Budget 2022 Speech Highlights: త్వరలో డిజిటల్ ​కరెన్సీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు నిర్మలమ్మ బూస్టర్..

|

Updated on: Feb 01, 2022 | 8:00 PM

Budget 2022 Speech Highlights in Telugu: 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు సమర్పించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం సాగింది. అనంతరం.. లోక్​సభను మంగళవారానికి స్పీకర్​ ఓం బిర్లా వాయిదా వేశారు.

Budget 2022 Speech Highlights: త్వరలో డిజిటల్ ​కరెన్సీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు నిర్మలమ్మ బూస్టర్..

Budget Session 2022 Parliament LIVE: 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు సమర్పించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం సాగించారు. అనంతరం.. లోక్​సభ(Lok Sabha)ను మంగళవారానికి స్పీకర్​ ఓం బిర్లా వాయిదా వేశారు. నిన్నటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. ఈ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే , కోవిడ్ మహమ్మారి మూడవ వేవ్ దృష్ట్యా, కోవిడ్ సంబంధిత సామాజిక దూరం నియమాలను పాటించేలా చూసేందుకు లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు రోజులో వేర్వేరు సమయాల్లో నిర్వహించారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టి బడ్జెట్ పద్దులోని హైలెట్స్ ఇవే..(Budget 2022 Speech Highlights..)

రాష్ట్రాలకు ఆర్థిక చేయూత అందించే ప్రయత్నం చేసింది కేంద్రం. లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. 2022- 2023 మొత్తం బడ్జెట్‌ 39 కోట్ల 45 లక్షలు. ద్రవ్యలోటు 6.9శాతం. 2025- 26నాటికి ద్రవ్యలోటుని 4.5శాతానికి తగ్గించడమే లక్ష్యమని తెలిపారు నిర్మలా సీతారామన్‌.

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌  నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో పలు మార్పులు చేశారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ NPS మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తు న్నట్లు చెప్పారు.

డిజిటల్ కరెన్సీ ఈ ఏడాది బడ్జెట్‌లో అందరి దృష్టిని ఆకర్శించిన అంశం డిజిటల్ కరెన్సీ. బ్లాక్‌ చెయిన్ సాంకేతికతో RBI ఈ డిజిటల్ కరెన్సీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బ్యాకింగ్‌ రంగం అభివృద్ధిలో దూసుకుపోతుందని భావిస్తున్నారు.

వేతన జీవులకు నిరాశే బడ్జెట్‌పై కోట ఆశలతో ఎదురుచూసిన వేతన జీవులకు నిరాశే మిగిలింది..ఈసారి ఎలాంటి మినహాయింపులు ప్రకటించలేదు…అయితే ఐటీ రిటర్న్‌లో మాత్రం చిన్న వెసులుబాటు కల్పించారు..అంటే ఐటీ రిటర్న్‌ సమర్పించిన 2 ఏళ్ల తర్వాత కూడా సవరణలు చేసుకోవచ్చు..

నాలుగు మెయిన్ ఫార్ములాలతో.. నాలుగు మెయిన్ ఫార్ములాలతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు నిర్మల. మొదటిది – ప్రధాని గతిశక్తి యోజన. రెండోది సమీకృత అభివృద్ధి. మూడో ఫార్ములా అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు. ఇక నాలుగో ఫార్ములా…పరిశ్రమలకు ఆర్థిక ఊతం. ఈ 4 మెయిన్‌ ఫార్మూలాస్‌ ఆధారంగా బడ్జెట్‌ను తయారు చేశారు..అలాగే బడ్జెట్‌లో ప్రధానంగా 7 రంగాలపై ఫోకస్ చేశారు.. అవి.. గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత.

నదుల అనుసంధానం  ఇక నదుల అనుసంధానం దిశగా కీలక ముందడుగు వేసింది కేంద్రం. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్.

ఈ బడ్జెట్‌ పునాది వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది అని చెప్పారు నిర్మలా సీతారామన్. కోవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించిందన్నారు.

రైతులకు మేలు  రైతులకు మేలు చేసేలా రైల్వేలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు నిర్మల. 400 వందే భారత్ రైళ్లు..100 గతిశక్తి టెర్మినల్స్‌ తీసుకురానున్నట్లు చెప్పారు..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Feb 2022 07:53 PM (IST)

    బడ్జెట్‌ 2022 కేటాయింపులు ఇలా…

    నేడు పార్లమెంట్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌.. మొత్తం 39 లక్షల 45 వేల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. గతేడాది 34.83 లక్షల కోట్లు మాత్రమే. ఆదాయ వనరులు- 22.84 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు 6.9 శాతం. బడ్జెట్‌లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల వ్యయానికి పెద్దపీట వేసినట్లు కనపడుతోంది.

