Money Astrology: గురువు, శని ప్రతికూలత.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!
కొత్త సంవత్సరంలో మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం రాశుల వారికి ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. గురు, శని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల ధన నష్టాలు, అనవసర ఖర్చులు, మోసాలు జరిగే అవకాశముంది. డబ్బు ఇవ్వడం, హామీలు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆర్థిక నిర్వహణలో అజాగ్రత్త పెద్ద నష్టాలను కలిగిస్తుంది.

Money Astrology 2026
కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో, డబ్బు ఇవ్వడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం కూడా చాలా మంచిది. ఆర్థికంగా బాగా నష్టపోవడానికి, చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవడానికి బాగా అవకాశం ఉంది. మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఎంత తక్కువ ఖర్చు పెడితే అంత ఉత్తమం. వీరికి ధన కారకుడైన గురువు అనుకూలంగా లేకపోవడం, శని కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండడం వల్ల ఆర్థిక నిర్వహణ, అజమాయిషీల్లో దెబ్బతినే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో లాభాధిపతి శని సంచారం వల్ల జూన్ వరకు ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పొగడ్తలకు కరిగిపోవడం, అనవసర వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికి రాదు. డబ్బు చేతిలో నుంచి పోతే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. సాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆస్తి విషయాల్లో కూడా ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.
- సింహం: ఈ రాశివారికి అష్టమ శని జరుగుతుండడంతో పాటు గురువు జూన్ నుంచి వ్యయ స్థానంలోకి వస్తున్నందువల్ల ఏడాది ద్వితీయార్థమంతా వృథా ఖర్చులు, ఉచిత సహాయాలు, దానధర్మాలతో గడిచిపోయే అవకాశం ఉంది. బంధుమిత్రులు డబ్బు తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఉండకపో వచ్చు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోవడం మరీ మంచిది. ఆస్తి వివాదాల్లో బంధువుల వల్ల బాగా మోసపోయే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి ధన, పంచమాధిపతిగా అత్యంత శుభుడైన గురువు అష్టమ స్థానంలో సంచారం వల్ల జూన్ వరకు ఆర్థిక లాభం కన్నా ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. పంచమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల పొరపాట్లు, తప్పటడుగులకు బాగా అవకాశం ఉంది. ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు. ఎవరి నుంచీ డబ్బు తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలకు కూడా దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక నిర్వహణ బాధ్యతలను జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు అప్పగించడం చాలా ఉత్తమం.
- ధనుస్సు: ఈ రాశివారికి అర్ధాష్టమ శని జరుగుతుండడం, జూన్ నుంచి రాశ్యధిపతి, ధనకారకుడు అయిన గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఏడాది ద్వితీయార్థంలో చేతిలో నయా పైసా కూడా నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంక్ నిల్వలు కూడా బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడంతో పాటు, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ కపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. భారీగా ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి.
- కుంభం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని జరుగుతుండడం, జూన్ తర్వాత ధనాధిపతి గురువు షష్ట స్థానంలో ప్రవేశిస్తుండడం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవడం జరుగుతుంది. ఆర్థిక, రుణ సమస్యల పరిష్కారానికి కూడా బాగా వ్యయమయ్యే అవకాశం ఉంది. ప్రథమార్థంలో దాచుకున్న సొమ్ములో చాలా భాగం ద్వితీయార్థంలో ఖర్చయిపోతుంది. ఆదాయంలో ఎక్కువ భాగం మిత్రుల మీదా, విలాసాల మీదా దుర్వ్యయం అవుతుంది. మిత్రుల వల్ల మోసపోవడం కూడా జరుగుతుంది.
- మీనం: ప్రస్తుతం ఏలిన్నాటి శని జరుగుతున్న ఈ రాశివారికి రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల జూన్ వరకు ఆర్థిక పరిస్థితి సజావుగా ఉండే అవకాశం లేదు. ఆధ్యాత్మిక విషయాల మీదా, కుటుంబం మీదా ఖర్చులు పెరగడంతో పాటు, బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం, మోసపోవడం ఎక్కువగా జరుగుతుంది. గృహ నిర్మాణం కూడా తడిసి మోపెడవుతుంది. ఆస్తి, ఆర్థిక, ఆదాయ వ్యవహారాల్లో మిత్రులు, సహచరుల వల్ల భారీగా ధన నష్టం జరుగుతుంది.