. నాకు వేరే మార్గం లేదు ఎందుకంటే మా స్కూల్ బయట టీ బడ్డీ నడిపే రాజు కప్పు టీ రేటు 15 రూపాయలు చేశాడు. పాలు, రేషన్, అన్నీ ఖరీదైపోవడంతో అతను కూడా తప్పనిసరై ధరలు పెంచాడు.

మేడమ్ దేశంలోని మధ్యతరగతి ప్రజలు అంతా మా అవసరాలు.. ఖర్చుల మధ్య నలిగిపోతున్నాము. ఈ రోజుల్లో అవసరాలకు చాలా ఖర్చవుతుంది కాబట్టి మాకున్న కోరికలను త్యాగం చేయవలసి వస్తుంది. నా తల్లిదండ్రులు తీర్థయాత్రకు వెళ్లాలనుకుంటున్నారు. నా భార్య, మాలతి వాషింగ్ మెషీన్ కొనమని నన్ను కోరుతోంది. ఈ చలికాలంలో చల్లటి నీటితో బట్టలు ఉతకడం చాలా కష్టం. నా జీతం ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు.

ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే, దానిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇదంతా మా పేరెంట్స్ కి, మాలతికి ఎలా వివరించాలో తెలియడం లేదు. గత 2 సంవత్సరాల నుంచి నేను వారి కోరికలు వాయిదా వేయించడం కోసం కరోనాను ఒక సాకుగా చూపించాను. అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే వారికి కూడా విషయం అర్ధం అయ్యే ఉంటుంది అనుకోండి.

మధ్యతరగతి వారు తమ ఇంట్లోనే కాదు ఎక్కడా తమ భావోద్వేగాలను వ్యక్తం చేయలేరు. వాళ్ళు చేయగలిగిందల్లా అన్నీ సహించడమే. ఎలాగూ మాలతి టైలర్ పని మొదలుపెట్టింది. ప్రభుత్వంపై ఆశలు పెట్టుకోవడం వృథా అని ఆమె అంటుంది. ఆమె తన టైలర్ పని నుండి వచ్చిన డబ్బును వాషింగ్ మెషీన్ కొనడానికి ఉపయోగిస్తుంది. కానీ, నా కుటుంబ అవసరాల గురించి నేను ఆందోళన చెందుతున్నాను. పైగా మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా.

ఈ ఏడాది నా కొడుకు అజయ్ 11వ తరగతి చదువుతున్నాడు. అతను సైన్స్ గ్రూప్ తీసుకున్నాడు. మేము అతని ట్యూషన్ కోసం ఫీజులు కట్టాలి. అతనికి ల్యాప్‌టాప్ కూడా అవసరం ఉంది. తారువాత ఇంజనీరింగ్ కోచింగ్‌కు ఫీజులు ఉన్నాయి. వీటన్నింటికీ డబ్బు ఆదా చేస్తున్నాను. మేడమ్ నేను బీటెక్ చేయలేకపోయాను. ఎలాగోలా ప్రైమరీ స్కూల్ టీచర్ ఉద్యోగం సంపాదించగలిగాను. నా కొడుకు చదువు కోసం చాలా కష్టపడ్డాను. అతను ఇంజనీర్ కావాలని కోరుకుంటున్నాను.

అవన్నీ అయిన తరువాత మిగిలిన డబ్బుతో స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నాను. స్కూల్ కు సాధారణంగా నేను బస్సులోనే వెళతాను. అప్పుడప్పుడు అంటే నెలాఖరు వస్తే నడుస్తూ కూడా వెళుతుంటాను. కానీ నా బిడ్డ భవిష్యత్తు కోసం స్కూటర్ వంటి నా అవసరాలు, కోర్కెలు అన్నిటినీ వాయిదా వేసుకున్నాను. ఇప్పట్లో అప్పు తీసుకున్నా ప్రయోజనం లేదు. అప్పు చేయాల్సి వస్తే అజయ్ చదువు కోసం తీసుకుంటాను. స్కూటర్ కోసం 90,000 అంటే చిన్న మొత్తం కాదు. మేడమ్ ఒకసారి మా అజయ్ సెట్ అయ్యాక, నేను మాలతి తో కలసి విమానంలో కూర్చుంటాను. నేను మా ఊరిలో గుడి, ఆసుపత్రి కట్టాలనుకుంటున్నాను. నాన్న ఉచితంగా మందులు పంపిణీ చేసేవారు. అందరూ ఆయనను ఎంతో గౌరవించేవారు. అందుకే ఆయన పేరు మీద ఆసుపత్రి కట్టాలని ఉంది. ఇలా చెబుతూ పోతే మా కోరికల జాబితా అంతులేనిది.

మేడమ్.. ఈసారి దయచేసి మధ్యతరగతి కోసం ఏదైనా చేయండి. మా అన్ని కోర్కెలు తీరాలని మేమేమీ కోరడం లేదు. మా ఖర్చులు అదుపులో ఉండేలా సహాయం చేయండి. అజయ్ తదుపరి చదువును అందుబాటులోకి తీసుకురావడానికి ఏదైనా చేయండి. అందుబాటు ధరలో మంచి కాలేజీలో చేరగలిగే అవకాశం కల్పించండి. కొంత స్కాలర్‌షిప్ లేదా ఆర్థిక సహాయం కూడా దానికి సహాయపడుతుంది. నా కొడుకు ప్రతిభ ఉన్నవాడు అనే విషయం మా కుటుంబానికి అంతటికీ తెలుసు. అతని లాంటి విద్యార్ధుల కోసం ఏదైనా సహాయం చేస్టారని ఎదురు చూస్తున్నాం. దయచేసి మమ్మల్ని నిరాశపరచవద్దు మేడం.

మీ భవదీయుడు

కిషోర్