    ప్రధాన రంగాలకు ఈ ఏడాది ఎంత కేటాయించారు, గతేడాది ఈ రంగాలకు ఎంత కేటాయించారో చూద్దాం..

    శాఖ/రంగం కేటాయింపు  (కోట్లలో.. ) కేటాయింపు  (కోట్లలో.. )
    2022-23 2021-22
    రక్షణ రంగం 5,25,166 4,78,196
    రైల్వేలు 1,40,367 1,10,055
    గ్రామీణభివృద్ది శాఖ 1,38,204 1,31,519
    వ్యవసాయం 1,32,514 1,31,531
    హోం శాఖ 1,85,777 1,66,547
    ఆరోగ్య కుటుంబ సంక్షేమ 86,606 73,931
    విద్య 1,04,278 93,224.31
    రోడ్డు, రవాణా 1,99,108 1,18,101
    హౌసింగ్‌, పట్టణాభివృధ్ది 76,549 54,581
    వాణిజ్యం, పరిశ్రమలు 53,116 34,623
    సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 30,571 14,793
    క్రీడలు 3,062 2,596
  • 01 Feb 2022 04:46 PM (IST)

    ఈ బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపూరితంః కే.కే

    Kk

    Kk

    మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపరిచిందని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కే. కేశవరావు అన్నారు. ద్రవ్యోల్బణం ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని ఎదుర్కొనే అంశం గురించి ప్రస్తావన లేదని కేశవరావు తెలిపారు. కోవిడ్-19 రికవరీ ఉంది సరే.. ఒక కొత్త వేరియంట్లలో భయం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య రంగానికి జరిపిన కేటాయింపులు ఏం సరిపోతాయని ప్రశ్నించారు. నిరుపేద, నిరుద్యోగ సమస్యలను ఎలా ఎదుర్కొంటారో చెప్పలేదన్నారు. వ్యవసాయానికి అతి స్వల్పంగా కేటాయింపులు పెంచారు తప్ప ఇంకేమీ లేదన్న ఆయన, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఎలాంటి కొత్త పథకాలు లేవని కేకే విమర్శించారు.

  • 01 Feb 2022 04:38 PM (IST)

    పారిశ్రామికవేత్తల జేబులు నింపేలా ఉందిః రాజస్థాన్ సీఎం

    బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి అనేక ర‌కాల రియాక్ష‌న్లు వ‌స్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్ర బడ్జెట్‌ను ద్రవ్యోల్బణంగా అభివర్ణించారు. ఇది పారిశ్రామికవేత్తల జేబులు నింపుతుందన్నారు. సామాన్యులు, రైతులు మరియు కార్మికుల జేబులను ఖాళీ చేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

  • 01 Feb 2022 04:13 PM (IST)

    దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం అభినందనీయంః బీహార్ సీఎం

    సాధారణ బడ్జెట్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సానుకూలంగా ఉందని, స్వాగతిస్తున్నామని చెప్పారు. సీఎం నితీష్ కుమార్ ట్వీట్ చేసి బడ్జెట్ అభినందనీయమని అభివర్ణించారు. గత రెండేళ్లుగా, కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థికాభివృద్ధి ప్రభావితమైంది. ఈ అసహజ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ద్వారా దేశాభివృద్ధి వేగాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవడం కూడా స్వాగతించదగ్గదే. గంగానది రెండు ఒడ్డున ఉన్న 13 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులతో ఆర్గానిక్ కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం అభినందనీయమని నితీష్ కుమార్ పేర్కొన్నారు.

  • 01 Feb 2022 03:24 PM (IST)

    బడ్జెట్ 2022 ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలుః మోడీ

    Modi

    Modi

    PM Modi on Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. 100 ఏళ్ల తీవ్ర విపత్తు మధ్య ఈ బడ్జెట్ అభివృద్ధిపై కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాల కొత్త అవకాశాలతో ఈ బడ్జెట్ నిండుగా ఉందన్నారు. ఇది గ్రీన్ ఉద్యోగాల రంగం కూడా తెరవడం జరుగుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలకు పర్వతమాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రణాళిక పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థను సృష్టిస్తుంది.

  • 01 Feb 2022 02:57 PM (IST)

    ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ఉందిః రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

    సామాన్యులకు ఇది చాలా మంచి బడ్జెట్ అని బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. మౌలిక సదుపాయాలు 35% పెరిగాయి, ఇది ఆర్థిక వ్యవస్థను స్వయంచాలకంగా వేగవంతం చేస్తుంది. దేశంలోని డబ్బును ఇక్కడే వెచ్చిస్తూ.. మన దేశంలోని తయారీ రంగాన్ని వేగవంతం చేసే బూస్టర్ షాట్ ఇది అని అభిప్రాయపడ్డారు.

