Sun Transit 2026: మకర రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఐశ్వర్యం, అధికార యోగం..!
Sankranthi Horoscope 2026: జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు రవి మకర రాశిలో సంచరిస్తాడు. ఇది ఉద్యోగ, ధనపరంగా కీలక మార్పులను తెస్తుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశులకు రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశుల వారికి అద్భుతమైన అభివృద్ధి, ఉన్నత స్థితి, సంపద వృద్ధి, ప్రభుత్వపరమైన లాభాలు కలుగుతాయి. ఈ రవి సంచారం వారికి అదృష్టాన్ని అందిస్తుంది.

Sun Transit In Makara Rashi
జాతక చక్రంలో రవి రాశి మారడానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా, సంపద పరంగా రవి అనేక మార్పులను తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల(జనవరి) 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవి మకర రాశిలో సంచారం చేయబోతున్నాడు. రవికి మకర రాశి శత్రు క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశులకు మాత్రం రాజయోగాన్నిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశులకు మకర రవి అనేక శుభ ఫలితాల నివ్వడం జరుగుతుంది. రవి అధికారానికి, ఐశ్వర్యానికి, హోదాకు, ప్రభుత్వానికి కారకుడైనందు వల్ల ఈ అంశాల్లో ఈ రాశుల వారికి ఫిబ్రవరి 16 వరకూ కనీవినీ ఎరుగని అభివృద్ధి ఉంటుంది.
- మేషం: ఈ రాశికి రవి దశమంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టింది. దీని వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్నవారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
- వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన రవి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగులు, నిరు ద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం ఉంది. పిత్రార్జితం లభించే అవకాశం కూడా ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి దనాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉన్నతాధికారంలో ఉన్న వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఆదాయపరంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా రెట్టింపు ఫలితాలనిస్తుంది. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అత్యధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
- తుల: ఈ నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్న రవి వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వారసత్వపు సంపద లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. గృహ యోగం పడుతుంది.
- మీనం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రవి వల్ల జాతకంలో ఎటువంటి దోషాలున్నా పరిహారమవుతాయి. ముఖ్యంగా ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఆదాయం దినదినాభి వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.