రేపే కీలక కేబినెట్ భేటీ..ఈలోగానే..!

అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు శుక్రవారం భేటీ కాబోతున్న ఏపీ కేబినెట్‌కు ముందు అమరావతిలో అసాధారణ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కేబినెట్ భేటీ సచివాలయంలో జరుగుతుందా? లేక సీఎం క్యాంప్ ఆఫీసులో జరుగుతుందా? ఇదిప్పుడు ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నగా మారింది. కేబినెట్ భేటీ సెక్రెటేరియట్‌లో జరిగితే అడ్డుకునేందుకు రాజధాని రైతులు ఆందోళనకు దిగొచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలు మొదలయ్యాయి. దాంతో రాజధాని ఏరియా అంతటా అప్రకటిత యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. […]

రేపే కీలక కేబినెట్ భేటీ..ఈలోగానే..!
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 26, 2019 | 6:37 PM

అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు శుక్రవారం భేటీ కాబోతున్న ఏపీ కేబినెట్‌కు ముందు అమరావతిలో అసాధారణ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కేబినెట్ భేటీ సచివాలయంలో జరుగుతుందా? లేక సీఎం క్యాంప్ ఆఫీసులో జరుగుతుందా? ఇదిప్పుడు ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నగా మారింది. కేబినెట్ భేటీ సెక్రెటేరియట్‌లో జరిగితే అడ్డుకునేందుకు రాజధాని రైతులు ఆందోళనకు దిగొచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలు మొదలయ్యాయి. దాంతో రాజధాని ఏరియా అంతటా అప్రకటిత యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

శుక్రవారం కేబినెట్ భేటీ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలను దింపారు. ఇప్పటికే మందడం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీ సెక్రటేరియట్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు అడ్డుగా పెట్టారు పోలీసులు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గుర్తింపు కార్డులు అడుగుతున్నారు.

మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద లాఠీలు పట్టుకుని పోలీసులు కవాతు నిర్వహించారు. తుపాకులు, లాఠీ చార్జ్‌ ,టియర్ గ్యాస్ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున బలగాలు దిగాయి. సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరించారు.

ఉద్రిక్త పరిస్థితులకు ప్రభుత్వ ధోరణే కారణమని రాజధాని ఏరియా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పోలీసులు యుద్ధ వాతావరణం సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే తమను రెచ్చగొట్టే విధంగా పోలీసు చర్యలు ఉన్నాయని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రివర్గ సమావేశానికి సహకరిoచేందుకు ధర్నా వేదికను ఉద్ధండరాయుని పాలానికి మార్చుకోవాలని యోచించినా.. పోలీసుల రెచ్చగొట్టే చర్యలతో తిరిగి మందడంలోనే కొనసాగించాలని నిర్ణయించామని అంటున్నారు.

ఒకవైపు కేబినెట్ భేటీ.. ఇంకోవైపు రాజధాని ప్రాంత గ్రామాల ప్రజల ఆందోళన మొత్తానికి శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు పెద్ద సవాల్‌ మారిన పరిస్థితి కనిపిస్తోంది.