  • 01 Feb 2022 02:52 PM (IST)

    సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనంః కిరణ్ రిజిజు

    ఈసారి బడ్జెట్ గురించి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఇది చాలా మంచి బడ్జెట్ అని అన్నారు. పేదలు, గ్రామీణ, సరిహద్దు ప్రాంతాలు.. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో నివసించే ప్రజలతో సహా సమాజంలోని ప్రతి వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే చాలా కలుపుకొని ఉన్న బడ్జెట్ ఇది అని కిరన్ రిజిజు కొనియాడారు.

  • 01 Feb 2022 02:49 PM (IST)

    రక్షణరంగంలో కొత్త ప్రతిపాదనలు అద్భుతంః రాజ్‌నాథ్ సింగ్

    రక్షణ సహా పలు రంగాల్లో పరిశోధన, అభివృద్ధికి తగిన మొత్తం కేటాయించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. స్టార్టప్‌లు, ప్రైవేట్ సంస్థల కోసం R&D బడ్జెట్‌లో 25 శాతం రిజర్వ్ చేయాలనే ప్రతిపాదన అద్భుతమైన చర్య అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

  • 01 Feb 2022 02:47 PM (IST)

    ఈ బడ్జెట్ భవితరం భారతదేశానికి పునాది వేస్తుందిః అమిత్ షా

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం పార్లమెంటులో సమర్పించిన 2022-23 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను "దార్శనికత"గా అభివర్ణించారు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను "స్కేల్ ఛేంజర్"గా రుజువు చేస్తుందని పేర్కొన్నారు. బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందిస్తూ, ఈ బడ్జెట్ భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా' మారుస్తుందని, అలాగే స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాల కొత్త భారతదేశానికి పునాది వేస్తుందని షా అన్నారు.

  • 01 Feb 2022 02:42 PM (IST)

    దశ దిశా నిర్దేశం లేని, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ః కేసీఆర్

    కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్.. దశ దిశా నిర్దేశం లేని., పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడి వున్నదని అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్‌ను సీఎం అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సీఎం అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని కేసీఆర్ స్పష్టం చేశారు.

  • 01 Feb 2022 02:22 PM (IST)

    అప్పటి వరకు ఆగాలా.. శశిథరూర్ సెటైర్లు..

    కేంద్ర బడ్జెట్‌ నిరాశ పరిచిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. బడ్జెట్‌లో MGNREGA గురించి, రక్షణ, నిత్యవసరాల ధరల సమస్యలను ప్రస్తావించలేదని శశిథరూర్‌ అన్నారు. మోదీ అఛ్చేదిన్‌ కోసం.. మరో 25 సంవత్సరాలు వేచిచూడాలా.. అంటూ సెటైర్‌ వేశారు ఎంపీ శశిథరూర్.

  • 01 Feb 2022 02:15 PM (IST)

    కామన్ మ్యాన్ కు ప్రోత్సాహకం ఇవ్వడంలో విఫలం

    ఇప్పటి వరకు కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు CII ప్రెసిడెంట్ కె. భాస్కర్ రెడ్డి. కామన్ మ్యాన్ కు 8C కింద 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు ప్రోత్సాహకం ఇస్తారని ఊహించాం.. కాని నిర్మలమ్మ బడ్జెట్ డిజ్పాయింట్ కలిగించిందన్నారు. కామన్ మ్యాన్ పోస్ట్ కోవిడ్ ను అడ్రస్ చేయడంలో విఫలమయ్యారని చెప్పారు CII ప్రెసిడెంట్ కె. భాస్కర్ రెడ్డి.

  • 01 Feb 2022 02:14 PM (IST)

    మౌళిక, రవాణా రంగాలపై ఎక్కువ శ్రద్ద..

    ట్యాక్స్‌ విధానంలో పెద్దగా మార్పులు లేవు. కానీ మౌళిక, రవాణా రంగాలపై ఎక్కువ శ్రద్ద పెట్టింది కేంద్రం. పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్‌లో అభివృద్ధికి ఈ బడ్జెట్‌ ఎంతో దోహదపడుతుంది. కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా సిమెంట్, అనుబంధం రంగాలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్వా ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతానికి తగ్గించారు. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి.. రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

  • 01 Feb 2022 02:13 PM (IST)

    MNREGA బడ్జెట్‌లో పెరుగుదల లేదు: సీపీఐ(ఎం)

    కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి కల్పన, పట్టణ ఉపాధి హామీ ప్రస్తావన లేదని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బడ్జెట్‌లో ఎలాంటి పెంపుదల లేదని, జీవనోపాధిపై దాడి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (CPI-M) మంగళవారం ఆరోపించింది. యువత. CPI(M) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేస్తూ.. ‘‘బడ్జెట్ ఎవరి కోసం? దేశంలోని మొత్తం సంపదలో 75 శాతం ధనవంతులైన 10 శాతం మంది భారతీయులు ఉన్నారు. అట్టడుగున ఉన్న 60 శాతం మందికి ఐదు శాతం మాత్రమే ఆస్తి ఉంది. మహమ్మారి సమయంలో అత్యధిక లాభాలు ఆర్జించే వారిపై ఎందుకు ఎక్కువ పన్ను విధించలేదు?

