Pakistan – India : దారిలోకొచ్చిన దాయాది దేశం… భారత్ పై విధించిన దాదాపు రెండేళ్ల నిషేధానికి తిలోదకాలిచ్చిన పాక్
Pakistan finally relents : దాయాది దేశం ఎట్టేకలకు దారికొచ్చింది. దాదాపు రెండేళ్ల నిషేధానికి తిలోదకాలిస్తూ భారతదేశం నుండి చక్కెర, పత్తిని దిగుమతి..
Pakistan finally relents : దాయాది దేశం ఎట్టేకలకు దారికొచ్చింది. దాదాపు రెండేళ్ల నిషేధానికి తిలోదకాలిస్తూ భారతదేశం నుండి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిచ్చింది. పాకిస్తాన్ ఇక మీదట భారతదేశం నుండి షుగర్, కాటన్ దిగుమతి చేసుకుంటుందని ఆ దేశ ఆర్థిక మంత్రి హమ్మద్ అజార్ బుధవారం ప్రకటించారు. దీంతో భారత్ నుంచి దిగుమతులపై పాకిస్తాన్ విధించిన నిషేధం 19 నెలల తర్వాత ఎత్తివేసినట్లైంది.
ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ (ఇసిసి) భేటీ అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్టు పాక్ ఆర్థిక మంత్రి తెలిపారు. ఫలితంగా పాకిస్తాన్ లోని ప్రైవేటు రంగానికి ఐదు లక్షల టన్నుల తెల్ల చక్కెరను భారతదేశం నుండి దిగుమతి చేసుకోవడానికి వీలుకలుగుతుందన్నారు. “భారతదేశంలో చక్కెర ధర చాలా తక్కువ.. అందువల్ల, భారతదేశంతో చక్కెర వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని మేము నిర్ణయించుకున్నాము” అని మంత్రి అజార్ స్పష్టం చేశారు.
అంతేకాదు, ఈ ఏడాది జూన్ నుంచి పాకిస్తాన్ పత్తిని కూడా భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుందని పాక్ ఆర్థిక మంత్రి చెప్పారు. “భారతదేశం నుండి పత్తి దిగుమతి నిషేధించడం కారణంగా అది తమ SME లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు భారత్‌తో పత్తి వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని కూడా నిర్ణయించామని ఆయన అన్నారు. ఇలా ఉండగా, చెక్కెర, పత్తి వస్తువుల దిగుమతిని తిరిగి ప్రారంభించడం భారత్ – పాక్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల పాక్షిక పునరుద్ధరణకు దారితీస్తుందని పాక్ వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి.
వాస్తవానికి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు కాగా, రెండవ పెద్ద చక్కెర ఉత్పత్తి చేసే దేశం. 2019 వరకు, భారతీయ పత్తిని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో పాకిస్తాన్ ఒకటి. అయితే, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేసిన తరువాత ఇస్లామాబాద్.. భారతదేశం నుండి ఆయా వస్తువుల దిగుమతిని నిషేధించింది.
అయితే, పాకిస్తాన్ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం, దీనికి ప్రతిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాయడం తెలిసిందే. ఈ సుహృద్భావ వాతావరణం ఏర్పడ్డ తర్వాతి రోజే ఈ కీలక వాణిజ్య పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అంతేకాదు, మోదీకి థ్యాంక్స్ చెబుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ రాసిన లేఖలో జమ్మూ కాశ్మీర్ గురించి, భారతదేశం – పాకిస్తాన్ మధ్య శాంతి గురించి కూడా మాట్లాడారు.
పాకిస్తాన్ ప్రజలు భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటున్నారని ఖాన్, ప్రధాని నరేంద్రమోదీకి తన లేఖలో పేర్కొన్నారు. “దక్షిణ ఆసియాలో సుస్థిర శాంతి – స్థిరత్వం కోసం భారత్ – పాకిస్తాన్ల మధ్య ఉన్న అన్ని సమస్యలను.. ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడంలో నిరంతరాయంగా తమ వంతు తోడ్పాటు ఉంటుంది” అని ఇమ్రాన్ భారత ప్రధానికి రాసిన లేఖలో ఉటంకించారు.
Read also : Vijayasai Reddy send off wish : విధి నిర్వహణలో విఫలమైన నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలంట.!