#MP Tussle మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా… బీజేపీకి లైన్ క్లియర్

ఎట్టకేలకు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్లయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ బలం 92కు పడిపోయింది.

#MP Tussle మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా... బీజేపీకి లైన్ క్లియర్
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 20, 2020 | 12:53 PM

Madhya Pradesh CM Kamalnath resigns: ఎట్టకేలకు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్లయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ బలం 92కు పడిపోయింది. దానికి తోడు ఎలాంటి బేరసారాలకు అవకాశం లేకుండా శుక్రవారమే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంతో.. వేరే దారి లేక కమల్ నాథ్ సీఎం సీటు నుంచి తప్పుకునేందుకు సిద్దపడ్డారు. బలపరీక్ష ప్రారంభానికి ముందే శుక్రవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

నెల రోజులుగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి దాదాపుగా తెరపడింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది తిరుగుబాటు బావుటా ఎగుర వేయడం.. ఆ తర్వాత పరిణామాల్లో జ్యోతిరాదిత్య బీజేపీ తీర్థం పుచ్చుకుని.. రాజ్యసభకు ఎన్నికవడం జరిగిపోయాయి. సింధియా వెళ్ళిపోయినా.. ఆయన వర్గాన్ని బుజ్జగించేందుకు సీఎం కమల్ నాథ్.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ యధాశక్తి ప్రయత్నించారు. సింధియా వర్గం ఎమ్మెల్యేలు క్యాంపు నిర్వహిస్తున్న బెంగళూరుకు కమల్ నాథ్ కేబినెట్ మంత్రులు వెళ్ళి మరీ కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వారు దిగి రాలేదు. ఒక దశలో ముఖ్యమంత్రి స్వయంగా బెంగళూరు వెళతారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ జరగలేదు.

ఈ క్రమంలో ఒక వైపు గవర్నర్ లాల్జీ టాండన్ ఒత్తిడి.. మరోవైపు సుప్రీం కోర్టు జోక్యం.. ఇలా కమల్ నాథ్‌పై ఒత్తడి అధికమైంది. శుక్రవారమే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం… గురువారం రాత్రి స్పీకర్ ప్రజాపతి సడన్ డెసిషన్‌తో రాజీనామాలను ఆమోదించడం… వరుస పరిణామాలు కమల్ నాథ్‌పై విపరీతమైన ఒత్తిడి పెంచాయి. ఈ క్రమంలో బలపరీక్షకు ముందే ఎవరి బలం ఎంతో తేలిపోవడంతో కమల్ నాథ్ రాజీనామాకు సిద్దపడ్డారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యులు 224 కాగా.. అందులో రెండు సీట్లు ఖాళీగా వున్నాయి. మిగిలిన 222 మందిలో 16 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 108 గా వున్న కాంగ్రెస్ పార్టీ బలం 92కు పడిపోయింది. మరోవైపు బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజీనామాల తర్వాత ప్రస్తుతం అసెంబ్లీలో వున్న ఎమ్మెల్యేల సంఖ్య 206కు తగ్గింది. అసెంబ్లీలో బలనిరూపణకు 104 మధ్య సభ్యుల అవసరం వుంది. బీజేపీకి సొంతంగా 107 మంది సభ్యులుండగా.. నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. సో.. బలపరీక్షలో కమల్ నాథ్ ఓటమి ఖాయమవడంతో ఆయన ముందే రాజీనామాకు సిద్దపడ్డారు.

కాగా.. 15 నెలల క్రితం పూర్తి బలం లేకుండానే.. ఇండిపెండెంట్లు, బీఎస్పీ, ఎస్పీల మద్దతులో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం సీటును ఆశించి భంగపడ్డ జ్యోతిరాదిత్య సింధియా.. అప్పట్నించి అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో జ్యోతిరాదిత్యను తీసుకోవడంతోపాటు.. మధ్యప్రదేశ్ సీటును కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదిపింది. కమల్ నాథ్ రాజీనామాతో బీజేపీ వ్యూహం విజయవంతమైంది.