  • 01 Feb 2022 02:10 PM (IST)

    ఇది డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించడం: ప్రకాష్ జవదేకర్

    2022 బడ్జెట్‌లో దేశ ప్రగతికి.. వనరుల అభివృద్ధికి, హరిత ఆర్థిక వ్యవస్థకు, డిజిటల్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చామని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. విద్య కోసం 100 ఛానల్స్‌ ఏర్పాటుతో డిజిటల్‌ విద్యను మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్తామని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. దీనితో పాటు, ఇది డిజిటల్ విభజనను కూడా తొలగిస్తుంది, దీని కారణంగా అందరికీ మంచి విద్య అందుబాటులో ఉంటుంది.

  • 01 Feb 2022 02:07 PM (IST)

    జీవితంలో ఆనందం నింపేందుకు కృషి : సీఎం శివరాజ్

    బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ . ఇది సామాన్యుల బడ్జెట్ అని, ఇందులో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి కృషి చేశామని అన్నారు. క్షేత్రస్థాయిలో నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ఈ బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశారు. ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయం సాంకేతికతతో ముడిపడి ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు ఎలా పొందాలనే దానికి మార్గం సుగమమైంది.

  • 01 Feb 2022 02:05 PM (IST)

    నిర్మలమ్మ పద్దులో ఏ శాఖకు ఎన్ని..

    రక్షణశాఖ - రూ. 3,85,370 కోట్లు రవాణా శాఖ - రూ. 3,51,851 కోట్లు గ్రామీణాభివృద్ధి - రూ. 2,06,293 కోట్లు విద్యా శాఖ - రూ. 1,04,278 కోట్లు హోంశాఖ - రూ. 1,27,020 కోట్లు జీఎస్టీ పరిహారం నిధి - రూ. 1,20,000 కోట్లు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా - రూ. 3,34,339 కోట్లు పట్టణాభివృద్ధి శాఖ - రూ. 76,549 కోట్లు విద్యుత్తు శాఖ - రూ. 49,220 కోట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ - రూ. 53,116 కోట్లు వ్యవసాయ శాఖ - రూ. 1,51,521 కోట్లు సామాజిక న్యాయ శాఖ - రూ. 51,780 కోట్లు

  • 01 Feb 2022 01:52 PM (IST)

    తెలుగు రాష్ట్రాల్లోని వర్శిటీలపై వరాల జల్లు..

    తెలుగు రాష్ట్రాల్లోని వర్శిటీలపై వరాల జల్లు కురిపించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ 40 కోట్ల కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ కి రూ. 50 కోట్ల కేటాయింపులు చేశారు.

  • 01 Feb 2022 01:50 PM (IST)

    మార్కెట్‌లో నిరాశ వాతావరణం

    బడ్జెట్ 2022 తర్వాత మార్కెట్‌లో నిరాశ వాతావరణం నెలకొంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్‌ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. నిఫ్టీ ఎగువ స్థాయి నుంచి 190 పాయింట్లు పడిపోయింది, సెన్సెక్స్ అస్థిరంగా ఉంది.

  • 01 Feb 2022 01:49 PM (IST)

    ఇ-వాహనాలను ప్రోత్సహించేలా బడ్జెట్: గడ్కరీ

    బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కాలుష్య నివారణ కోసం నగరాల్లో ఈ-వాహనాలను ప్రోత్సహించే యోచనతో పాటు ఈ ఏడాది 25,000 కి.మీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆర్థిక మంత్రి ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు కాలుష్యాన్ని దూరం చేసే నగరాల్లో బ్యాటరీ స్వాప్ విధానంపై దృష్టి పెట్టడం గొప్ప విషయం అని అన్నారు.

  • 01 Feb 2022 01:48 PM (IST)

    కలపని ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకం

    కలపని ఇంధనంపై లీటరుకు రూ. 2 అదనపు ఎక్సైజ్ సుంకం ప్రభావం ఎలా ఉంటుంది

    1. బ్లెండెడ్ ఇంధన విక్రయాలు పెరగడం

    2. ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహించాలి

    3. ఇథనాల్ విక్రయాలు పెరుగుతాయని చైనా కంపెనీలు భావిస్తున్నాయి

  • 01 Feb 2022 01:47 PM (IST)

    రైతులకు మేలు చేసేలా బడ్జెట్: గడ్కరీ

    రసాయన రహిత సహజ సేద్యాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తామని, అలాగే రైతులకు మేలు చేసే డిజిటల్, హైటెక్ టెక్నాలజీని రైతులకు అందజేసే పథకాలను పీపీపీ విధానంలోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

  • 01 Feb 2022 01:45 PM (IST)

    పెగాసస్ స్పిన్ బడ్జెట్: మమతా బెనర్జీ

    బడ్జెట్‌పై నిరాశ వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు బడ్జెట్ సున్నా అని అన్నారు. పెగాసస్ స్పిన్ బడ్జెట్ కాదు.. పెద్ద పదాలలో ప్రభుత్వం మాయ చేసిందన్నారు.

