Sun Transit: ఉచ్ఛ స్థితిలో రవి.. ఆ రాశుల వారికి శుభ, ధన యోగాలు..!
Sun Transit: ఏప్రిల్ 14 నుండి మే 14 వరకు సూర్యుడు మేష రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, కుటుంబం మొదలైన విషయాల్లో శుభప్రభావం ఉంటుంది. ఇతర రాశుల వారు సూర్య స్తోత్ర పఠనం చేయడం మంచిది.

Sun Transit
ఈ నెల (ఏప్రిల్) 14 నుంచి మే 14 వరకు రవి మేష రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం జరుగుతుంది. అధికారానికి, ఐశ్వర్యానికి, రాజకీయాలకు, ప్రభుత్వానికి, నాయకత్వానికి కారకుడైన గ్రహరాజు సూర్యుడు ఉచ్ఛపట్టడమంటే కొన్ని రాశుల వారికి రాజయోగాలు పట్టడం గానే భావించాలి. ఒక్కొక్క రాశిలో నెల రోజులు మాత్రమే ఉండే రవి.. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభ రాశుల వారిని తప్పకుండా ఉచ్ఛ స్థితికి తీసుకువెళ్లడం, ఆ రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకు రావడం జరుగుతుంది. ఈ రాశులవారే కాక, ఇతర రాశులు కూడా ఈ నెల రోజులు ఆదిత్య హృదయాన్ని, సూర్య స్తోత్రాన్ని పఠించడం శుభ ఫలితాలనిస్తుంది.
- మేషం: ఈ రాశిలో రవి ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయాలు సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు ఒక వెలుగు వెలుగుతారు.ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. మనసులోకి కోరికలు చాలావరకు నెరవేరుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలుగుతుంది.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం అనేక విధాలుగా రాజయోగాలు, ధన యోగాలనిస్తుంది. లాభ స్థానంలో ఉన్న రవి కోటి దోషాలను పోగొడతాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఆదా యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచే కాక, ప్రభుత్వం నుంచి, సమాజం నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో రవి ఉచ్ఛ పట్టడం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలుగుతుంది. ఒక ప్రముఖుడి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది.
- సింహం: రాశ్యధిపతి అయిన రవి భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం చేప ట్టినా విజయవంతం అవుతుంది. ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందుతారు. ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి అడ్డంకులు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిరత్వం పొందుతారు.
- ధనుస్సు: ఈ రాశికి అత్యంత శుభుడైన రవి పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు లాభాల వర్షం కురిపిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభ, నైపుణ్యాలు, సమర్థతలకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాలు కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు. సంతాన యోగం కలగడానికి బాగా అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల జీవితంలో అనేక విధాలైన పురోగతి ఉంటుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల, ప్రయత్నాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్మును, రాదనుకున్న సొమ్మును, బాకీలు, బకాయిలను రాబట్టుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరగా పురోగమించడం ప్రారంభిస్తాయి.



