త్వరలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడింగ్..

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడ్లు ఇవ్వాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. మూడు రకాలుగా గ్రేడ్లను నిర్ణయం చేయనున్నారు. ఆ ప్రకారం ప్యాకేజీ ధరలను ఖరారు చేయాలని యోచిస్తోంది తెలంగాణ సర్కార్.

త్వరలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడింగ్..
Follow us

|

Updated on: Oct 04, 2020 | 3:48 AM

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడ్లు ఇవ్వాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. మూడు రకాలుగా గ్రేడ్లను నిర్ణయం చేయనున్నారు. ఆ ప్రకారం ప్యాకేజీ ధరలను ఖరారు చేయాలని యోచిస్తోంది తెలంగాణ సర్కార్. ఇందులో ఏ, బీ, సీ గ్రేడ్లుగా ఆయా ఆస్పత్రులను  విభజించే అవకాశాలున్నాయి.

ఆరోగ్యశ్రీలో సంస్కరణలు తేవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తెచ్చేందుకు విధివిధానాలు తయారు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేం దర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో ఆరోగ్యశ్రీ, అలాగే ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాల (EJHS‌) లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద 338 ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో ఆరోగ్యశ్రీ కార్డు దారులు 77.19 లక్షల మంది ఉచితంగా వైద్యం పొందేందుకు వీలుంది. అలాగే ఈజేహెచ్‌ఎస్‌ కింద ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు లక్షలాది మంది వైద్యం పొందుతున్నారు.

అయితే ఆరోగ్యశ్రీలోని ప్యాకేజీ ధరలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలన్న డిమాండ్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆసుపత్రులను మూడు గ్రేడ్లుగా విభజించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. గ్రేడ్‌ ఏలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు.. గ్రేడ్‌ బీలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు.. గ్రేడ్‌ సీలో సాధారణ ప్రైవేట్‌ ఆసుపత్రులు వస్తున్నాయి.

అయితే ఈ గ్రేడ్లను ఖరారు చేయడానికి కొన్ని ప్రమాణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా ఆసుపత్రుల్లో ఉన్న వైద్య వసతులు, అత్యాధునిక పరికరాలు, సదుపాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే సామర్థ్యం కలిగిన వైద్య నిపుణులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశముంది. వాటి ప్రకారం మార్కులు పెట్టి గ్రేడ్లు ఖరారు చేస్తారు. ఇటు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు. మార్కులు, ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ప్యాకేజీలను ఖరారు చేస్తారు.