  • 01 Feb 2022 01:43 PM (IST)

    కరోనా కాలంలో కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ: అమిత్ షా

    బడ్జెట్ పరిమాణాన్ని 39.45 లక్షల కోట్లకు పెంచడం కరోనా కాలంలో కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను చూపుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ అన్నారు. ద్రవ్య లోటు లక్ష్యాన్ని 6.9% నుండి 6.4%కి తగ్గించడం ఒక పెద్ద విజయం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ద్రవ్య లోటును 4% కంటే తక్కువకు తీసుకురాగలదని నేను విశ్వసిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు అమిత్ షా.

  • 01 Feb 2022 01:41 PM (IST)

    ఇది దార్శనిక బడ్జెట్: అమిత్ షా

    బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బడ్జెట్ దూరదృష్టితో కూడిన బడ్జెట్ అని.. ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్థాయిని మార్చే బడ్జెట్ అని రుజువు చేస్తుందని అన్నారు. ఈ బడ్జెట్ భారతదేశాన్ని స్వావలంబనతో పాటుగా, స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న కొత్త భారతదేశానికి పునాది వేస్తుందని.. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్‌లను అభినందిస్తున్నాను.

  • 01 Feb 2022 01:36 PM (IST)

    గతేడాది కంటే రెండున్నర లక్షల రూపాయలు ఎక్కువ..

    బడ్జెట్ పరిమాణాన్ని 4.5 నుంచి 39.45 లక్షల కోట్లకు పెంచారు.

    1. ప్రభుత్వం గతేడాది కంటే రెండున్నర లక్షల రూపాయలు ఎక్కువగా ఖర్చు చేస్తుంది

    2. వినియోగం పెరగడం వల్ల మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి

    3. ప్రజల ఆదాయం పెరుగుతుంది

  • 01 Feb 2022 01:19 PM (IST)

    పెద్దగా ప్రజాకర్షక ప్రకటన లేదు

    బడ్జెట్‌లో పెద్దగా ప్రజాకర్షక ప్రకటనలు ఇలా.. అలా..

    1. పన్ను రేట్లలో మార్పు లేదు

    2. రైతులకు, మహిళలకు పెద్దగా ప్రకటన లేదు

    3. ఇన్‌ఫ్రాపై ఎక్కువ ప్రాధాన్యత

    4. వృద్ధిపై దృష్టి పెట్టండి

    5. ద్రవ్యోల్బణంపై చర్చ లేదు

  • 01 Feb 2022 01:06 PM (IST)

    మోదీ ప్రభుత్వ దురదృష్టకర విధానం హానికరం: కాంగ్రెస్

    బడ్జెట్‌పై నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన కాంగ్రెస్..  మోడీ ప్రభుత్వ దుశ్చర్యలు దేశంపై అప్పులను పెంచడానికి మాత్రమే పనిచేశాయని విమర్శించింది. మోడీ నోమిక్స్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మండిపడింది. మోడీ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలు దేశానికి హానికరమంటూ నిప్పులు చెరిగింది.

  • 01 Feb 2022 12:51 PM (IST)

    వ్యవసాయ సంబంధిత వస్తువులు శక్తివంతం: ఆర్థిక మంత్రి

    ఎలక్ట్రానిక్స్‌పై పన్ను మినహాయింపు ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కాగా రత్నాలు మరియు ఆభరణాలపై కస్టమ్ డ్యూటీని 5 శాతానికి తగ్గించారు. నకిలీ ఆభరణాలపై కిలోకు రూ.400 కస్టమ్ డ్యూటీ ఉంటుంది. స్టీల్ స్క్రాప్‌పై కస్టమ్ డ్యూటీని మరో ఏడాది పాటు పెంచుతున్నారు. వ్యవసాయానికి సంబంధించిన సరుకులకు కూడా కరెంటు ఇస్తున్నారు.

  • 01 Feb 2022 12:50 PM (IST)

    దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు..

    దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు సరికొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకాన్ని(NGDRS) ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

  • 01 Feb 2022 12:49 PM (IST)

    లోక్​సభ వాయిదా..

    2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు సమర్పించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం సాగింది. అనంతరం.. లోక్​సభను మంగళవారానికి స్పీకర్​ ఓం బిర్లా వాయిదా వేశారు.

  • 01 Feb 2022 12:40 PM (IST)

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు NPS డిడక్షన్​..

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ డిడక్షన్‌ కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 10 నుంచి 14 శాతానికి పెంపు ఉంటుందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి.

  • 01 Feb 2022 12:40 PM (IST)

    వేతన జీవులకు నిరాశ..

    ప్రస్తుత బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశ మిగిలింది. ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులేదు. ఇన్‌కంటాక్స్‌ స్లాబ్‌లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

  • 01 Feb 2022 12:38 PM (IST)

    రిటర్న్​ల దాఖలులో నవీకరణ..

    ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలులో నవీకరణ చేయనున్నారు. ఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చు. సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్‌ పన్నుప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు ఉంటుంది.

  • 01 Feb 2022 12:35 PM (IST)

    ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఉపశమనం లేదు

    సాధారణ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి సడలింపు ఇవ్వలేదు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి మార్పు చేయలేదని ఆర్థిక మంత్రి తెలిపారు. వర్చువల్ కరెన్సీ ద్వారా వచ్చే ఆదాయాలపై 30% పన్ను విధించబడుతుంది.

  • 01 Feb 2022 12:26 PM (IST)

    2022లో 5G స్పెక్ట్రమ్ వేలం: ఆర్థిక మంత్రి

    ప్రైవేట్ రంగం ద్వారా 5G మొబైల్ సేవలను ప్రారంభించడానికి 2022లో స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. PLI పథకం కింద, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సరసమైన ధరలకు బ్రాడ్‌బ్యాండ్,  మొబైల్ కమ్యూనికేషన్‌ను నిర్ధారించడానికి 5G పర్యావరణ వ్యవస్థను ప్రారంభించేందుకు డిజైన్ ఆధారిత తయారీ పథకం కూడా ప్రారంభించబడుతుంది.

  • 01 Feb 2022 12:22 PM (IST)

    డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం: ఆర్థిక మంత్రి

    బ్లాక్‌చెయిన్ ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ కరెన్సీని జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీన్ని 202-23 నుంచి ఆర్‌బీఐ జారీ చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుంది. 2022-23లో ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకువస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుంది?

    1. రిజర్వ్ బ్యాంక్ యొక్క డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి

    2. డిజిటల్ లావాదేవీలలో కీలకం

    3. క్రిప్టో గురించి చిత్రం స్పష్టంగా లేదు

    4. డిజిటల్ బ్యాంకింగ్‌లో ఆశించిన ప్రయోజనాలు

  • 01 Feb 2022 12:13 PM (IST)

    కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక: ఆర్ధిక మంత్రి

    పట్టణ ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం జరుగుతుందన్నారు. అదే విధంగా, సరుకు రవాణా కోసం మరిన్ని కేటాయింపులు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంచుతామని పేర్కొన్నారు. భూరికార్డులను డిజిటలైజేషన్‌ చేస్తామని నిర్మలా సీతారామన్​ వెల్లడించారు.

  • 01 Feb 2022 12:11 PM (IST)

    మూలధన పెట్టుబడుల పెరుగుదల ప్రభావం ఇలా..

    మూలధన పెట్టుబడుల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?

    1. ప్రభుత్వం 7.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది

    2: కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశించారు

    3: డిమాండ్‌ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు

    4: వృద్ధి పెరుగుతుంది

  • 01 Feb 2022 12:10 PM (IST)

    మూడేళ్లలో కొత్తగా 400 వందేభారత్ రైళ్ల ప్రభావం ఎలా ఉంటుంది

    మూడేళ్లలో కొత్తగా 400 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తామన్న ప్రకటన ప్రభావం ఎలా ఉంటుంది.

    1. బహుళ నగరాలకు సులభంగా యాక్సెస్

    2. రైల్వేలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరుగుతాయి

    3. రైల్వే రంగంలో ఉపాధి పెరుగుతుంది

  • 01 Feb 2022 12:10 PM (IST)

    రక్షణ రంగంలో స్వావలంబన భారత్

    రక్షణ రంగంలో స్వావలంబన భారత్ పథకాన్ని ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మొత్తం రక్షణ సేకరణ బడ్జెట్‌లో, 68% దేశీయ మార్కెట్ నుండి కొనుగోలు చేయడానికి ఖర్చు చేయబడుతుంది. ఇది రక్షణ పరికరాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 58 శాతం ఎక్కువ.

  • 01 Feb 2022 12:07 PM (IST)

    68 శాతం రక్షణ పరికరాలు దేశంలోనే తయారి.. వాటి ప్రభావం ఇలా..

    #1: దేశీయ రక్షణ సంస్థలు ప్రయోజనం పొందుతాయి

    #2: దిగుమతి బిల్లులో భారీ తగ్గింపు ఉంటుంది

    #3: దేశీయ మార్కెట్‌లో ఉపాధి పెరుగుతుంది

  • 01 Feb 2022 12:04 PM (IST)

    ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకం వచ్చే ఏడాది వరకు.. : ఆర్థిక మంత్రి

    ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ని మార్చి 2023 వరకు పొడిగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్యారెంటీ కవర్‌ను రూ.50,000 కోట్ల నుంచి మొత్తం రూ.5 లక్షల కోట్లకు పెంచనున్నారు.

  • 01 Feb 2022 12:03 PM (IST)

    డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ కోసం ఓపెన్ ప్లాట్‌ఫారమ్ - ఆర్ధిక మంత్రి

    నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ కోసం ఓపెన్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని ద్వారా, ఆరోగ్య ప్రదాతలకు డిజిటల్ రిజిస్ట్రీలు, ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపులు మరియు ఆరోగ్య సౌకర్యాలకు సార్వత్రిక ప్రాప్యత సాధించబడుతుంది.

  • 01 Feb 2022 12:01 PM (IST)

    ఈ-పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తాం- ఆర్థిక మంత్రి

    పౌరుల సౌకర్యాన్ని పెంచేందుకు 2022-23లో ఈ-పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • 01 Feb 2022 11:59 AM (IST)

    1486 పనికిరాని చట్టాలు ముగుస్తాయి: ఆర్థిక మంత్రి

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాల్గవ బడ్జెట్ ప్రసంగంలో, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 1486 పనికిరాని చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు.

  • 01 Feb 2022 11:59 AM (IST)

    1.5 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ: ఆర్థిక మంత్రి

    2022లో 1.5 లక్షల పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ 100 శాతం ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వైబ్రంట్ విలేజెస్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించనుంది. ప్రభుత్వం కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలనకు కట్టుబడి ఉంది.

  • 01 Feb 2022 11:58 AM (IST)

    75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ ప్రారంభిస్తాం: ఆర్థిక మంత్రి

    ఇటీవలి కాలంలో డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ పెరిగిపోయిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తూ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించనున్నాం. ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి మరియు సామాన్య ప్రజలు దీని నుండి ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.

  • 01 Feb 2022 11:57 AM (IST)

    ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల కొత్త ఇళ్లు: ఆర్థిక మంత్రి

    2022-23లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల కొత్త ఇళ్లను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వాటి కోసం రూ.48 వేల కోట్ల నిధిని ఉంచారు.

  • 01 Feb 2022 11:55 AM (IST)

    నాణ్యమైన విద్య కోసం 'వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్'..

    నాణ్యమైన విద్య కోసం 'వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 1 నుండి 12 తరగతులకు, రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలలో విద్యను అందిస్తాయి.

  • 01 Feb 2022 11:51 AM (IST)

    డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు..

    ప్రణాళికనగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధిపట్టణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్‌ ఉంటుందన్నారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్‌ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు.

  • 01 Feb 2022 11:40 AM (IST)

    వందే భారత్‌ రైలు విజయవంతం

    వందే భారత్‌ రైలు విజయవంతమైందని నిర్మల సభలో ప్రకటించారు. భారత్‌కు వందేళ్ల అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు వెల్లడిచారు. వచ్చే మూడేళ్లలో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య సౌకర్యాల అభివృద్ధి, వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వందేళ్ల భారతానికి ప్రధాని మోడీ ఒక మిషన్‌ రూపొందించారని..దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు నిర్మలమ్మ

  • 01 Feb 2022 11:36 AM (IST)

    పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు..

    ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముందంజలో ఉన్నామని నిర్మల వెల్లడించారు. ఎయిరిండియా బదిలీని పూర్తి చేసినట్లుగా సభకు తెలిపారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామని ప్రకటించారు. ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉ‍ద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

  • 01 Feb 2022 11:34 AM (IST)

    నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు..

    ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌ను తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ పథకం ఉంటుందన్నారు. క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

  • 01 Feb 2022 11:28 AM (IST)

    MSMEలకు ప్రోత్సాహం..

    Udyam, e-shram, NCS & Aseem పోర్టల్స్ వంటి MSMEలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. వాటి పరిధిని విస్తరిస్తారు. ఇప్పుడు అవి GC, BC & BB సేవలను అందించే లైవ్ ఆర్గానిక్ డేటా బేస్‌లతో క్రెడిట్ ఫెసిలిటేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ అవకాశాలను మెరుగుపరచడం వంటి పోర్టల్‌లుగా పని చేస్తాయన్నారు.

  • 01 Feb 2022 11:24 AM (IST)

    సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం..

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం వీటిని ప్రస్తావించారు. పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధికొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు కల్పించనున్నట్లుగా తెలిపారు. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధిదేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. మల్టీమోడల్‌ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేయడం. వచ్చే మూడేళ్లలో వంద కార్గో టెర్మినళ్ల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేస్తామన్నారు. పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహంరసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.

  • 01 Feb 2022 11:19 AM (IST)

    నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా నిర్మలమ్మ బడ్జెట్‌..

    నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పద్దును ప్రవేశ పెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రధాని గతిశక్తి యోజనసమీకృత అభివృద్ధి. అభివృద్ధి ఆధారిత ఉపాధి, ఉద్యోగ కల్పనపరిశ్రమలకు ఆర్థిక ఊతం, పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌... దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం అని అన్నారు.

  • 01 Feb 2022 11:14 AM (IST)

    త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ..

    నిర్మలా సీతారామన్​ ప్రసంగంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. నీలాంచల్‌ నిస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను ప్రైవేటు పరం చేశామన్నారు. త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ రాబోతుందన్నారు.

  • 01 Feb 2022 11:10 AM (IST)

    అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది.. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా భారత్..

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. వార్షిక బడ్జెట్​ 2022-23 ప్రసంగాన్ని ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్‌ పునాదిపారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది కానుందని బడ్జెట్ పద్దును ప్రవేశ పెడుతూ నిర్మలమ్మ తొలి మాటలు ఇవి. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందన్నారు. గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ పరుగు ప్రారంభమైందన్నారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రెడీ చేసినట్లుగా చెప్పారు. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా కలిసొచ్చిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించిందని వెల్లడించారు.

  • 01 Feb 2022 11:04 AM (IST)

    నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ చదవి వినిపిస్తున్నారు

    వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ను చదివి వినిపిస్తున్నారు.

  • 01 Feb 2022 10:41 AM (IST)

    బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

    పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర మంత్రివర్గం నేడు సమర్పించే బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పుడు 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

  • 01 Feb 2022 10:39 AM (IST)

    ఎర్రటి బ్యాగులో ట్యాబ్...

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంటుకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా నిర్మలమ్మ.. ఎర్రటి బ్యాగులో ట్యాబ్​లో బడ్జెట్​ను తీసుకొచ్చారు.

  • 01 Feb 2022 10:36 AM (IST)

    బడ్జెట్ డే బూస్టర్.. పైపైకి దూసుకుపోతున్న సూచీలు..

    నిర్మలా సీతారామన్ సమర్పించనున్న బూస్టర్ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. కొద్ది సేపటి క్రితం బీఎస్ఈ సెన్సెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. పారిశ్రామిక అనుకూల బడ్జెట్‌‌ను నిర్మలా సీతారామన్ సమర్పిస్తారని స్టాక్ మార్కెట్ మదుపర్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

  • 01 Feb 2022 10:35 AM (IST)

    పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

    బడ్జెట్ పత్రాలతో పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు.

  • 01 Feb 2022 10:32 AM (IST)

    బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన ఆర్థిక మంత్రి

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కిషన్‌రావ్ కరద్, పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు 2022-23 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు.

  • 01 Feb 2022 10:29 AM (IST)

    ట్రక్కులో వచ్చిన పద్దు ప్రతులు

    నేడు కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. బడ్జెట్​ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. ట్రక్కులో వచ్చిన పద్దు ప్రతులను లోపలికి తీసుకెళ్లారు సిబ్బంది.

  • 01 Feb 2022 10:26 AM (IST)

    మంత్రివర్గ సమావేశం ప్రారంభం

    పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆయన నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది.

  • 01 Feb 2022 10:12 AM (IST)

    బడ్జెట్ అంశాలను రాష్ట్రపతికి వివరించిన నిర్మలమ్మ

    బడ్జెట్ 2022-23ను కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె.. బడ్జెట్అంశాలను ఆయనకు వివరించారు. పార్లమెంట్‌లో 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • 01 Feb 2022 10:04 AM (IST)

    స్టాక్‌ మార్కెట్లో బడ్జెట్‌ డే జోష్‌..

    బడ్జెట్‌ డేన దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. స్టాక్‌ మార్కెట్లో భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ 655, నిఫ్టీ 178 పాయింట్ల భారీ లాభాలతో ట్రేడింగ్‌ అవుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11గంలకు 2022-23 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

  • 01 Feb 2022 08:37 AM (IST)

    మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10వ బడ్జెట్‌

    2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈరోజు తన 10వ బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు మంత్రి నిర్మలా సీతారామన్‌

  • 01 Feb 2022 08:26 AM (IST)

    ఉదయం 11 గంటల్ బడ్జెట్‌

    నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జె్‌ట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Published On - Feb 01,2022 8:24 AM

Follow us